logo

మరో 28,853 మందికి ఓటు హక్కు

జిల్లాలోని కాకినాడ పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు ఈ నెల 18 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

Published : 17 Apr 2024 06:15 IST

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని కాకినాడ పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికలకు ఈ నెల 18 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 వరకు అర్హత ఉన్నవారందరికి ఓటు హక్కు కల్పించేందుకు ఫారం-6 దరఖాస్తులు స్వీకరించారు. కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను ఈ ఏడాది జనవరి 22న విడుదల చేశారు. 2024, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు, ఇప్పటి వరకు అర్హత ఉన్నా ఓటు నమోదు చేసుకోని వారికి కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసే అవకాశం కల్పించారు. దీనిలో భాగంగా జనవరి 22 తర్వాత ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు కోసం 43,354 మంది దరఖాస్తు చేశారు. మంగళవారం మధ్యాహ్నం వరకు వీటిలో 28,853 మంది దరఖాస్తుదారులకు కొత్తగా ఓటు హక్కు కల్పించారు. 7,622 దరఖాస్తులు తిరస్కరించారు. ఇంకా 6,879 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నెల 20 నాటికి ఏడు నియోజకవర్గాల ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు(ఈఆర్వో) వీటిని పరిష్కరించనున్నారు. ఇలా కొత్తగా ఓటు హక్కు పొందిన వారు వచ్చేనెల 13న జరుగున్న ఎన్నికల పోలింగ్‌లో ఓటేసే అవకాశం కల్పించనున్నారు.

కాకినాడ గ్రామీణంలో అత్యధిక దరఖాస్తులు

జిల్లాలో జవనరి 22 నుంచి ఈ నెల 14 వరకు కొత్తగా ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే.. కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, పిఠాపురం నియోజకవర్గాల్లో అత్యధిక దరఖాస్తులు దాఖలయ్యాయి. జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 18-19 ఏళ్ల యువత 7,497 మంది ఓటు కోసం దరఖాస్తు చేయగా, ఇప్పటికి 4,908 మందికి ఓటు హక్కు కల్పించగా.. 1,394 తిరస్కరించారు. ఇంకా 1,195 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా ఇలా..

నియోజకవర్గాల వారీగా ప్రస్తుత ఓటర్లు..

జనవరి 22 నుంచి ఈ నెల 16 వరకు ఈ నియోజకవర్గాల్లో పెరిగిన ఓట్లను పరిశీలిస్తే.. అత్యధికంగా కాకినాడ గ్రామీణంలో 6,701, పిఠాపురంలో 5,092, కాకినాడ నగరంలో 4,121, జగ్గంపేటలో 3,625, తునిలో 2,878, పెద్దాపురంలో 2,621, ప్రత్తిపాడులో 2,296 మంది చొప్పున ఓటర్లు పెరిగారు.

ఎన్నికల పరిశీలకుల నియామకం

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్‌ అధికారులు సాధిక్‌ అహ్మద్‌, ఆశిన్‌, యోగేశ్‌కుమార్‌ను, సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్‌ అధికారులు ఎస్‌.గణేశ్‌, రాజేశ్‌జోగేశ్‌పాల్‌ను నియమించారు. ఈ నెల 18లోగా వ్యయ పరిశీలకులు జిల్లాలో రిపోర్టు చేయాలని ఆదేశించిడంతో వీరు బుధవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని