logo

ప్రజల చేతుల్లోనే రామరాజ్యం

ఓటు అనే వజ్రా  యుధంతోనే రామ రాజ్యం సాధ్యమవుతుంది. అయిదేళ్ల  భవితకు పట్టం కడుతుంది. పాలకులు సంక్షేమ సారథులు కావాలంటే ఎన్నికల వేళ ఓటర్లంతా రామబాణం సంధించాలి.

Published : 17 Apr 2024 06:23 IST

ఓటు అనే వజ్రా  యుధంతోనే రామ రాజ్యం సాధ్యమవుతుంది. అయిదేళ్ల  భవితకు పట్టం కడుతుంది. పాలకులు సంక్షేమ సారథులు కావాలంటే ఎన్నికల వేళ ఓటర్లంతా రామబాణం సంధించాలి.

న్యూస్‌టుడే, గాంధీనగర్‌ (కాకినాడ)

ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరాముడని రామాయణం చెబుతోంది. మనుషుల ప్రత్యేక గుణం ధర్మం. రాజు ధర్మరక్షా పరుడైతేనే పాలన సజావుగా సాగుతుంది. ధర్మాన్ని రక్షిస్తూ, దాన్ని కొనసాగిస్తే ప్రజలూ ఆచరిస్తారనేది రామాయణం మనకు తెలియజేసింది. నేటి పాలకులు ధర్మం మాట మరిచి అధర్మం ఆచరణాత్మకం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి పదవిని చేజిక్కించుకోవడంతోపాటు ఆడిన మాటకు విలువ నివ్వకుండా పదవీ కాంక్షతో రగిలిపోతున్నారు. రామరాజ్యం అంటే సర్వజన సంక్షేమం. ప్రకృతి, సహజ వనరుల పరిరక్షణే పరమావధి.. శాంతి సౌభ్రాతృత్వాలకు నిలయం. అటువంటి రామరాజ్యం సాకారం ప్రజల చేతుల్లోనే ఉంది. తాయిలాలు తాంబూలాలుగా ఇచ్చే నాయకులు కాకుండా.. సుపరిపాలన చేసే వారికి ఓటుతో పట్టం కట్టాల్సిన తరుణమిది.

 నాడుజనరంజకం..

రాముడి పాలన అత్యుత్తమంగా సాగిందని పురాణాలు చెబుతున్నాయి. సామంత రాజులను గౌరవిస్తూ, సమర్థులైన మంత్రులతో పాలన చేశాడు. గ్రామస్థాయిలో రామరాజ్య సుపరిపాలనా ఫలాలు అందేలా చేసిన గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు.

నేడుప్రజాపీడితం

ప్రస్తుత పాలకులు ప్రభుత్వాన్ని రౌడీరాజ్యంగా మార్చేశారు. ప్రజల శ్రేయస్సు మరిచి వారి భూములు, ఇళ్లను లాక్కున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఉన్నాయి. శాంతిభద్రతలు కాపాడాల్సిన యంత్రాంగం.. పాలకుల ప్రోద్బలంతో కొన్నిచోట్ల ప్రజలనే పీడించిన పరిస్థితి. గ్రామస్థాయి పాలనలో అధికార పార్టీ నాయకుల దాష్టీకం పెరిగింది.

శాంతివనం..

రామరాజ్యంలో ప్రజలకు ఎటువంటి బాధలు ఉండేవి కావు.  శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసినట్లు తెలిపే అనేక సంఘటనలు రామాయణంలో ఉన్నాయి. రాజంటే ప్రజా సేవకుడని రాముడు తలచాడు. ఆయన్ను ఆదర్శంగా తీసుకున్న భరతుడు అన్న వనవాసానికి వెళ్లే సమయంలో 14 ఏళ్లు సుపరిపాలన అందించాడు.

దౌర్జన్యాలకు నిలయం

అయిదేళ్లుగా జిల్లాను దౌర్జన్యాలు, దోపిడీలకు నిలయంగా మార్చేశారు. తమకు ఎదురు చెప్పిన వారిని బెదిరించడం.. దాడిచేయడం.. నిత్యకృత్యంగా మార్చేశారు. ఆడా.. మగ, చిన్నాపెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెడుతూ, స్వప్రయోజనాలే లక్ష్యంగా నాయకులు పలుచోట్ల తెగబడ్డారు.

నాడంతా ఒకే మాట...

శ్రీరాముడుది ఒకే మాట.. ఒకే బాణం. తండ్రికి ఇచ్చిన మాటకోసం వనవాసం చేశాడు. ప్రజాసంక్షేమ కోసం రాత్రీపగలు శ్రమించాడు.

మడమ తిప్పడమే బాట

నేటి పాలకులు ఎన్నో మాటలిచ్చి. మడమ తిప్పారు. మంత్రులు సైతం ఆ బాటలోనే పయనించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పినా పరిహారం పరిహాసమే అయ్యింది. సహకార రంగంలో కోట్లాది రూపాయల దుర్వినియోగంపై నిగ్గుతేల్చి నివేదికివ్వాలని ఆదేశించినా నాలుగేళ్లయినా అతీగతీలేదు. రోడ్లపై గుంతకూడా పూడ్చలేని దుస్థితి. ఓ మంత్రి తాను చూసే శాఖను ఏకంగా పార్టీ ప్రచారం కోసమే
వినియోగించేశారు. ప్రజల అభివృద్ధి కన్నా.. తమ స్వప్రయోజనాలకే పదవులను ఉపయోగించుకున్నారు.

కర్తవ్య దీక్ష...

రామరాజ్యంలో సత్యమే మాట్లాడేవారు. అన్ని వృత్తులవారు తమ కర్తవ్యాలను దీక్షగా పూర్తి చేస్తూ.. పనిలో సంతోషాన్ని వెతుక్కునేవారు. ప్రజామోదమైన పన్నుల విధానం ఉండేది.

స్వప్రయోజన కాంక్ష

అయిదేళ్లుగా వృత్తి పనులు చేసేవారికి ‘ఆదరణ’ కరవైంది. స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారు. పార్టీ రంగుల కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఖర్చుచేశారు. సంక్షేమ పథకాల పేరుతో కొందరికే ప్రయోజనం దక్కగా.. నిజమైన పలువురు ప్రోత్సాహం కరవై అవస్థలు పడ్డారు. అన్నపూర్ణలాంటి జిల్లాలో వరి రైతులు ఉరివేసుకునే దుస్థితికి తీసుకొచ్చారు. ఇంటి పన్నులు, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్తు ఛార్జీలతో భారం మోపారు. ఉపాధి చూపడం ద్వారా యువత భవితకు భరోసా ఇవ్వాల్సిన వారు.. పలువురిని మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చారు.

ప్రకృతి పరవశం...

శ్రీరామచంద్రమూర్తి పాలనలో నదులు, సరస్సులు నిత్యం నీటి ప్రవాహంతో కళకళలాడేవి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు చెరువులు, కుంటలు తవ్వించడంతోపాటు పంటలకు నీరు అందేలా సక్రమమైన వ్యవస్థ ఉండేది.  రోడ్ల పక్కన మొక్కలు నాటించడంతోపాటు కొండలు, గుట్టలు పచ్చదనంతో కళకళలాడేవి.

పర్యావరణ హతం

నేటి పాలకులు స్వప్రయోజనాలతో సహజ వనరులను దోచేశారు. గోదారమ్మ గుండెల్లో యంత్రాలు దింపి ఇసుకను తోడేశారు. కళ్లెదుటే కొండలు, గుట్టలు కరిగించేశారు. ప్రశ్నించేవారిపై జంతువులకంటే హీనంగా దాడికి తెగబడ్డారు. మొక్కలు నాటడాన్ని ప్రజలకు అలవాటుగా చేయాల్సిన వారు కాస్త.. పచ్చని చెట్లను అడ్డంగా నరికి ప్రకృతి విఘాతకులుగా మారారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని