logo

నా ముస్లింలు అంటూనే నయవంచన!.. అయిదేళ్ల్లుగా ఆ వర్గంపై జగన్నాటకం

చందోలుకు చెందిన నిరుపేద ముస్లిం మూడేళ్ల క్రితం తన కుమార్తె వివాహానికి షాదీ తోఫా కింద దరఖాస్తు చేసుకున్నాడు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లపాటు పథకం అమలు చేయకపోవడంతో రూపాయి సాయం కూడా అతనికి అందలేదు.

Updated : 11 Apr 2024 10:03 IST

రంజాన్‌ తోఫా రద్దు, మూడున్నరేళ్లు అమలుకాని షాదీ తోఫా

మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి అందని రుణాలు

పర్చూరు: ఉప్పుటూరులో అయిదేళ్లుగా నిలిచిపోయిన షాదీఖానా నిర్మాణ పనులు

చందోలుకు చెందిన నిరుపేద ముస్లిం మూడేళ్ల క్రితం తన కుమార్తె వివాహానికి షాదీ తోఫా కింద దరఖాస్తు చేసుకున్నాడు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడున్నరేళ్లపాటు పథకం అమలు చేయకపోవడంతో రూపాయి సాయం కూడా అతనికి అందలేదు. అప్పులు చేసి వివాహం చేయాల్సి వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ పేద ముస్లిం యువతుల వివాహానికి షాదీ తోఫా కింద రూ.లక్ష సాయం చేస్తానని ప్రకటించాడు. అధికారంలోకి వచ్చాక తమను మోసం చేశాడని ఆ నిరుపేద ముస్లిం లోలోన కుమిలిపోయాడు. తెదేపా ప్రభుత్వ హయాంలో షాదీ తోఫా కింద   రూ.50 వేలు దరఖాస్తు చేసిన వెంటనే అందాయని, జగన్‌ ప్రభుత్వం మూడున్నరేళ్లు సాయం నిలిపివేసి అన్యాయం చేసిందని లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - బాపట్ల: ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగసభల్లో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వల్లమాలిన ప్రేమ కనబరుస్తుంటారు. ఆచరణలో మాత్రం వారిని అడుగడుగునా అణగదొక్కుతున్నారు. సీఎం జగన్‌ తన ఐదేళ్ల పదవీకాలంలో ముస్లిం, మైనార్టీల ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీను నూరుశాతం అమలు చేయలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా ఈ జనాభా గణనీయంగా ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి జగన్‌ కొత్తగా ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టకపోగా మేనిఫెస్టోలో ఇచ్చినవి విస్మరించారు.

తెదేపా హయాంలో కలిగిన మేలు..

తెదేపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా వ్యవహరించడంతో ఆ ప్రభుత్వ హయాంలో ఏటా రంజాన్‌ తోఫా కింద ఉమ్మడి గుంటూరులోనే లక్షల మందికి లబ్ధి చేకూరింది. దుల్హన్‌ పథకం పేద ముస్లిం యువతకు పెళ్లిళ్లు చేసి వారు జీవితంలో స్థిరపడేలా పెళ్లి ఖర్చులతో పాటు స్వయం ఉపాధికి చర్యలు తీసుకున్నారు. విదేశీ విద్యతో వేలాదిమంది విద్యార్థులను విదేశాలకు పంపి వారి ఉన్నత చదువులకు చేయూతనిచ్చింది. ఈ పథకం కింద ఉమ్మడి గుంటూరు నుంచి వెయ్యి మందికి పైగా విదేశాలకు వెళ్లి ఎంఎస్‌ చదువులు పూర్తి చేశారు. దుకాన్‌ ఔర్‌ మకాన్‌ పథకం కింద చిల్లర దుకాణాలతో పాటు చేతి వృత్తుల వారికి సాయమందించి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించారు. ఏటా హజ్‌యాత్రలకు వెళ్లేందుకు రాయితీలు అందజేశారు. ఇమామ్‌, మౌజమ్‌లకు గౌరవ వేతనాలు అందించింది. అన్నింటా మహర్దశ అనేలా చంద్రబాబు ప్రభుత్వం వారిని అక్కున   చేర్చుకుంది.

ఆ వర్గంలో అసంతృప్తి

వైకాపా ప్రభుత్వం రంజాన్‌ తోఫాను ఐదేళ్లలో ఒక్కసారి ఇవ్వలేదు. ఒక్క ఉమ్మడి గుంటూరులోనే ఈ పథకానికి 4 లక్షల మంది లబ్ధిదారులు గతంలో ఉండేవారు. ఐదేళ్లలో వీరికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ముస్లిం, మైనార్టీల ద్రోహిగా ముఖ్యమంత్రి జగన్‌ మిగిలిపోయారని ఆ వర్గం ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పాఠశాల, కళాశాల విద్య చదివే ముస్లిం, మైనార్టీల విద్యార్థులకు ఏటా రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు తెదేపా ప్రభుత్వంలో ఉపకారవేతనాలు ఇచ్చేవారు. వాటిని పూర్తిగా రద్దు చేసింది. ఉర్దూను రెండో బాషగా చేస్తామని హామీ ఇచ్చి విస్మరించింది. ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా 200కు పైగా ఉర్దూ స్కూళ్లు ఉన్నాయి. పాఠశాలల విలీనం పేరుతో ఆ స్కూళ్లను ఉన్నతీకరించలేదు. దీంతో ఉర్దూ టీచర్ల నియామకాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఉర్దూ అకాడమీ ద్వారా ఏటా ఉత్తమ ఉపాధ్యాయులకు రూ.5 వేల నుంచి 10 వేల దాకా ప్రోత్సాహక నగదు ఇచ్చేవారు. గత రెండేళ్ల నుంచి ఈ ప్రోత్సాహక నగదు ఇవ్వకుండా మొండిచేయి చూపింది.  

వక్ఫ్‌భూముల రక్షణ కాదు భక్షణ

అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డుకు చెందిన భూముల్ని రీసర్వేలో గుర్తించి ఆ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటామని హమీనిచ్చి విస్మరించింది. ఉమ్మడి గుంటూరులో 250 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు వక్ఫ్‌బోర్డు అధికారులు గుర్తించి ప్రబుత్వానికి నివేదించినా వాటి స్వాధీనానికి చర్యలు తీసుకోలేదు. పాతగుంటూరులోని అంజుమన్‌ షాదీఖానాను అధికార పార్టీ ప్రజాప్రతినిధి తన గుప్పిట్లో పెట్టుకుని   పేద ముస్లిం, మైనార్టీల నుంచి డబ్బులు దండుకుంటున్నారు.

సామూహిక వివాహాలు

పేద ముస్లిం యువతులు పెళ్లి చేసుకుంటే గత తెదేపా ప్రభుత్వం ఒకే రోజు సామూహిక వివాహాలు జరిపించి పెళ్లి కుమార్తె, కుమారుడి తరఫు వారికి వంద మందికి భోజనాలు పెట్టించటంతో పాటు బీరువా వంటివి కొనుగోలు చేసి ఇచ్చారు. తక్షణ సాయంగా వాటిని అందించారు. వైకాపా ప్రభుత్వం దాన్ని ఎత్తివేసింది. వైఎస్సార్‌ కానుకగా రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది. దీనికి దరఖాస్తులు అయితే స్వీకరించింది కానీ ఇప్పటి వరకు గుంటూరు నగరపాలకలో ఈ సాయం కోసం 70 మంది దరఖాస్తు చేసుకుంటే ఏ ఒక్కరికి సాయమివ్వలేదు. ఈసాయం చేయటానికి పది ఉత్తీర్ణులై ఉండాలని మెలికపెట్టడంతో ముస్లిం యువత ఈ పథకానికి దూరమవుతున్నారు.

మైనార్టీలకు సబ్‌ప్లాన్‌, వక్ఫ్‌, ముస్లిం, మైనార్టీలకు చెందిన అన్ని ఆస్తులను రీ సర్వేచేయించి ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షిస్తామని, ముస్లిం, మైనార్టీల చెల్లెమ్మల వివాహానికి వైఎస్‌ఆర్‌ కానుకగా రూ.లక్ష, ఆర్థిక సాయం, ఇమామ్‌లకు ఇళ్లస్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇస్తామని, మసీదులో ఉండే ఇమామ్‌, మౌజమ్‌లకు నెలకు రూ15 వేల గౌరవవేతనం అందజేస్తామనే హామీలు అలాగే మిగిలిపోయాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని