logo

రోబోటిక్‌ సర్జరీని బీమా పథకాల్లో చేర్చాలి

ప్రైవేటు, ప్రభుత్వ ఆరోగ్య బీమా సంస్థలు నేడు విస్తృతమవుతున్న రోబోటిక్‌ సర్జరీని తమ బీమా పథకాల్లో చేర్చాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. శనివారం నానక్‌రాంగూడ షెరటన్‌ హోటల్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ గైనకాలజికల్‌ రోబోటిక్‌ సర్జన్స్‌ (ఏజీఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు

Updated : 14 Aug 2022 05:33 IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

మొదటి రోబోటిక్‌ గైన్‌ ఇండియా సదస్సు ప్రారంభం

రాయదుర్గం, న్యూస్‌టుడే: ప్రైవేటు, ప్రభుత్వ ఆరోగ్య బీమా సంస్థలు నేడు విస్తృతమవుతున్న రోబోటిక్‌ సర్జరీని తమ బీమా పథకాల్లో చేర్చాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. శనివారం నానక్‌రాంగూడ షెరటన్‌ హోటల్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ గైనకాలజికల్‌ రోబోటిక్‌ సర్జన్స్‌ (ఏజీఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న తొలి ‘రోబోటిక్‌ గైన్‌ఇండియా 2022’ సదస్సును ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గవర్నర్‌ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో ఆధునిక సాంకేతికతలను పరిచయం చేసినపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా తర్వాత రోగికి వినియోగించడం కష్టం.  వృత్తిరీత్యా చేసే పరిశోధనలను జర్నళ్లలో ప్రచురితం చేయాలి. తద్వారా వాటిని ఇతరులు ఉపయోగించుకుని మరింత మెరుగైన సేవలందిస్తారు. రోబోటిక్స్‌ సర్జరీ వంటి సేవలు ఆర్థికంగా భారం కాకుండా మరింత చేరువయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందుతున్న వైద్య విధానాలను బీమా సంస్థలు తమ పథకాల్లో అమలు చేయాలి’’ అని సూచించారు. ఏజీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.రుమా సిన్హా మాట్లాడుతూ.. రోబోటిక్‌ సర్జరీతో మెరుగైన సానుకూలతలు ఉంటాయని, తక్కువ రక్తం నష్టం, శరీరంపై తక్కువ కోతలు, ఆసుపత్రిలో రోగులు గడపాల్సిన సమయం కూడా తక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రముఖ వైద్య నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మహేంద్ర భండారీ పాల్గొన్నారు.

లక్ష్యం బలంగా ఉంటేనే విజయం
బేగంపేట: ఏ రంగంలోనైనా లక్ష్యం బలంగా ఉంటేనే విజయం సాధ్యమవుతుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) ఆధ్వర్యంలో కంపెనీ సెక్రటరీల 46వ సదరన్‌ ఇండియా ప్రాంతీయ సదస్సు బేగంపేటలోని ఓ హోటల్‌లో శనివారం జరిగింది. గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు.  దేశంలో గత 70 ఏళ్లలో 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికాభివృద్ధి సాధ్యపడితే తాజాగా 2025 వరకు 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ ముందుకు పోతున్నారన్నారు. కుటుంబ సభ్యులకంటే వ్యక్తిగత కార్యదర్శులతోనే ఎక్కువగా గడుపుతుంటామని చెప్తూ సహాయకులైన సెక్రటరీలు మంచివారైతే అంతా మంచే జరుగుతుందన్నారు. సెక్రటరీలు మంచివారిగా కనిపించకపోతే వారిలోని మంచినే ఎంచుకోవాలని సూచించారు. కంపెనీల విషయంలో ఇదే వర్తిస్తుందని, మంచి సెక్రటరీలుంటే సంస్థల ఎదుగుదలకు దోహదం చేస్తుందన్నారు. ముఖ్యంగా కార్పొరేట్‌ అధినేతలకు మంచి సెక్రటరీల అవసరం ఎంతో ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఐసీఎస్‌ఐ సావనీర్‌ను గవర్నర్‌ ఆవిష్కరించారు. ఐసీఎస్‌ఐ జాతీయాధ్యక్షుడు దేవేంద్ర వి.దేశ్‌పాండే మాట్లాడుతూ.. సంస్థల మనుగడలో ఎదురయ్యే ప్రతీ సమస్యకు కోర్టులను ఆశ్రయించకుండా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు వీలుగా జాతీయస్థాయిలో ఆర్బిట్రేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటు జరుగుతుందని, త్వరలో దేశవ్యాప్తంగా 20వరకు ఆర్బిట్రేషన్‌ సెంటర్లను ఏర్పాటుచేసే యోచన ఉన్నట్లు వెల్లడించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస్‌ స్వామీజి ప్రసంగించారు. సదస్సులో ఐసీఎస్‌ఐ సెంట్రల్‌ కౌన్సిల్‌ సభ్యులు ఆహ్లాదరావు, ఎస్‌ఐఆర్‌సీ ఛైర్మన్‌ శేఖర్‌బాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని