logo
Updated : 26 May 2022 10:18 IST

PM Modi: హైదరాబాద్‌లో మోదీ పర్యటన.. సాయంత్రం 5 వరకూ ట్రాఫిక్‌ ఆంక్షలు

హెచ్‌సీయూ నుంచి గచ్చిబౌలి ఐఎస్‌బీ వరకూ కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌

ఈనాడు, హైదరాబాద్‌; రాయదుర్గం, బేగంపేట, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరవ్యాప్తంగా పటిష్ఠ రక్షణ చర్యలు తీసుకున్నారు. గురువారం గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ)లో జరిగే ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నగరానికి రానున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియం(హెచ్‌సీయూ)లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగుతారు. రోడ్డు మార్గంలో ఐఎస్‌బీ చేరతారు.

సామాజిక మాధ్యమాలపై నజర్‌
ప్రధాని రాకను వ్యతిరేకిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం. ఐటీ సెల్‌ ద్వారా సామాజిక మాధ్యమాల ఖాతాలను గమనించి, సున్నితమైన పోస్టులుంటే తొలగిస్తున్నట్టు సమాచారం. అదనంగా జిల్లాల నుంచి పోలీసు సిబ్బందిని రప్పించారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ హైదరాబాద్‌, మొహాలి ప్రాంగణాల్లోని 900 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఉత్సవాల్లో పాల్గొనే విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరుల వివరాలను పోలీసులు సేకరించారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వ్యక్తిగత సెలవులో ఉండటంతో నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఇన్‌ఛార్జిగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 2500 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు.  

ట్రయల్‌ రన్‌..
ప్రధాని ప్రయాణించే మార్గంలో బుధవారం మధ్యాహ్నం పోలీసు అధికారులు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్పీజీ) అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌(ట్రయల్‌ రన్‌) నిర్వహించారు. అకస్మాత్తుగా వర్షం పడితే హెలికాప్టర్‌ ద్వారా ప్రయాణించే అవకాశం ఉండదు. రోడ్డు మార్గంలోనే బేగంపేట్‌-ఐఎస్‌బీ చేరాల్సి ఉంటుంది. బేగంపేట్‌ నుంచి గచ్చిబౌలి ఐఎస్‌బీ వరకూ ఎంపిక చేసిన అత్యవసర మార్గంలో కాన్వాయ్‌తో ట్రయల్‌రన్‌ నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ దళం స్థానిక పోలీసులతో సమన్వయంగా ఏర్పాట్లు చేస్తోంది.


భద్రత కట్టుదిట్టం.. ట్రాఫిక్‌ ఆంక్షలు

బేగంపేట్‌ విమానాశ్రయానికి 4000-5000 మంది భాజపా కార్యకర్తలు హాజరవుతారనే సమాచారంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమతి ఉన్న వారినే విమానాశ్రయంలోనికి అనుమతించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 

గ్రీన్‌ల్యాండ్స్‌-ప్రకాష్‌నగర్‌ టీ జంక్షన్‌, రసూల్‌పుర జంక్షన్‌, సీటీవో జంక్షన్ల మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని నగర ట్రాఫిక్‌ సంయుక్త కమిషనర్‌ రంగనాథ్‌ సూచించారు.

గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహానాలు బొటానికల్ గార్డెన్- కొండాపూర్ ఏరియా ఆస్పత్రి- మస్‌జిద్‌ బండ- హెచ్‌సీయూ డిపో మీదుగా.. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చే వాహనదారులు హెచ్‌సీయూ డిపో- మస్‌జిద్‌ బండ- కొండాపూర్ ఏరియా ఆస్పత్రి- బొటానికల్ గార్డెన్ మీదుగా.. విప్రో కూడలి నుంచి లింగంపల్లికి వెళ్లే వారు క్యూ సిటీ- గౌలిదొడ్డి- గోపనపల్లి క్రాస్ రోడ్- హెచ్‌సీయూ వెనుక గేట్, నల్లగండ్ల మీదుగా.. విప్రో కూడలి నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు ఫెయిర్ ఫీల్డ్ హోటల్- నానక్‌రామ్‌గూడ రోటరీ- ఓఆర్ఆర్- ఎల్ఆండ్ టీ టవర్స్ మీదుగా.. తీగల వంతెన నుంచి గచ్చిబౌలి కూడలికి వెళ్లేవారు రత్నదీప్- మాదాపూర్ పీఎస్‌- సైబర్ టవర్స్- కొత్తగూడ- బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. 


Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని