logo

పేరుకే పెద్దాసుపత్రులు

ఉస్మానియా, గాంధీలో రోగుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిపుణులైన వైద్యులు, సేవలకు కొరత లేకున్నా.. కొన్ని విభాగాల్లో పడకలు దొరకడం గగనమవుతోంది.

Published : 25 Nov 2022 03:06 IST

గాంధీ, ఉస్మానియాల్లో పడక దొరకడం గగనం
ఈనాడు, హైదరాబాద్‌/న్యూస్‌టుడే, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా, గాంధీలో రోగుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిపుణులైన వైద్యులు, సేవలకు కొరత లేకున్నా.. కొన్ని విభాగాల్లో పడకలు దొరకడం గగనమవుతోంది. గాంధీ ఆసుపత్రి గైనకాలజీ విభాగంలోని వార్డుల్లో ఒక్కో బెడ్డును ఇద్దరు, ముగ్గురు బాలింతలకు కేటాయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల న్యుమోనియా, కొవిడ్‌, ఇతర ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. పగటి పూట ఎలాగో సర్దుకుంటున్నా.. రాత్రి వేళ వారి కష్టాలు వర్ణణాతీతం. పసికందులను పడకపై నిద్ర పుచ్చి బాలింతలు నేలపై సర్దుకుంటున్నారు. సిజేరియన్‌ అయిన వారు నేలపై పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.


ఎప్పటి నుంచో అదే పరిస్థితి

గాంధీ గైనిక్‌ వార్డులో ఒక్కో పడకపై ఇద్దరు బాలింతలు

గాంధీలో గైనకాలజీకి సంబంధించి 350 పడకలున్నాయి. నెలకు వెయ్యికిపైనే ప్రసవాలు జరుగుతుంటాయి. ఒక్కో రోజు ముప్పైకి పైగా ప్రసవాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఒక బెడ్‌పైనే ఇద్దరు, ముగ్గురు బాలింతలను సర్దుబాటు చేస్తున్నారు. గాంధీకి వచ్చేవన్నీ ఎక్కువ శాతం సిజేరియన్లే కావడం, వారం నుంచి పదిరోజుల ఉండాల్సి రావడంతో పడకలు అందుబాటులో ఉండటం లేదు. నిర్మాణంలో ఉన్న కొత్త భవనం అందుబాటులోకి వస్తే ఈ ఇబ్బందులు తప్పనున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.ఎం.రాజారావు స్పష్టం చేశారు.


ఉస్మానియాలోనూ..

రోగిని నేలపై పడుకోబెట్టి చికిత్స

ఉస్మానియాలో పాత భవనం మూతపడిన తర్వాత పడకల కష్టాలు తప్పడంలేదు. ఎక్కువ సంఖ్యలో ఇన్‌పేషెంట్లు వచ్చినరోజు ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. కొన్నిసార్లు పడక దొరికే వరకు నేలపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. పాత భవనంలో 400 వరకు పడకలు ఉండేవి. మహిళా వార్డులతోపాటు ఇతర కీలక విభాగాలన్నీ అందులోనే కొనసాగేవి. అది కూలే పరిస్థితి ఉండటంతో ప్రభుత్వం దాన్ని మూసివేసింది. కుతుబ్‌షాహీ భవనంపై తాత్కాలిక షెడ్లు వేసి పడకలు సర్దుబాటు చేశారు. రోగుల తాకిడి ఉన్నప్పుడు సరిపోవడం లేదు. జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, న్యూరోసర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర విభాగాలకు ఎక్కువ మంది రోగులు వస్తుంటారు. దోబీ ఘాట్‌ ప్రాంతంలో కొత్త భవనం నిర్మించాలని పతిపాదనలున్నా ముందుకు సాగలేదు. ఆసుపత్రికి వచ్చిన ఏ రోగినీ తిప్పి పంపకుండా చికిత్స చేస్తున్నామని, దీంతో కొందరికి పడకలు దొరకడం కొంత ఆలస్యమవుతోందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేంద్ర పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని