logo

Hyderabad: నచ్చిన కారు.. మెచ్చిన ధర: బేస్‌ మోడల్‌కు హై ఎండ్‌ ఫీచర్లు..

రెండేళ్లుగా కార్ల కొనుగోళ్లు పెరిగాయి. అన్ని ఫీచర్లు ఉన్న హై ఎండ్‌ మోడళ్లు కావాలంటే ప్రీమియం ధర చెల్లించాల్సి వస్తోంది.

Updated : 04 Dec 2022 10:18 IST

కొత్త కారుకు ఇంటీరియర్స్‌ బిగిస్తున్న మెకానిక్‌

ఈనాడు, హైదరాబాద్‌: రెండేళ్లుగా కార్ల కొనుగోళ్లు పెరిగాయి. అన్ని ఫీచర్లు ఉన్న హై ఎండ్‌ మోడళ్లు కావాలంటే ప్రీమియం ధర చెల్లించాల్సి వస్తోంది. కేవలం అదనపు ఫీచర్ల కోసం నాలుగైదు లక్షలు అదనంగా చెల్లించడం ఇష్టం లేనివారు, భరించలేనివారు బేస్‌, మిడ్‌ రేంజ్‌ మోడల్స్‌ కొనుగోలు చేసి షోరూంలోనే ఇంటీరియర్స్‌ చేయించుకుంటున్నారు. తక్కువ ఖర్చులో కోరుకున్న ఫీచర్లను జత చేసుకుంటున్నారు. 

టచ్‌స్క్రీన్‌, కెమెరా, డిస్క్‌బ్రేక్స్‌..: ప్రతి ఆటోమొబైల్‌ కంపెనీ ఒక్కో కారు మోడల్‌లో పది వరకు వేరియెంట్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. కాంపాక్ట్‌ ఎస్‌యూవీలు రూ.6 లక్షల నుంచి అందుబాటులో అని ప్రకటనలిస్తున్నా.. ప్రారంభ ఒకటి రెండు మోడల్స్‌ అస్సలు రావని షోరూమ్‌ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. తర్వాత బేస్‌మోడల్‌, మిడ్‌రేంజ్‌ మోడల్‌ పది లక్షల లోపు ఉంటున్నాయి. ఈ మోడల్స్‌ వెంటనే దొరుకుతున్నాయి. ఎస్‌యూవీల్లోనూ ప్రారంభ మోడల్స్‌ దొరుకుతున్నాయి. హై ఎండ్‌లో ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో కొనుగోలుదారులు బేస్‌, మిడ్‌రేంజ్‌ ఎస్‌యూవీలను కొనుగోలు చేసి హై ఎండ్‌ మోడల్‌లో ఉండే టచ్‌స్క్రీన్‌, ఆటోమేటిక్‌ కంట్రోల్డ్‌ ఏసీ, అలాయ్‌ వీల్స్‌, క్రూజ్‌ కంట్రోల్‌, 360 డిగ్రీస్‌ కెమెరా, వెనకాల కెమెరా, అన్ని చక్రాల డిస్క్‌బ్రేక్స్‌తో ఇంటీరియర్స్‌ను ప్రీమియం కారులో ఉండేలా చేయించుకుంటున్నారు. ఇవన్నీ కారు కొన్న షోరూంలోనే కంపెనీ విడిభాగాలతోనే బిగిస్తున్నారు. కొనుగోలుదారుల ఆలోచనలకు తగ్గట్టుగానే వాహనం తయారు చేసేటప్పుడే కంపెనీలు విడిగా వేటినైనా బిగించుకోవడానికి తగ్గట్టు డిజైన్‌ చేస్తున్నాయి.

ప్రతికూలతలూ ఉన్నాయ్‌..

హై ఎండ్‌లో వచ్చే అన్ని ఫీచర్లను మాత్రం జోడించుకోలేం. ఇప్పుడు చాలామంది సన్‌ రూఫ్‌ ఇష్టపడుతున్నారు. హై ఎండ్‌లోనే ఇది సాధ్యం. చాలాకార్లలో రెండు టైర్లకు డిస్క్‌ బ్రేక్‌ ఇస్తున్నారు. నాలుగింటికి మార్చుకోవడం సాధ్యమే. కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రయాణికుల భద్రతకు సంబంధించి బేస్‌ మోడల్స్‌లో రెండే ఎయిర్‌ బ్యాగ్‌లు ఇస్తున్నారు. వీటిని పెంచుకోలేం. కొత్తగా వస్తున్న ఎస్‌యూవీల్లో బేస్‌మోడల్‌లోనే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వస్తున్నాయి. టైర్లలో గాలిని చూపించే టీపీఎంఎస్‌ వంటి ఫీచర్లు వస్తున్నాయి.


‘హై ఎండ్‌ కార్ల కోసం 18వారాల బుకింగ్‌ పీరియడ్‌ నడుస్తోంది. వెంటనే కావాలనుకునేవారు, అంత బడ్జెట్‌ వెచ్చించలేనివారు బేస్‌మోడల్‌ కొని హై ఎండ్‌లోని ఫీచర్లు జోడించుకున్నారు. షోరూంలోనే చేసి ఇస్తున్నందున భరోసా కనబరుస్తున్నారు’

శివకుమార్‌, షోరూం ఎగ్జిక్యూటివ్‌


‘నేను ఒక ప్రముఖ కంపెనీకి చెందిన హై అండ్‌ మోడల్‌ కోసం చూశాను. రూ.21 లక్షలు అన్నారు. బేస్‌ మోడల్‌ రూ.12.8 లక్షలకు కొని టచ్‌స్క్రీన్‌, 360 డిగ్రీస్‌ కెమెరా, ఇంటీరియర్స్‌ చేయించుకున్నాను. లక్షన్నరలో ఇవన్నీ వచ్చాయి. నాలుగు లక్షల భారం తగ్గింది’

కార్తీక్‌, నాలుగు నెలల క్రితం కారు కొన్న వ్యక్తి

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని