logo

శ్మశానం చుట్టూ..వైకాపా శవ రాజకీయం

ఓ దళితవాడ శ్మశాన వాటిక.. రాజకీయాంశంగా మారిపోయింది. గ్రామాన్ని, గ్రామస్థులను రెండుగా చీల్చింది. నాయకుల స్వార్థంతో ఇదేళ్లుగా రాజకీయ జ్వాలల్లో రగులుతూనే ఉంది.

Updated : 16 Apr 2024 05:49 IST

దళితవాడవాసులకు ఐదేళ్లుగా వేధింపులు
గ్రామం వీడిన పలువురు

బంగారమ్మ కాలనీలో ఇళ్ల మధ్యలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతం

ఓ దళితవాడ శ్మశాన వాటిక.. రాజకీయాంశంగా మారిపోయింది. గ్రామాన్ని, గ్రామస్థులను రెండుగా చీల్చింది. నాయకుల స్వార్థంతో ఇదేళ్లుగా రాజకీయ జ్వాలల్లో రగులుతూనే ఉంది. చస్తే పూడ్చిపెట్టడానికి ఆరడుగుల జాగా కావాలని అడిగిన పాపానికి అధికారపార్టీ నాయకుల ఉక్కుపాదాల కింద నలిగిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆధ్మాత్మిక నగరంలో అధర్మం రాజ్యమేలేలా జరుగుతున్న ఈ తతంగం అధికార వైకాపా నాయకుల అసలు రంగును తెలియజేస్తోంది.

జీవకోన (తిరుపతి), న్యూస్‌టుడే: తిరుపతి నగరం 50వ డివిజన్‌ పరిధిలోని తిమ్మినాయుడుపాలెం దళితవాడ గ్రామస్థులు పదేళ్లుగా శ్మశానవాటిక కోసం పోరాడుతున్నారు. గతంలో గ్రామానికి దక్షిణ దిక్కున ఉన్న కొంత ప్రైవేటు భూమి, కొంత కాలువ పోరంబోకు భూమిలో అనధికారికంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రైవేటు భూములను వాటి యజమానులు స్వాధీనం చేసుకోవడంతోపాటు సమీపంలోని కాలువ పోరంబోకును కలిపేసుకున్నారు. దీంతో గ్రామస్థులు శ్మశానవాటిక కోసం ప్రభుత్వాధికారులు, నాయకుల చుట్టూ తిరగడం ప్రారంభించారు. 2018 నవంబరులో తెదేపా ప్రభుత్వం గ్రామానికి ఉత్తర దిక్కునున్న రెండెకరాల అటవీభూమిని కేటాయించేలా ఆదేశాలు జారీచేసింది. ఇదిలా కొనసాగుతుండగానే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో శ్మశానవాటిక అంశం రాజకీయ రంగు పులుముకుంది. తమతో చేతులు కలపాలని వైకాపా నాయకులు షరతులు పెట్టడం, ఇందుకు స్థానిక తెదేపా నాయకులు ససేమిరా అనడంతో రాజకీయంగా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. గ్రామస్థులను రెండుగా చీల్చి దళితులు నిర్మించుకున్న బంగారమ్మకాలనీలో ఇళ్ల మధ్యే శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేలా రెచ్చగొట్టారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో గాయపడిన తెదేపా మద్దతుదారులు పోలీసులను ఆశ్రయించగా వారిపైనే రివర్స్‌ కేసులు పెట్టించేలా చేశారు. ఇప్పుడు గ్రామంలో తెదేపా మద్దతుదారులు ఒక్కొక్కరిపై పది కేసులకు పైగా ఉన్నాయంటే వైకాపా నేతల ఒత్తిడే కారణం. ఈ నేపథ్యంలో వారు గ్రామం విడిచి బెయిళ్లకోసం అజ్ఞాతంలో ఉండి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం ఎన్నికల నాటికైనా గ్రామంలోకి వస్తామో లేదోనన్న ఆందోళన వారిలో ఉంది.

2022 సెప్టెంబర్‌ 17న రాష్ట్ర వ్యాప్తంగా దళితవాడలకు సంబంధించి శ్మశానవాటికల కోసం దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లో భూమిని కొనుగోలు చేసైనా ఇవ్వాలని సీˆఎంవో నుంచి అధికారికంగా ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో గ్రామస్థులు అనేక పర్యాయాలు కలెక్టర్‌, ఆర్డీవో, కమిషనర్‌, అటవీ అధికారులను కలిసి విన్నవించారు. రాజకీయ ఒత్తిళ్లతో వారూ స్పందించలేదు.

ఇంటిల్లిపాదీ కేసులు

శ్మశానం కోసం పోరాడితే వైకాపా నాయకులు గ్రామస్థులనే రెండుగా చీల్చారు. అంతిమ సంస్కారాల సమయంలో రెండువర్గాల మధ్య తగవులు పెట్టారు. మమ్మల్ని, మా వారిని కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయిస్తే ప్రతిగా హత్యాయత్నం కేసులు నమోదు చేయించారు. చదువుకుంటున్న పిల్లలపైనా కేసులు పెట్టి వేధిస్తున్నారు. గ్రామాన్ని వదిలిపెట్టిపోయేలా చేశారు.

కాయం వెంకటరత్నం, తెదేపా ఎసీˆ్ససెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని