logo

నదీ గర్భాన్ని తోడేస్తూ.. నిలువునా దోచేస్తూ

అనుమతులకు మించి అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ నివాసం ఉండే తాడేపల్లి మండలం గుండిమెడ నుంచి రేయింబవళ్లు ఇసుకను భారీ యంత్రాల ద్వారా తవ్వకాలు చేస్తూ భారీ వాహనాలతో తరలించుకుపోతున్నారు.

Published : 17 Apr 2024 04:24 IST

అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న ఇసుకాసురులు
చోద్యం చూస్తున్న అధికారులు

ఉద్దండరాయునిపాలెంలో ఇసుక నిల్వలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: అనుమతులకు మించి అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ నివాసం ఉండే తాడేపల్లి మండలం గుండిమెడ నుంచి రేయింబవళ్లు ఇసుకను భారీ యంత్రాల ద్వారా తవ్వకాలు చేస్తూ భారీ వాహనాలతో తరలించుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అడ్డుకునే సాహసం చేయడం లేదు. అధికార పార్టీకి వారంతా దాసోహమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణానికి విఘాతం కలుగుతున్నా, భూగర్భ జలాలపై ప్రభావం పడుతున్న పట్టించుకోకుండా నదిలో భారీ గుంతలు తవ్వి మట్టి తరలిస్తున్నారు. పెద్ద గోతులు తవ్వడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. మంగళగిరి, తాడేపల్లి నగర పరిధిలో ఉన్న ఇసుక క్వారీలో గత నెల 31తో అనుమతుల గడువు ముగిసింది. స్థానిక ఎమ్మెల్యే ఇసుక క్వారీలో తవ్వకాలపై ఒక్కసారి కూడా ఆరా తీసిన పాపానపోలేదు. దీంతో అక్రమార్కులకు స్థానిక ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అండదండలు ఉన్నాయనే ఆరోపణలు జోరందుకున్నాయి. మైనింగ్‌, విజిలెన్స్‌, పోలీసు, రెవెన్యూ అధికారులు క్వారీ వైపు వెళ్లేందుకే భయపడుతున్నారు. గతంలో గుండిమెడతో పాటు చిర్రావూరు, ప్రాంతూరు గ్రామాలకు చెందిన కార్మికులు పనిచేసి ఉపాధి పొందేవారు. కానీ ఆ పరిస్థితి నేడు కనిపించడం లేదు. దీంతో గత ఐదేళ్లుగా 500 మందిపైగా కార్మికులకు పనిలేకుండా పోయింది.  

ఎంపీ అనుచరుల దందా..  : తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని గ్రామం ఉద్దండరాయునిపాలెం అక్రమార్కుల ఇసుక దందాలకు అడ్డాగా మారింది. ఇసుక రీచ్‌ల్లో నదీ గర్భానికి ప్రమాదం వాటిల్లేలా ఇష్టాను సారం తవ్వకాలు జరుపుతున్నారు. ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలో ఇసుకను గుట్టలుగా నిల్వచేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అనధికార చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమార్కులు ఇసుక రవాణాదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు స్థానికంగా చర్చ జోరుగా సాగుతోంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం రీచ్‌ నుంచి నిత్యం తుళ్లూరు, పెదపరిమి మీదుగా అధిక లోడుతో లారీల్లో ఇసుక రవాణా సాగుతోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని