logo

మైనార్టీ గురుకులం.. ప్రారంభానికి సిద్ధం

మైనార్టీ గురుకుల భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తాండూరు మండలం జిన్‌గుర్తి గేటు వద్ద 167వ జాతీయ రహదారిని ఆనుకొని దీనిని నిర్మించారు.

Published : 06 Feb 2023 00:52 IST

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: మైనార్టీ గురుకుల భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తాండూరు మండలం జిన్‌గుర్తి గేటు వద్ద 167వ జాతీయ రహదారిని ఆనుకొని దీనిని నిర్మించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టీఎస్‌డీడబ్ల్యూఐడీసీ అధికారులు తెలిపారు. రూ.18కోట్లతో మూడు సంవత్సరాల క్రితం గురుకుల పాఠశాల భవన నిర్మాణం చేపట్టారు. తొలిసారిగా లిప్టు సదుపాయంతో నిర్మించిన భవనం పనులు పూర్తయ్యాయి. అన్నిహంగులతో నిర్మించిన భవనానికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. మైదానంలో ఆరు మార్గాల్లో సిమెంటు రహదారుల్ని నిర్మించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక నెలాఖరు లేదంటే మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

బోధనకు..వసతికి అనుగుణంగా: నాలుగు అంతస్తుల్లో నిర్మించిన గురుకుల భవనంలో ఏకకాలంలో 600 మంది విద్యార్థులకు బోధించేందుకు వీలుగా విశాలమైన తరగతి గదుల్ని నిర్మించారు. 6 నుంచి ఇంటర్‌ వరకు విద్యాభ్యాసం చేసేందుకు అనువుగా వీటిని నిర్మించారు. భోజనం, అల్పాహారం చేసేందుకు అన్నిసదుపాయాలతో భోజనశాల, వసతి గదులు సమకూర్చారు. బోధనకు, వసతికి వేర్వేరుగా భవనాలు అందుబాట్లోకి రానున్నాయి. విద్యార్థులతోపాటు 40 మందికిపైగా బోధన సిబ్బంది వసతికి సైతం ప్రత్యేక గదులు నిర్మించారు. ప్రిన్సిపల్‌ కార్యాలయంతోపాటు నివాస సముదాయం నిర్మించారు. ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశాక మైనార్టీ గురుకుల పాఠశాల నిమిత్తం విద్యా శాఖకు అప్పగించనున్నారు. దీంతో నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాలతోపాటు పట్టణం, పక్కనున్న కోడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లోని మైనార్టీ విద్యార్థులకు సౌకర్యంగా మారనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని