logo

అ‘తీగ’తిలేని ‘మార్గం’

ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్‌ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు.

Updated : 20 Apr 2024 06:58 IST

కోటప్పకొండపైకి ఏర్పాటు కాని రోప్‌ వే
ఆలయ అభివృద్ధిని పట్టించుకోని వైకాపా సర్కారు

ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా తెదేపా ప్రభుత్వం ప్రారంభించినది అయితే పూర్తి చేయం. అవసరమైతే పనికిరాకుండా చేస్తాం ఇది జగన్‌ సర్కారు ఐదేళ్లుగా అవలంభిస్తున్న తీరు. కోటప్పకొండలోని రోప్‌వే (తీగ మార్గం) నిర్మాణాన్ని పక్కన పెట్టారు.

న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్‌

దేశంలోనే శ్రీమేధాదక్షిణామూర్తి స్వరూపంలో మహాదేవుడు కొలువైన ఏకైక శైవక్షేత్రం కోటప్పకొండ. వందల ఏళ్ల చరిత్ర ఉన్న కోటప్పకొండను మాజీసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఎన్నో ప్రయాసలకోర్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. రూ.లక్షల్లో ఉన్న స్వామి ఆదాయాన్ని రూ.కోట్లకు పెంచారు. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మరిన్ని హంగులు అవసరమన్న భావనతో తీగమార్గం ప్రతిపాదన తెచ్చారు. అందుకు అనుమతులు, నిధులు సాధించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో జగన్‌ సర్కారు అధికారంలోకి రావడంతో రోప్‌వేకు సంబంధించిన పనులు ఆగిపోయాయి.

దిమ్మెలకే పరిమితం..

రూ.4 కోట్లతో చేపట్టిన రోప్‌వే పనులు దిమ్మెల నిర్మాణానికి పరిమితమైంది. లేజర్‌షో కోసం నిర్మించిన కట్టడాలు నిరుపయోగంగా మారాయి. పర్యాటక శాఖ నిర్మించిన ఫలహారశాల భవన తలుపులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నడక మార్గం, లేజర్‌షో భవనాలు మధ్యలో పిచ్చిచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి.

రోప్‌వే ఏర్పాటుకు వేసిన దిమ్మె

పర్యాటకంగా మంచి అవకాశం

రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కోటప్పకొండ ఒకటని గుర్తించి తెదేపా పాలనలో అభివృద్ధికి బాటలు వేశారు. ఇప్పటికే ఘాట్‌రోడ్డు ఉన్న కోటప్పకొండకు రోప్‌వే ఉంటే మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందని అప్పటి పాలకులు ముందుచూపుతో ఆలోచన చేశారు. దీనికి తోడు లేజర్‌ షో, బోటుషికారుకు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి, కార్తికమాసంలో అధికసంఖ్యలో భక్తులు వస్తుంటారు. నిత్యం భక్తులు వచ్చేలా అదనపు హంగులు సమకూర్చితే దేవస్థానానికి ఆదాయం భారీగా సమకూరుతుందని, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది నాటి పాలకుల ఆలోచన. కోటప్పకొండ వద్ద 2016లో రూ.4 కోట్లతో పనులు చేపట్టే బాధ్యతలు కోల్‌కతాకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ తీగ మార్గం పనులు ప్రారంభించింది. కొండ దిగువన రోప్‌వే కోసం అవసరమైన నిర్మాణ పనులు మొదలుపెట్టింది. తీగమార్గాన్ని 2020లోగా అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. రోప్‌వేకు పునాదులు వేసిన తర్వాత ప్రభుత్వం మారడంతో వైకాపా దానికి పక్కన పెట్టింది.

వైకాపా ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలు

రోప్‌వే అంశంలో వైకాపా పాలన వచ్చిన కొత్తలో తీగమార్గాన్ని పొడిగించి మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. పర్యాటక సంస్థ అధికారులను పిలిచి దండలు వేసి సత్కారాలు చేసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆలయం వరకు కాదు. పాత కోటయ్య స్వామి ఆలయం వరకు నిర్మాణం చేస్తామని అందుకు రూ.8 కోట్లు అవసరమని తేల్చారు. తీగమార్గం విషయంలో పురోగతి లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని