logo

మార్కులు రాలేదని చిన్నారులను చితకబాదిన హెచ్‌ఎం

సమ్మెటీవ్‌ పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని ఐదుగురు విద్యార్థులను చితకబాదిన హెచ్‌ఎం వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది.

Published : 17 Apr 2024 03:22 IST

పెద్దపంజాణి: సమ్మెటీవ్‌ పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని ఐదుగురు విద్యార్థులను చితకబాదిన హెచ్‌ఎం వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది.  మండలంలోని జంగాలపల్లె ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామచంద్ర 5వ తరగతి విద్యార్థులను విచక్షణారహితంగా కర్రతో చితకబాదాడు.  ఈనెల 1-13 తేదీ వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు నిర్వహించారు. సోమవారం ఆ ఫలితాలు ఇచ్చారు. 5వ తరగతి విద్యార్థులు అంజలి, నరసమ్మ, పావని, ఉష, రక్షిత, నందీష్‌ను కర్రతో ఇష్టానుసారంగా కొట్టాడు. దీంతో వాతలు తేలాయి. ఏడుస్తూ చిన్నారులు ఇంటికి పరుగులు తీశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులకు మంచి మార్కులు రాలేదని హెచ్‌ఎం కొట్టాడని చెప్పారు. తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకుని హెచ్‌ఎంను నిలదీశారు. సరైన సమాధానం రాకపోవడంతో విద్యాశాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా ఎంఈవోలు గోపాల్‌రెడ్డి, తులసీరామ్‌ మంగళవారం గుట్టుగా పాఠశాలను సందర్శించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు తీసుకుని విచారణ చేపట్టారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ‘న్యూస్‌టుడే’ చరవాణిలో ఎంఈవోను సంప్రదించేందుకు యత్నించగా ఆయన స్పందించలేదు. కొట్టిన ఉపాధ్యాయుడ్ని బదిలీ చేయాలని లేకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని