logo

మామ బడాయి మాటలు..

నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు

Published : 24 Apr 2024 06:32 IST

ఇదీ..నాడు-నేడు నిర్మాణాల తీరు

 నాడు-నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలల రూపు పూర్తిగా మార్చేస్తాం.. పిల్లలకు మౌలిక వసతులు కల్పించేస్తాం.. ఇదీ సీఎం జగన్‌ మామ బడికోసం చెప్పే బడాయి మాటలు.  క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. పూర్తికాని భవన నిర్మాణాలు.. వరండాల్లో తరగతులు.. విలీన పాఠశాలల్లో నిలిచిన పనులు.. అందుబాటులోకి రాని మరుగుదొడ్లు ఇవీ కనిపించే చిత్రాలు.  నిధులు విడుదలకాక పలుచోట్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లావ్యాప్తంగా ఒక్కసారి
పరిశీలిస్తే..

గోపాలపురం: నాడు-నేడు మొదటి విడత పనుల్లో మండలంలోని వాదాలకుంట మొదటి విడత పనులే ఇంకా..ఉన్నత పాఠø‹లలో ఆరు అదనపు గదులు మంజూరయ్యాయి. నిధులు కొరత కారణంగా వాటిని తగ్గించి నాలుగుకు తగ్గించారు. రూ.30 లక్షల నిధులు మంజూరైనట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. నాలుగేళ్లుగా నిర్మాణ పనులు ఆగుతూ.. ఇప్పటికి చివరిదశకు చేరాయి.

బాలబాలికలకు ఒకటే మరుగుదొడ్డి

నల్లజర్ల: మండలంలోని పలుచోట్ల నాడు-నేడు పనులు నిధులురాక నిలిచిపోయాయి. మారెళ్లమూడి ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు గదుల నిర్మాణం సగంలోనే ఆగిపోగా, అనంతపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో రెండు గదుల నిర్మాణం స్లాబ్‌ దశలో నిలిచిపోయింది. కొండాయిగుంట పాఠశాలలో విద్యార్థినుల మరుగుదొడ్లకు టైల్స్‌ అతికించక పోవడంతో తాత్కాలికంగా విద్యార్థినీ విద్యార్థులు ఒకే మరుగుదొడ్డి వినియోగించుకుంటున్నారు. నిధులు రాకపోవడంతో ఆర్వో ప్లాంట్‌ ట్యాంకును పాఠశాలలోని ఒక గదిలో దాచారు.

పరదాల చాటున ప్రయాస

సీతానగరం: సీతానగరం, వంగలపూడి ఉన్నత పాఠశాలల్లో 708 మంది విద్యార్థుల్లో 348 మంది బాలికలు. మరుగుదొడ్లు సరిగా లేక పరదాలు కట్టిన చోటనే కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. కట్టిన పరదాలు ఎండకు ఎండి, వానకు తడుస్తూ చిరిగిపోతున్నాయి. మళ్లీ దాతల సాయంతో కొత్తవి కొని కడుతున్నారు. ఈ పాఠశాలల్లోకి అడుగుపెడితే మాత్రం నాడు-నేడులో అభివృద్ధి పనులకు రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు శిలాఫలకాలుంటాయి. కనీసం మరుగుదొడ్లు నిర్మాణం పూర్తిచేసేలా అవసరమైన నిధులు కూడా ప్రభుత్వం విదల్చలేదు.

గదుల నిర్మాణమెప్పటికో..

కొవ్వూరు పట్టణం: వేములూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 153 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు-నేడు పనులకు రూ.49 లక్షలు కేటాయించారు. ఇప్పటివరకు రూ.22 లక్షలు పనులవ్వగా ఇంకా రూ.7 లక్షలు విడుదల కావాల్సి ఉంది. పై అంతస్తులో రెండు తరగతి గదులను నిర్మించినా పనులు పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తవుతాయో అర్థం కాని పరిస్థితి.

8.. కాదు 4.. చివరకు మూడే

తాళ్లపూడి: తాళ్లపూడిలోని జడ్పీహెచ్‌ పాఠశాలలో నాడు-నేడు కింద మొదటి విడత నిధులతో 8 గదుల నిర్మాణానికి రూ.96 లక్షలు నిధులు కేటాయించారు. తర్వాత నిధులు తగ్గించి నాలుగు గదుల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. తర్వాత మూడు గదులకే పరిమితం చేశారు. రూ.36 లక్షలతో పనులు చేపట్టారు. మిగిలిన మరో గదికి నిధులు రావాల్సి ఉంది. విద్యుత్తు పనులు నత్తనడకన సాగుతున్నాయి. సామగ్రి ఉపాధ్యాయుల గదిలో నిరుపయోగంగా ఉంది. కిటికీలు, తలుపులు పెట్టాల్సి ఉంది.

సిమెంట్‌ గడ్డ కట్టేసింది..

దేవరపల్లి: చిన్నాయిగూడెంలోని జడ్పీ పాఠశాలలో  13 అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. సిమెంట్‌, ఇసుక లేకపోవడంతో ఒకచోట స్లాబు స్థాయిలో, మరోచోట పునాది స్థాయిలో పనులు నిలిచిపోయాయి. ఎనిమిది నెలల క్రితం సిమెంట్‌ వచ్చినా గుత్తేదారుడు, విద్యాకమిటీ, హెచ్‌ఎంల నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నెలలు గడిచి సిమెంట్‌ బస్తాలు గడ్డలు కట్టాయి. కార్మికులు రాడ్డుతో బస్తాలు బద్దలు కొట్టి స్లాబుకి ఉపయోగించారు. మరోచోట పునాది స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి.

అరకొర నిధులు..అసంపూర్తి నిర్మాణాలు

శ్యామలాసెంటర్‌: రాజమహేంద్రవరం నగరంలోని మెరకవీధి మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలకు నాడు-నేడులో సుమారు రూ.12.50 లక్షల నిధులు ఇస్తామన్నారు. అరకొర నిధులు మంజూరు కావటంతో  వంటషెడ్‌ నిర్మాణం పూర్తికాలేదు. గదుల్లోని వారం క్రితం సిమెంటు గచ్చు పనులు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని