logo

వైకాపా ప్రభుత్వ నిర్ణయ లోపం.. విద్యార్థులకు శాపం

‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు

Published : 19 Apr 2024 05:26 IST

మధ్యాహ్న భోజనంపై అనాసక్తి
న్యూస్‌టుడే’ పరిశీలనలో బయటపడిన లోపాలు
తెనాలి టౌన్‌, పొన్నూరు, చేబ్రోలు, న్యూస్‌టుడే

తెనాలి: భోజనం చేయకుండా ఇళ్లకు వెళుతున్న విద్యార్థులు

‘మీ పిల్లలు బడిలో భోజనం చేయకపోతే మీకు వస్తున్న ప్రభుత్వ పథకాలు నిలిచేపోయే అవకాశం ఉంది’అని తల్లిదండ్రుల సమావేశాల్లో ఉపాధ్యాయులు చెబుతున్నా.. నాణ్యత లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు భోజనం చేకుండా వెళ్లిపోతున్నారు. దాదాపుగా అన్ని పాఠశాలల్లోనూ ఇదే తీరు నెలకొంది.  

గతంలో ఒక్కపూటి పాఠశాలల సమయంలో ఉదయం 10:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరవాత మధ్యాహ్నం పాఠశాల పూర్తైన తరవాత విద్యార్థులకు భోజనం పెట్టి పంపించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని తినకుండానే ఇంటికి వెళ్లి పోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ‘న్యూస్‌టుడే’ పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై నిర్వహించిన పరిశీలనలో పలు విషయాలు వెలుగుచూశాయి.


పేరు: తెనాలి మారీసుపేట
నల్లమోతు పురపాలక ఉన్నత పాఠశాల
మొత్తం విద్యార్థులు: 865
హాజరు: 703
భోజనం చేసింది: 606

  • తెనాలి మారీసుపేటలోని నల్లమోతు చెంచురామానాయుడు పురపాలక ఉన్నత పాఠశాలను మధ్యాహ్నం ముగిసి విద్యార్థులు బయటకు వచ్చే సమయంలో గేట్లకు తాళాలు వేశారు. అందరూ భోజనం చేసి వెళ్లాలని ఉపాధ్యాయులు కోరారు. ఒంటి పూట బడులు మొదలైన తరవాత ఎక్కువ మంది పిల్లలు ఇళ్లకు వెళ్లిపోవాలన్న తొందరలో భోజనం చేయటంలేదని, అందువల్ల భోజనం చేసి వెళ్లాలని గేట్లకు తాళాలు వేసినట్లు వివరించారు. అయినా కొందరు విద్యార్థులు భోజనం చేయకుండా ఇంటికి వెళ్లిపోయారు. మెనూ ప్రకారం పులిహోర, చట్ని పిల్లలకు వడ్డించారు. వారంలో రెండు రోజులు పులిహోర పెడుతున్నారని, తినబుద్ధి కావటం లేదని, అన్నం, పప్పు బావుంటున్నాయని కొందరు విద్యార్థులు చెప్పారు.

వేజండ్ల: ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తింటున్న చిన్నారులు

పేరు: చేబ్రోలు మండలం వేజండ్ల
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల
మొత్తం విద్యార్థులు: 408
హాజరు: 378
భోజనం చేసింది: 100

  • చేబ్రోలు మండలం వేజండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం కింద సాంబార్‌ బాత్‌ లేదా పులిహోర, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు, ఉదయాన్నే రాగిజావ తయారు చేసి నిర్వాహకులు అందించాల్సి ఉంది. 378 మంది విద్యార్థులకు వంట చేయాల్సి ఉండగా సుమారు 100 మంది సరిపోయేంత పులిహోర, ఉడికించిన కోడి గుడ్లు అందుబాటులో ఉంచారు. సోమవారం నుంచి చిక్కీల సరఫరా లేదు.

వేజండ్ల: 378 విద్యార్థులకు తెచ్చిన పులిహోర, చట్ని ఇదే


పేరు: నిడుబ్రోలు 5వ వార్డు
పురపాలక సంఘ ఉన్నత పాఠశాల
మొత్తం విద్యార్థులు: 166
హాజరు: 159
భోజనం చేసింది: 119


కోడిగుడ్డు ఏది..?

పొన్నూరు పట్టణ పరిధి నిడుబ్రోలు 5వ వార్డు పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం కోడి గుడ్డు, సాంబారు, అన్నం కలిపి అందించాల్సి ఉంది. 10 రోజులు నుంచి కోడి గుడ్డును అందిచడంలేదు. విద్యార్థులకు అన్నం..సాంబారు విడి విడిగా పెట్టారు. కొందరు పాఠశాల ముగియగానే భోజనం చేయకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వం లావు బియ్యం పంపిణీ చేయడంతో ఆ బియ్యంతో వండిన అన్నాన్ని తినడానికి వారు ముందుకు రావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని