logo

Crime News: సామగ్రి తరలించమంటే ఎత్తుకెళ్లారు

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం బదిలీ అయిన బీమా సంస్థ ఉద్యోగిని.. ఓ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ పేరు చెప్పుకొన్న అగంతుకులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో బాధితుడు

Updated : 13 Dec 2021 08:33 IST

ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెంట్ల మోసం.. లబోదిబోమంటున్న బాధితుడు

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం బదిలీ అయిన బీమా సంస్థ ఉద్యోగిని.. ఓ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ పేరు చెప్పుకొన్న అగంతుకులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీంతో బాధితుడు శనివారం సనత్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. మోతీనగర్‌ సమీపంలోని అవంతినగర్‌ ఈస్ట్‌ కాలనీలో నివసించే ఎల్‌ఐసీ ఉద్యోగి కిరణ్‌కు ఇటీవల విశాఖపట్నానికి బదిలీ అయింది. ఇంటి సామగ్రిని చేరవేసే ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ కోసం గూగుల్‌లో శోధించగా ఊర్మి లాజిస్టిక్స్‌, ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ అనే సంస్థ కనిపించింది. ఈ నెల 5న సంబంధిత ప్రతినిధులను సంప్రదించగా.. 6న ముగ్గురు వ్యక్తులు కిరణ్‌ ఇంటికి వచ్చారు. సామగ్రి తరలింపునకు రూ.12,980 ఛార్జీ అవుతుందని చెప్పగా.. కిరణ్‌ రూ.వెయ్యి ముందుగా చెల్లించారు. అదే రోజు ట్రాలీతో వచ్చిన సదరు వ్యక్తులు పూర్తి సామగ్రితోపాటు ద్విచక్ర వాహనాన్నీ తీసుకుని వెళ్లారు. ఆనక కిరణ్‌ కూడా కుటుంబీకులతో కలిసి విశాఖపట్నం వెళ్లిపోయారు.

అధిక మొత్తం చెల్లించాలంటూ..
సామగ్రి కోసం చూస్తున్న కిరణ్‌ చరవాణికి సంస్థ ప్రతినిధులుగా చెప్పుకొన్నవారు సందేశం పంపారు. రూ.27,000 చెల్లిస్తేనే ఇస్తామన్నారు. మరో రెండు రోజుల తర్వాత అగంతుకులు ఫోన్‌ చేసి డబ్బు చెల్లిస్తేనే సామగ్రిని ఇస్తామని చెప్పారు. అందుకు సిద్ధంగా ఉన్నానని కిరణ్‌ బదులివ్వగా.. సంబంధిత మొత్తాన్ని గూగుల్‌పే చేయాలని సూచించారు. దీంతో ఆయనకు అనుమానం వచ్చి డబ్బులు పంపలేదు. ఆ తర్వాత వాళ్లు మళ్లీ ఫోన్‌ చేసి సామగ్రిని గోడౌన్‌లో దాచినందుకు రోజుకు అదనంగా రూ.3 వేలు చెల్లించాలంటూ మెలికపెట్టారు. మొత్తం రూ.35 వేలు చెల్లిస్తేనే సామగ్రిని ఇస్తామని స్పష్టం చేయడంతో.. బాధితుడు తిరిగి నగరానికి చేరుకుని శనివారం సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుండగులు ఇంకా నగరంలోనే ఉన్నట్లు లొకేషన్‌ గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లాలని బాధితుడికే సలహా ఇచ్చారు. ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థ చిరునామా ఉన్న తిరుమలగిరికి వెళ్లిన కిరణ్‌కు అక్కడ వారి జాడ కనిపించలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని కిరణ్‌ తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ పోలీసులు న్యాయం చేయకపోతారా? అని ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని