logo

Crime News: అరగంటలో తాళం.. గంటలో కారు మాయం!

సాంకేతికత సాయంతో ఖరీదైన కార్లను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేరెడ్‌మెట్‌ రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో అదనపు సీపీ జి.సుధీర్‌బాబు శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Updated : 12 Dec 2021 08:23 IST

ముఠా నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతికత సాయంతో ఖరీదైన కార్లను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేరెడ్‌మెట్‌ రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో అదనపు సీపీ జి.సుధీర్‌బాబు శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

అలారం మోగకుండా చేసి... మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఇమ్రాన్‌ఖాన్‌ పఠాన్‌ కారు డ్రైవర్‌. ఇటీవల హైదరాబాద్‌ కాప్రాకు మకాం మార్చాడు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు సొంత రాష్ట్రలోని కరడుగట్టిన దొంగల ముఠాతో చేతులు కలిపాడు. పగటి సమయంలో డ్రైవర్‌గా పనిచేస్తూ రెక్కీ నిర్వహిస్తాడు.  సమాచారాన్ని మహారాష్ట్రలోని ముఠాకు చేరవేస్తాడు. నగరం చేరిన ముఠా సభ్యులు చాలా చాకచక్యంగా కార్లను అపహరిస్తారు. తమ వద్ద ఉన్న ఆధునిక సాంకేతిక పరికరం సాయంతో ముందుగా అలారం మోగకుండా చేస్తారు. అదే పరికరం ద్వారా ఆ కారుకు సరిపడా తాళం పరిమాణం సేకరిస్తారు. అరగంట వ్యవధిలో క్లోనింగ్‌ చేసి నకిలీ తాళం తయారు చేయించి తీసుకొస్తారు. యజమాని మాదిరిగా దర్జాగా వాహనంలో కూర్చుని మరో ప్రాంతానికి తరలిస్తారు.  కార్లను మహారాష్ట్ర చేర్చాక అసలు మాయా నాటకం నడిపిస్తారు. తుక్కుగా మార్చిన కార్ల నంబరు ప్లేట్లు, ఛాసిస్‌, ఇంజన్‌ నంబర్లను ఎత్తుకెళ్లిన కార్లకు అమర్చి వాటి రంగు మార్చుతారు. రిజిస్ట్రేషన్‌ పత్రాలు కూడా సేకరించి సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో సగం ధరకే విక్రయిస్తారు.  చేతిలో డబ్బు ఖర్చవగానే మళ్లీ కార్ల కోసం గాలింపు ప్రారంభిస్తారు. ఈ ముఠా చాకచక్యం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. సంతోష్‌ జగన్నాథ్‌, ఇమ్రాన్‌ఖాన్‌, ఫర్మాన్‌ అలీఖాన్‌, సోహ్రబ్‌ అలీ, యవరుల్లా ఖాన్‌, ఉదయ్‌ మారుతి పాటిల్‌ కలసి 5-6 ఏళ్లుగా 100కు పైగా కార్లను దొంగిలించినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ముఠాపై ఏపీ, రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో కేసులున్నాయి. ఇటీవల నాచారం, మల్కాజిగిరి, పేట్‌బషీర్‌బాద్‌లో కార్ల దొంగతనాలపై వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన  సీసీ ఫుటేజీ, సీడీఆర్‌ ఆధారంగా ఆరా తీస్తే ముఠా మూలాలు మహారాష్ట్రలో ఉన్నట్టు గుర్తించారు. పక్కా వ్యూహంతో వెళ్లిన పోలీసులు ఇమ్రాన్‌ఖాన్‌ పఠాన్‌(36), సంతోష్‌ జగన్నాథ్‌(34)ను అరెస్ట్‌ చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు. 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 

కోటు, బూటుతో దర్జాగా.. కొట్టేసిన ఒక్క కారు అమ్మితే రూ.2-3 లక్షలు. అంతర్రాష్ట్ర దొంగలకు చేతినిండా సొమ్ములు. హంగూ ఆర్భాటంతో కనిపిస్తుంటారు. విందులు, వినోదాలతో గడిపేస్తారు. కేసు దర్యాప్తులో భాగంగా రాచకొండ పోలీసులు మహారాష్ట్ర వెళ్లారు. కోటు, బూటుతో దర్జాగా పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమైన ఇమ్రాన్‌ఖాన్‌ పఠాన్‌ను చూశారు. అతడే నిందితుడు అని నిర్ధారించుకోవడానికి చాలా సమయం పట్టిందంటారు పోలీసులు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఖరీదైన కార్లు, విమానాల్లో మాత్రమే తిరుగుతూ వాహనాలను చోరీ చేసేందుకు అవసరమైన సలహాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని