logo

‘పిన్నెల్లి బాధితులకు న్యాయం చేస్తాం’

వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల దాడులు, దౌర్జన్యాలు భరించలేక పిన్నెల్లికి చెందిన తెదేపా కుటుంబాలు ఊరి వదిలి వెళ్లాయి.. ఇటీవల వారందరూ స్వగ్రామానికి వచ్చారు.

Published : 16 Apr 2024 05:03 IST

ప్రసంగిస్తున్న కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు

మాచవరం, న్యూస్‌టుడే: వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల దాడులు, దౌర్జన్యాలు భరించలేక పిన్నెల్లికి చెందిన తెదేపా కుటుంబాలు ఊరి వదిలి వెళ్లాయి.. ఇటీవల వారందరూ స్వగ్రామానికి వచ్చారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. సోమవారం తెదేపా ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామంలో ‘ప్రజాగళం.. గురజాల ఆత్మగౌరవ సభ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు పెద్దఎత్తున రావడం సంతోషమన్నారు. ఇటీవల కాసు మహేష్‌రెడ్డి తన గురించి వ్యాఖ్యలు చేశారని, తాను గత ఐదేళ్లలో అవినీతి చేయలేదని, అక్రమ కేసులు బనాయించలేదన్నారు. ప్రజలకు కనిపించకుండా దూరం లేనని, డబ్బు అహకారంతో ప్రవర్తించలేదని పరోక్షంగా ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పిన్నెల్లి గ్రామాన్ని రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. దాదాపు 90 మంది పులిచింతల నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.  వైకాపా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం లేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. పదవులు ఇచ్చి, అధికారం ఇవ్వలేదన్నారు. తెలంగాణకు చెందిన తెదేపా నేత నన్నూరి నర్సిరెడ్డి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తొలుత తెదేపా శ్రేణులు భారీ గజమాలతో నేతలకు స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని