logo

‘రా’క్షస రాజ్యం పారదోలుదా‘మా’

రాముడు సకల గుణాభిసోముడు.. పితృవాక్య పరిపాలకుడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం పదవిని గడ్డిపోచలా వదిలేశాడు. పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. ప్రకృతిని ప్రేమించాడు.

Updated : 17 Apr 2024 06:31 IST

పాలకుల పాపాలు.... ప్రజలకు శాపాలు
వైకాపా విధ్వంసకర పాలనతో అష్టకష్టాలు
ఆదర్శ పాలకులను ఎన్నుకోవాల్సిన సమయం

ఈనాడు, అమరావతి: రాముడు సకల గుణాభిసోముడు.. పితృవాక్య పరిపాలకుడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం పదవిని గడ్డిపోచలా వదిలేశాడు. పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. ప్రకృతిని ప్రేమించాడు. అడవిలో కందమూలాలు తిని కాలం గడిపాడు. దుష్టశిక్షణ కోసం బాణం ఎక్కుపెట్టాడు. శిష్టరక్షణ సాగించాడు. ధర్మం తప్పకుండా జనరంజక పాలన అందించాడు. అందుకే యుగాలు గడిచినా రామరాజ్యం ఆదర్శంగా నిలిచిపోయింది.

నేటి జగన్‌రెడ్డి రాజ్యంలో మాట ఇవ్వడం మడమ తిప్పడం పరిపాటిగా మారిపోయింది. అమరావతే రాజధాని అని ప్రతిపక్షంలో చెప్పిన జగన్‌ అధికారంలో రాగానే ప్లేటు ఫిరాయించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వంచించారు. వారు నాలుగేళ్లు రోడ్డెక్కి ఆందోళనలు చేసినా స్పందించలేదు. రాక్షస రాజ్యాన్ని తలపించేలా మహిళలను ఉక్కుపాదంతో అణచివేశారు. మహిళల కంట కన్నీరు ఒలికించారు. జిల్లాలో పాలకులు రాజధర్మాన్ని ఎలా ఉల్లంఘించి అన్ని వర్గాల వారిని ఎలా ఇబ్బందులు పెడుతున్నారో పవిత్ర పర్వదినం శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక కథనం.

ప్రకృతి ప్రేమికుడు రాముడు. భార్య సీతతో కలిసి వనంలో నివసించాడు.

  • ప్రకృతి వినాశకారి జగన్‌. ఆయన అడుగుబయట పెడితే చెట్లపై గొడ్డలి వేటు పడాల్సిందే. నాలుగేళ్లుగా జిల్లాలో ఆయన ఏ మూలకూ వెళ్లినా కనిపించిన దృశ్యాలివే. భద్రత పేరు చెప్పి పచ్చని చెట్లను, ఏళ్ల నాటి వృక్షాలనూ కూకటివేళ్లతో సహా పెకలించారు.

ఆశ్రిత పక్షపాతం చూపించకుండా సహజవనరుల ఫలాలు ప్రజలందరికీ సమానంగా పంచాడు రాముడు.

  • సహజ వనరులైన ఇసుక, మట్టి, గ్రానైట్‌ ఇలా దొరికినవి దొరికినట్లు అధికార పార్టీ నాయకులు దోచేశారు. పాలకుడిగా వాటిని అరికట్టాల్సిన సీఎం జగన్‌ వారికే కొమ్ముకాశారు. వైకాపా నేతలు నదీ తీరంలో ఇసుక కొల్లగొట్టారు. కొండ, గుట్ట, వాగు, వంక.. ఏది కనిపించినా తవ్వేశారు.

దోపిడీలు.. దౌర్జన్యాలు

  • ప్రస్తుత పాలకులు స్వార్థానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజల హక్కులను కాలరాస్తూ సమాజానికి చెందాల్సిన సహజవనరులైన ఇసుక, మట్టి  దోచుకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
  • వైకాపా నేతలు వారి సొంత ప్రయోజనాలే లక్ష్యంగా అయిదేళ్ల పాలన కొనసాగించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నాసిరకం మద్యం, గంజాయి, డ్రగ్స్‌ విక్రయాలతో సమాజంలో అశాంతికి కారకుడయ్యారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతుండటంతో యువత పెడతోవ పట్టి తల్లిదండ్రులకు అంతులేని ఆవేదనను మిగిల్చారు. పాలనా వైఫల్యంతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు మూడుపూటలా తిండి తినలేని పరిస్థితి తీసుకువచ్చారు.  
  • జనం కోసం పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు ఒడిగట్టడంతో ప్రజల జీవితం దుర్భరంగా మారింది. ప్రజల ఆస్తులు లాక్కోవడం, అక్రమ కేసులు పెట్టడం, బాధితులకు అండగా నిలవాల్సిన యంత్రాంగం అధికారపార్టీకి వత్తాసు పలకడం వంటి ఘటనలతో జిల్లాలో ప్రశాంతత లోపించి అల్లకల్లోలం నెలకొంది.

గ్రామాల నుంచి తరిమేసి..

  • వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ప్రతిపక్షపార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలపై అధికారపార్టీ వారు దాడులు చేయడంతో వారంతా ఆయా గ్రామాలు వదిలి వలస వెళ్లారు. ఇదీ వైకాపా పాలనలో ప్రజలకు లభిస్తున్న రక్షణ.
  • పాఠశాల విద్యార్థులను పోలీసుస్టేషన్‌ సెల్‌లో వేయడం, 80ఏళ్ల వృద్ధుడిపై అత్యాచారం కేసు నమోదు చేయడం, దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదుచేసిన ఘనత వైకాపా పాలనలోనే సాధ్యమైంది.
  • రాజధాని ప్రాంతంలోని మహిళలు వారి సమస్యలను చెప్పుకోవడానికి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి పాదయాత్ర చేస్తే వారిని పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. శత్రువైనా ఇంటికి వస్తే ఆతిథ్యం ఇచ్చే సంస్కృతి నుంచి తినే అన్నంలో మట్టి పోసే దుస్థితికి దిగజార్చిన ఘటనలు వైకాపా పాలనలో చోటుచేసుకున్నాయి.
  • మహిళలపై అఘాయిత్యాలు, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు, సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై పోస్టులు పెడితే కేసులు ఇలాంటివి అయిదేళ్ల కాలంలో సర్వసాధారణం కావడం గమనార్హం.
  • అధికార పార్టీకి చట్టం చుట్టం కాగా ప్రతిపక్షాలపై అవే చట్టాలు ఉక్కుపాదం మోపాయి. అధికారపార్టీ దాడుల్లో బాధితులైన ప్రతిపక్షాలపైనే కేసులు నమోదుచేసే సరికొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టిన ఘనత కూడా అయిదేళ్ల కాలంలో చోటుచేసుకుంది.

మీ ఓటుతో తీర్పివ్వాలి..

రాజ్యం బాగుండాలంటే రాజు సమర్థుడై ఉండాలి. ప్రజల బాగోగులు పట్టించుకుని వారి కష్టసుఖాల్లో భాగస్వాములయ్యే పాలకులు రావాలి. ప్రతి నిర్ణయమూ ప్రజాకాంక్షకు అనుగుణంగా ఉండాలి. అలాంటి లక్షణాలు కలిగిన రాముడు చరిత్రలో ఆదర్శపాలకుడిగా పేరుపొందారు. రాముడికి పదహారు సద్గుణాలున్నాయి. ఆగుణాలే ఆయనను మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు తమ ఓటును వజ్రాయుధంగా భావించాలి. ఓటు హక్కును వినియోగించుకుని సరైన పాలకులను ఎన్నుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని