logo

లగేజీ బోగీలోని రూ.4 కోట్ల సరకు బూడిద

హైదరాబాద్‌ నుంచి నిజాముద్దీన్‌(దిల్లీ) వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌లో, భువనగిరి మండలం పగిడిపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం అర్ధరాత్రి మంటలు వ్యాపించిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. సరకు రవాణా(లగేజీ) బోగీలో మంటలు రేగి సుమారు రూ.4 కోట్ల విలువైన సరకు కాలి బూడిదైంది.

Published : 04 Jul 2022 03:57 IST

దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో మంటల ఘటనలో తప్పిన పెనుప్రమాదం


దెబ్బతిన్న బోగీని పరిశీలిస్తున్న రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌, ఇతర అధికారులు

భువనగిరి నేరవిభాగం, భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నుంచి నిజాముద్దీన్‌(దిల్లీ) వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌లో, భువనగిరి మండలం పగిడిపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం అర్ధరాత్రి మంటలు వ్యాపించిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. సరకు రవాణా(లగేజీ) బోగీలో మంటలు రేగి సుమారు రూ.4 కోట్ల విలువైన సరకు కాలి బూడిదైంది. రైలు గార్డు అప్రమత్తమై పగిడిపల్లి స్టేషన్‌లో రైలును నిలిపేసి, రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా కాలుతున్న బోగీని వేరుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో రైలు తిరిగి బయలుదేరి వెళ్లింది. నాలుగు అగ్నిమాపక శకటాలతో శ్రమించిన సిబ్బంది తెల్లవారుజామున నాలుగు గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌లో 2 వేల మంది ప్రయాణికులున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మంటలు అంటుకున్న బోగీ 90 శాతానికిపైగా కాలిపోయిందని, దాని విలువ రూ.కోటి ఉంటుందని వివరించారు.మంటల వ్యాపిస్తున్న సమయంలో ప్రయాణికుల ఆందోళనకు గురయ్యారు. కాలుతున్న బోగీ అటుఇటు బోగీల్లోని ప్రయాణికులు భయభ్రాంతులకు లోనై రైలు దిగి పరుగు తీశారు.

రైల్వే జీఎం పరిశీలన

ఘటనా స్థలాన్ని సికింద్రాబాద్‌ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌, ఆర్పీఎఫ్‌ ఐజీ రాజారాం, డీఆర్‌ఎం ఏకే గుప్తా, సీనియర్‌ డీఎస్‌సీ సుధాకర్‌, కాజీపేట ఆర్పీఎఫ్‌ సీఐ సంజీవరావు ఆదివారం సందర్శించారు. కాలిన బోగీని మౌలాలి వర్క్‌షాప్‌నకు తరలించారు.

పలు కోణాల్లో విచారణ

రైల్వే క్లూస్‌టీం, ఫోరెన్సిక్‌ విభాగం సిబ్బంది లగేజీ బోగీలోని సరకుల వివరాలను విశ్లేషించి కాలిన ఒక బైకుతోపాటు ఇతర వస్తువులను పరిశీలించారు. అనుమానిత సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బోగీలో ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ రవాణా చేసే వస్తువులున్నట్లు తెలిపారు. మండే స్వభావం ఉన్న వస్తువులు రాపిడికి గురికావడంతో మంటలు రేగాయా, కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని