logo

ఉత్తుత్తి బ్యాంకులు.. నకిలీ పూచీకత్తులు

నకిలీ బ్యాంకు పూచీకత్తు పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును నగర సీసీఎస్‌ పోలీసులు బట్టబయలు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

Published : 29 Jan 2023 02:35 IST

వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్‌(ఈఓడబ్ల్యూ)
అదనపు డీసీపీ స్నేహామెహ్రా, ఏసీపీ ఎస్‌.మోహన్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ బ్యాంకు పూచీకత్తు పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును నగర సీసీఎస్‌ పోలీసులు బట్టబయలు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ కార్యాలయంలో శనివారం సీసీఎస్‌ ఏసీపీ ఎస్‌.మోహన్‌కుమార్‌, అదనపు డీసీపీ స్నేహామెహ్రా మీడియాకు వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన జి.నాగరాజు(45) న్యాయవాది, లోన్‌ ఏజెంట్‌. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చేపట్టిన బయో మైనింగ్‌ కాంట్రాక్టును హర్షిత ఇన్‌ఫ్రా దక్కించుకుంది. దీని కోసం సెక్యూరిటీగా రూ.2.5 కోట్లకు బ్యాంకు పూచీకత్తు అవసరమైంది. హర్షిత ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధులు ప్రజ్వల్‌ సందీప్‌రెడ్డిలు నాగరాజును సంప్రదించి సహకరించమని కోరారు. రూ.47 లక్షలు కమీషన్‌ ఇచ్చారు. రాజస్థాన్‌కు చెందిన నరేష్‌శర్మ(52) నగరంలో స్థిరపడ్డాడు. ఇతడి ద్వారా నాగరాజు కోల్‌కత్తాలోని నిలోత్పల్ద్‌ాస్‌(56), సుబ్రజిత్‌ ఘోషాల్‌(31)ను సంప్రదించాడు. 4 శాతం కమీషన్‌  ఇచ్చి కోల్‌కత్తా, పార్క్‌స్ట్రీట్‌ ఇండస్‌ఇండ్‌ బ్యాంకు శాఖ పేరుతో రూ.3.25 కోట్ల విలువైన 12 నకిలీ పూచీకత్తు పత్రాలు సేకరించాడు. వాటిని హర్షిత ఇన్‌ఫ్రా ప్రతినిధులు కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హైదరాబాద్‌కు అందజేశారు. లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో ఆ పత్రాలను ఇండస్‌ఇండ్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి ఈ-మెయిల్‌ చేయగా.. నకిలీవని తేలింది. మాసాబ్‌ట్యాంకులోని ఇండస్‌ఇండ్‌ బ్యాంకు మేనేజర్‌ నగర సీసీఎస్‌, సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.45 కోట్ల విలువైన 60 నకిలీ పూచీకత్తు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిలోత్పల్‌ దాస్‌, సుబ్రజిత్‌ ఘోషాల్‌ కలిసి వివిధ బ్యాంకుల పేరిట రూ.100 కోట్ల మేర నకిలీ పూచీకత్తు పత్రాలు తయారు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.

నల్గొండ జిల్లాలోనూ.. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ పథకంలో హర్షిత్‌ ఇన్‌ఫ్రా 40 శాతం పనులు పూర్తిచేశారు. పలుచోట్ల నకిలీ పూచీకత్తు పత్రాలు దాఖలు చేసినట్లు తేలడంతో నల్గొండ జిల్లాలోని నందికొండ, హుజూర్‌నగర్‌, దేవరకొండ, నేరేడుచర్ల, నల్గొండ, చిట్యాల పురపాలికల్లో ఈ సంస్థ కాంట్రాక్టులను ప్రభుత్వం రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని