logo

జిల్లాకు రానున్న ఎన్నికల పరిశీలకులు

కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్‌, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు.

Published : 19 Apr 2024 05:08 IST

కలెక్టర్‌ మాధవీలతతో చర్చిస్తున్న జైఅరవింద్‌ గోవింద్‌రాజన్‌

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు జిల్లాకు రానున్నారు. వీరికి అనుసంధానంగా లైజనింగ్‌, ఇతర సిబ్బందిని నియమించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌.కృష్ణనాయక్‌తో కలిసి ఆమె సమీక్షించారు. సాధారణ పరిశీలకులుగా కె.బాలసుబ్రహ్మణ్యం, కమల్‌కాంత్‌ సరోచ్‌, పార్లమెంట్‌ నియోజవర్గానికి వ్యయ పరిశీలకులుగా జైఅరవింద్‌ గోవింద్‌రాజన్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా నితిన్‌కురైన్‌, రోహిత్‌నగర్‌లను, గుజరాత్‌కి చెందిన బలరామ్‌ మీనాను పోలీసు అబ్జర్వర్‌గానూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమించిందన్నారు. రాజమహేంద్రవరం అర్బన్‌, గ్రామీణం, అనపర్తి, రాజానగరం నియోజకవర్గాలకు బాలసుబ్రహ్మణ్యం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలకు కమల్‌కాంత్‌ సరోచ్‌లు సాధారణ పరిశీలకులుగా నియమితులైనట్లు తెలిపారు. అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం అర్బన్‌ అసెంబ్లీ నియోజవర్గాలకు నితిన్‌కురైన్‌, రాజమహేంద్రవరం గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజవర్గాలకు రోహిత్‌నగర్‌ నియమితులయ్యారన్నారు. పోలీసు పరిశీలకునిగా బలరామ్‌మీనా వ్యవహరిస్తారన్నారు. వీరికి లైజనింగ్‌, అనుబంధ సిబ్బంది అవసరమైన సమాచారాన్ని అందించాలని కలెక్టర్‌ సూచించారు.

  • పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యయ పరిశీలకుడు జైఅరవింద్‌ గోవింద్‌రాజన్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలతను కలిశారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఖర్చుల అంచనా వివరాలు, దస్త్రాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

సార్వత్రిక ఎన్నికలు-2024కు సంబంధించి రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ గెజిట్‌ నోటిఫికేషన్‌ను గురువారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.మాధవీలత కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో విడుదల చేసి నోటీసు బోర్డులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ రూపొందించిన ప్రవర్తనా నియమావళి మేరకు నామినేషన్ల ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25 వరకు నోటిఫైడ్‌ తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తామని తెలిపారు. దీనిపై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్‌ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థితో సహా అయిదుగు మాత్రమే ఆర్వో కార్యాలయంలోకి అనుమతిస్తామన్నారు. ఫారమ్‌-26 ద్వారా అఫిడవిట్‌ సమర్పించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని