logo

కామాంధులపై శిక్షాస్త్రం

అభం శుభం తెలియని చిన్నారులపై దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధులపై ప్రత్యేక కోర్టులు కఠిన శిక్షాస్త్రం ప్రయోగిస్తున్నాయి. బాధితుల నిస్సహాయస్థితి, వారి తల్లిదండ్రుల ఆందోళనలు,

Published : 18 May 2022 02:45 IST

చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలు

సత్వర న్యాయం అందిస్తున్న ప్రత్యేక కోర్టులు

అభం శుభం తెలియని చిన్నారులపై దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కామాంధులపై ప్రత్యేక కోర్టులు కఠిన శిక్షాస్త్రం ప్రయోగిస్తున్నాయి. బాధితుల నిస్సహాయస్థితి, వారి తల్లిదండ్రుల ఆందోళనలు, పోలీసులు సమర్పించిన అభియోగ పత్రాలను పరిగణలోకి తీసుకుని దుర్మార్గంగా ప్రవర్తించిన నేరస్థులకు జీవితఖైదు శిక్ష విధిస్తూ తీర్పులు ఇస్తున్నాయి. చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడుల కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన బాలమిత్ర కోర్టులు బాధితులకు సత్వర న్యాయం అందిస్తున్నాయి. సికింద్రాబాద్‌లో ఉంటున్న 16ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన హోంగార్డుకు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.7లక్షల జరిమానా విధిస్తూ గతేడాది ఆగస్టులో తీర్పు ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ఏళ్ల జైలుశిక్షగా పోలీసులు తెలిపారు.

- ఈనాడు, హైదరాబాద్‌

అనునయించి.. లాలించి

మానసికంగా దెబ్బతిని షాక్‌కు గురైన అత్యాచార బాధితులను బాలమిత్ర కోర్టుకు తీసుకొస్తున్నారు. వారిని అనునయించి, లాలించి విషయాన్ని వారు వివరిస్తున్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తులు వీక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. గదిలో వీడియో లింకేజి ద్వారా మాట్లాడుతున్నారు. చిన్నారుల భాష, భావం తెలుసుకునేందుకు తల్లిదండ్రులు కోర్టుకు సహకరిస్తున్నారు. ఇంతేకాదు.. భవిష్యత్తులో కేసుల విచారణ మరింత వేగంగా పూర్తిచేసి బాధితులకు న్యాయం చేసేందుకు, చట్టపరంగా వారికి పరిహారం అంద జేసేందుకు కృషి చేయాలని బాలమిత్ర కోర్టులు చొరవ తీసుకుంటున్నాయి. పోలీసుల ద్వారా రెవెన్యూశాఖ అధికారులకు విచారణ ప్రక్రియ వివరాలను ఎప్పటికప్పుడు పంపుతోంది. నిందితులకు శిక్ష పడే వరకూ ప్రతి కేసునూ పోలీస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

వేగంగా అభియోగపత్రాలు, విచారణ.. శిక్షలు

బాధితులకు న్యాయం చేసేందుకు పోలీస్‌ అధికారులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించి వేగంగా కోర్టుల్లో అభియోగ పత్రాలు సమర్పిస్తున్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు కావడంతో విచారణను అంతేవేగంగా పూర్తి పూర్తిచేస్తున్నారు. నిందితులకు యావజ్జీవ శిక్షలు పడితే భవిష్యత్తులో చిన్నారులు, బాలికలపై చేయి వేసేందుకు కూడా దుర్మార్గులు భయపడతారని ‘షి’బృందం డీసీపీ శిరీషా రాఘవేంద్ర తెలిపారు. ః సైదాబాద్‌లో తండ్రితోపాటు కలిసి ఉంటున్న నాలుగేళ్ల చిన్నారిని వరుసకు బాబాయ్‌ ఆరునెలల క్రితం అత్యాచారం చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. కోర్టులో అభియోగపత్రాలు నమోదు చేయగా కామాంధుడికి 25 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ గతేడాది ఆగస్టులో తీర్పు ప్రకటించింది.

* ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడిని ఆ పాఠశాలలో పనిచేస్తున్న మహిళా కేర్‌ టేకర్‌ లైంగికంగా వేధించింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. అభియోగపత్రాలను పరిశీలించిన కోర్టు ఆమెకు 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఏడు నెలల క్రితం తీర్పునిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని