logo

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు.

Published : 17 Apr 2024 06:25 IST

కలెక్టరేట్‌లో ప్రారంభించిన మీడియాసెల్‌ విభాగాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, జేసీ, ఇతర అధికారులు

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెల్‌ను మంగళవారం ప్రారంభించిన అనంతరం ఎస్పీ జగదీష్‌, జేసీ తేజ్‌భరత్‌, డీఆర్వో నరసింహులు, పార్లమెంట్‌ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎం.కృష్ణనాయక్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో రిటర్నింగ్‌ అధికారులు 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని, అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై 25 వరకు కొనసాగుతుందన్నారు. 21వ తేదీ ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఎంపీ అభ్యర్థుల నుంచి కలెక్టర్‌ ఛాంబర్‌లోను, ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి ఆయా రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్‌ పత్రాలు స్వీకరిస్తామన్నారు. నామినేషన్‌ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురిని మాత్రమే ఆర్వో ఛాంబర్‌లోకి అనుమతిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

  • 187 ప్రాంతాల్లో 1,577 పోలింగ్‌ కేంద్రాలు: మే 13న జరిగే పోలింగ్‌కు 187 ప్రాంతాల్లో మొత్తం 1,577 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. వీటిలో 181 ప్రదేశాల్లోని 367 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించా మన్నారు. 9,644 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
  • గృహ ఓటింగ్‌కు కార్యాచరణ సిద్ధం: ఈ నెల 10 నాటికి జిల్లాలో 16,16,918 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వీరిలో 85 ఏళ్లు పైబడిన, 40 శాతం పైబడి అంగవైకల్యమున్న వారు  28,010 మంది ఉన్నారని, వీరికి హోం ఓటింగ్‌ అవకాశం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. వీరినుంచి ఫారం-12డి దరఖాస్తులను ఈ నెల 22 వరకు స్వీకరిస్తామన్నారు.
  • కోడ్‌ ఉల్లంఘనలపై 481 ఫిర్యాదులు: సి-విజిల్‌ ద్వారా కోడ్‌ ఉల్లంఘనలపై 481 ఫిర్యాదులు రాగా 382 పరిష్కరించామని, 99 ఉపసంహరించామన్నారు. కేంద్ర ప్రభుత్వ సేవా పోర్టల్‌ ద్వారా 312 ఫిర్యాదులు అందాయన్నారు. కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి 46 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామన్నారు. 1,796 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు తెలిపారు. సువిధా, ఎన్‌కోర్‌ ద్వారా ప్రచార అనుమతులకు 597 దరఖాస్తులు రాగా వీటిలో 505 వాటికి అనుమతి ఇచ్చామని, 63 తిరస్కరించగా మిగతా 29 పరిశీలనలో ఉన్నాయన్నారు.
  • 6,006 మంది బైండోవర్‌: ఎస్పీ జగదీష్‌: ఇప్పటివరకు 6,006 మందిని బైండోవర్‌ చేసినట్లు ఎస్పీ పి.జగదీష్‌ తెలిపారు. జిల్లాలో 236 లైసెన్స్‌ ఆయుధాలు ఉండగా వీటిలో 177 డిపాజిట్‌ చేశారన్నారు. 8 చెక్‌పోస్టులలకు అదనంగా మరో ఎనిమిది ఏర్పాటు చేశామన్నారు. రూ.5.41 కోట్ల మేర నగదు, మద్యం, మాదకద్రవ్యాలు వంటివి సీజ్‌ చేశామన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని