logo

చలో గోవా.. హలో పంటర్‌

బెట్టింగ్‌ దందా రూపు మార్చుకుంటోంది. పందెం రాయుళ్లు పోలీసుల్ని ఏమార్చేందుకు స్థావరాన్ని గోవా సహా ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు మార్చుతున్నారు.

Published : 29 Nov 2022 04:37 IST

ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు, ఇయర్‌ ఫోన్లు

ఈనాడు, హైదరాబాద్‌: బెట్టింగ్‌ దందా రూపు మార్చుకుంటోంది. పందెం రాయుళ్లు పోలీసుల్ని ఏమార్చేందుకు స్థావరాన్ని గోవా సహా ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు మార్చుతున్నారు. ముఖ్యమైన మ్యాచ్‌లకు ముందే గుట్టుగా నగరాన్ని విడిచి వెళ్తున్నారు. పర్యాటకులుగా అక్కడే రిసార్టులు, గదులు అద్దెకు తీసుకుని హైదరాబాద్‌ కేంద్రంగా దందా నడిపిస్తున్నారు. మ్యాచ్‌లు ముగిశాక తాపీగా తిరిగొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

బుకీ ఆదేశిస్తే.. సబ్‌ బుకీ పాటిస్తాడు

నగరంలో ఒకప్పుడు బెట్టింగ్‌ అంటే పదుల సంఖ్యలో పంటర్లు టీవీలో మ్యాచ్‌ చూస్తూ పందెం కాసేవారు. ఆ తర్వాత బుకీలు ఫోన్లో మాట్లాడుతూ దందా నడిపేవారు. పోలీసు నిఘా పెరగడంతో కొంతకాలం యాప్‌ ద్వారా నడిచింది. వీటిపైనా నిఘా పెరగడంతో బుకీలు గోవా, ముంబయి, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పంటర్లు పందెం కాస్తున్నారు. మ్యాచ్‌ పూర్తయ్యాక పంటర్ల నుంచి వసూళ్లు లేదా లాభాల పంపిణీ జరిగిపోతుంది. కలెక్షన్‌ ఏజెంట్లను ఏర్పాటుచేసి ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన ఓ బుకీ ఇతర నగరాల్లో ఉంటూ దందా కొనసాగించాడు. నగరాల మధ్య కారులో తిరుగుతూ దందాచేస్తూ నాలుగేళ్లు దొరకలేదు.


పైసా కనిపిస్తే ఒట్టు

ఇతర రాష్ట్రాల నుంచి బెట్టింగ్‌ కొనసాగించే ముఠాలు డబ్బు పట్టుబడకుండా పక్కాగా వ్యవహరిస్తున్నాయి. సంబంధంలేని వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, బంధువుల బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. వచ్చిన మొత్తంలో ఒకట్రెండు శాతం చొప్పున కమీషన్‌ ఇస్తున్నారు. ఇటీవల ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ బృందానికి బెట్టింగ్‌ ముఠా నేత చిక్కినా డబ్బు దొరకలేదు. పోలీసులు ఆరా తీయగా రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాతో లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. డబ్బు పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకోకపోతే కేసు త్వరగా వీగిపోతుందని ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని