logo

అల్లరిమూకల అరాచకం..!

గుంటూరు జిల్లా పెదనందిపాడు స్టేషన్‌ పరిధిలో ఉప్పలపాడుకు చెందిన కొందరు యువకులతో కూడిన ఆకతాయిల గ్యాంగ్‌ ఒకటి స్థానికంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఆ గ్రామం మీదుగా రాత్రిపూట ప్రయాణించే వాహనాలకు అడ్డుతగిలి వాహనదారుల్ని దుర్భాషలాడి కొట్టడం, గాయపరచటం వంటివి చేస్తున్నారు.

Published : 17 Apr 2024 04:30 IST

ఉప్పలపాడు మీదుగా రాత్రివేళ ప్రయాణించాలంటే వణుకే
తాజాగా ఓ కుటుంబాన్ని అడ్డగించి, దౌర్జన్యం
నిందితులపై కఠిన సెక్షన్లు పెట్టని పెదనందిపాడు పోలీసులు

ఈనాడు, అమరావతి, పెదనందిపాడు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పెదనందిపాడు స్టేషన్‌ పరిధిలో ఉప్పలపాడుకు చెందిన కొందరు యువకులతో కూడిన ఆకతాయిల గ్యాంగ్‌ ఒకటి స్థానికంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఆ గ్రామం మీదుగా రాత్రిపూట ప్రయాణించే వాహనాలకు అడ్డుతగిలి వాహనదారుల్ని దుర్భాషలాడి కొట్టడం, గాయపరచటం వంటివి చేస్తున్నారు. వీరి ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. ఆ గ్రామం మీదుగా రాత్రి వేళల్లో ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు. అయినా ఆ గ్యాంగ్‌ ఆగడాలు, అరాచకాలకు పోలీసులు మాత్రం కళ్లెం వేయడం లేదు. ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు. తాజాగా ఆ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఓ ఘటనతో వారి అరాచకాలు బహిర్గతమయ్యాయి. మండలంలోని నాగులపాడు గ్రామానికి చెందిన విశ్రాంత సైనికోద్యోగి, మాజీ ఉపసర్పంచి, తెదేపా ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీ సెల్‌ కన్వీనర్‌ కల్వకూరి వెంకట్రావు తన కుటుంబీకులతో కలిసి మూడు రోజుల క్రితం (ఆదివారం) బాపట్ల నుంచి కారులో బయలుదేరి నాగులపాడు వస్తుండగా ఉప్పలపాడుకు వెలుపల రాత్రి పూట సుమారు 9.30 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న యువకుడొకరు తన ద్విచక్రవాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పార్కుచేసి కారు వెళ్లకుండా అడ్డు తగిలారు. దీంతో వెంకట్రావు కారులో నుంచి దిగి బైక్‌ తీస్తే తాను వెళతానని చెబితే వినిపించుకోలేదు. వెంకట్రావే ఆ బైకును పక్కకు తీస్తుండగా ఎలా వెళతావో చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అదేం పట్టించుకోకుండా వెంకట్రావు తన కారులో వెళ్లిపోతుండగా మరోసారి ఉప్పలపాడు వద్ద అడ్డగించి అతనిపైన, కుటుంబీకులపై దాడి చేసి నానా బీభత్సం సృష్టించి వారిని భయభ్రాంతులకు గురిచేశారు. వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు.

నిందితులకు వైకాపా నేపథ్యం?

బాధితుడు వెంకట్రావు ఫిర్యాదు మేరకు పెదనందిపాడు పోలీసులు ఆరుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి అంతటితో సరిపుచ్చారు. వారు ఏకంగా ఓ కుటుంబాన్ని అడ్డగించి వారిని కొట్టిగాయపరిచి, వారి వద్ద ఉన్న బంగారు అభరణాలను లాగేసుకుని పట్టుకుపోతే వారిపై కఠిన సెక్షన్లు నమోదు చేయకుండా, రౌడీషీట్లు తెరవకుండా సాధారణ కేసులతో సరిపుచ్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు వైకాపా నేపథ్యం ఉందని, అందుకే పోలీసులు వారు ఎన్ని దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా చూసీచూడనట్లు మిన్నకుండిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీరి ఆగడాలతో ఆ మార్గంలో రాత్రిపూట వాహనాలపై ప్రయాణించాలంటేనే బెంబేలెత్తుతున్నామని ఆ ప్రాంత వాసులు పలువురు చెబుతున్నారు. నిత్యం మద్యం తాగి అర్ధరాత్రి వరకు రహదారులపై హల్‌చల్‌ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు వెంకటరావు, కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయపరిచిన ఆకతాయిలను అరెస్టు చేసినట్లు ఎస్సై రాజకుమార్‌ తెలిపారు. ఉప్పలపాడుకు చెందిన అఖిల్‌, మనోజ్‌, రోహిత్‌, చందు, లూదర్‌పాల్‌, విల్సన్‌ను నిందితులుగా గుర్తించామన్నారు. వారిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామంటున్నారు.

గుక్కెడు నీళ్లివ్వడానికి సాహసించలేదు..

ఆ గ్రామంలో మహిళా పోలీసు ఉన్నారు. అయినా వీరి ఆగడాలు ఇప్పటి వరకు ఆ మహిళా పోలీసుకు గానీ, పోలీసుల దృష్టికి గానీ రాలేదా అంటే నమ్మశక్యం కావడం లేదు. బాధితుడు వెంకట్రావు కారును గ్రామ నడిరోడ్డుపై నిలిపి గంట పాటు నానా బీభత్సం చేసి కొట్టిగాయపరిచినా గ్రామస్థులు ఎవరూ నోరుమెదపలేదు. తనను రక్షించాలని వేడుకున్నా ఎవరూ స్పందించలేదు. దెబ్బలకు తాళలేక స్థానికులను గుక్కెడు నీళ్లు అడిగినా ఇవ్వడినికి ఎవరూ సాహసించలేదని బాధితుడు వెంకట్రావు పేర్కొన్నారు. తనపై దాడి విషయాన్ని కానిస్టేబుల్‌కు ఫోన్‌ ద్వారా తెలియజేయగా ఆయన వచ్చి తమను కాపాడారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు