logo
Published : 27 Jun 2022 02:40 IST

కాలానుగుణ వ్యాధులు.. కార్యాచరణతో కట్టడి

ప్రత్యేక బృందాల ఏర్పాటు
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

వానాకాలం వచ్చిందంటే రకరకాల వ్యాధులు విజృంభిస్తాయి. ముసురుతో వివిధ రకాల జ్వరాలు వ్యాపించి ప్రజలు ఆసుపత్రుల పాలవుతుంటారు. అపరిశుభ్రత, దోమల వ్యాప్తి, తాగునీరు, ఆహారం కలుషితం వల్ల గ్రామీణ, పట్టణ వాసులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. దీంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలకు అవగాహన కల్పించటంతో పాటు.. అత్యవసరంలో సత్వరమే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వ్యాధులకు అడుకట్ట వేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం..

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నాలుగు స్థాయిలో ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా, డివిజన్‌, మండల, పీహెచ్‌సీ స్థాయిలో కమిటీలుంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారి, మలేరియా నివారణ అధికారి, హెల్త్‌ సూపర్‌వైజర్‌, ల్యాబ్‌ టెక్నిషియన్‌, కమిషనర్లు, పిచికారీ పర్యవేక్షకుడిని నియమించారు. డివిజన్‌ స్థాయిలో జిల్లా అదనపు వైద్యాధికారి, ముగ్గురు సహాయకులు బృందంలో ఉంటారు. మండల స్థాయిలో మండల స్థాయి అధికారులు ఉంటారు. పీహెచ్‌సీ స్థాయిలో వైద్యాధికారి, కమ్యూనిటీ హెల్త్‌ అధికారి, ల్యాబ్‌ టెక్నిషియన్‌ ఆశా కార్యకర్త, సర్పంచి, పంచాయతీ కార్యదర్శి హెల్త్‌ సూపర్‌వైజర్‌ సేవలను అందించనున్నారు.  

నాలుగు నెలల పాటు వైద్యం
ఈనెల నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేక బృందాల పర్యవేక్షణ ఉంటుంది. వీరంతా పల్లెలు, పట్టణాల్లో ఎక్కడైనా మలేరియా, డెంగీ, టైపాయిడ్‌, విషజ్వరాల బారిన ప్రజలు పడినట్లు తెలియగానే వెంటనే వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి రక్త పరీక్షలు చేసి, అవసరమైతే చికిత్స అందిస్తారు. గత జనవరి నుంచి జూన్‌ వరకు ప్రాథమిక ఆరోగ్య స్థాయిలో డెంగీకి గురైన వారిని గుర్తించి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.

మందుల కొరత లేదు
జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ రకాల జ్వరాల నివారణకు ఔషధాలతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సరిపడా సిద్ధంగా ఉండేలా కమిటీలు పర్యవేక్షిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా వైద్యాధికారి, అదనపు కలెక్టర్‌, పాలనాధికారిణికి నివేదిస్తారు. గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా అయిదేళ్లలోపు ఉన్న చిన్నారులు కుటుంబాలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఆశా కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు.

గతంలో నమోదైన ప్రాంతాల్లో
మూడేళ్లలో వానాకాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురయిన ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. వికారాబాద్‌ పట్టణం, ధారూర్‌, మోమిన్‌పేట, బషీరాబాద్‌, యాలాల, దౌల్తాబాద్‌, అంగడి రాయిచూర్‌ ఉన్నాయి. ఆయా గ్రామాల  పరిధిలో వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు ఏఎన్‌ఏంలు పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్న వైద్యసిబ్బంది


నీటిని నిలువ ఉంచొద్దు
డాక్టర్‌ తుకారాంభట్‌, జిల్లా వైద్యాధికారి, వికారాబాద్‌

కాలానుగుణ వ్యాధులను వ్యాప్తి చేసే దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు రాగానే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి.  ప్రతి శుక్రవారం పొడిదినం పాటించాలని ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. నీటిని నిలువ ఉంచొద్దని ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నారు.


రక్త నమూనా సేకరణ పెంచాం
డాక్టర్‌ సాయిబాబా, జిల్లా మలేరియా నివారణ అధికారి

జిల్లా వ్యాప్తంగా వైద్య బృందం ఇంటింటికీ వెళుతున్నారు. ఒక్కొ రోజు 100 నుంచి 150 ఇళ్ల వద్దకు ఈ బృందం వెళ్లి అనుమానం ఉన్నట్లయితే రక్త నమూనాలను సేకరిస్తున్నారు. జనవరి నుంచి జూన్‌ వరకు 700 రక్త నమూనాలను సేకరించి వాటిని టీహాబ్‌కు, జిల్లా ఆసుపత్రికి పంపించాం. గతేడాది కేవలం 126 రక్త నమూనాలనే సేకరించాం. ఈ సారి సేకరణ పెంచాం.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts