logo

దుండగుల దుశ్చర్య

తాండూరు కాగ్నానది చెక్‌డ్యాంకు గుర్తుతెలియని వ్యక్తులు గండి కొట్టారు. వింగ్‌ వాల్‌ పక్క నుంచి ఉద్దేశపూర్వకంగా కాల్వ తీయడంతో నీరు లీకేజీ అవుతోంది.

Published : 19 Mar 2023 02:33 IST

కాగ్నా చెక్‌డ్యాంకు గండి
ప్రవాహం పెరిగితే ఆనకట్టకే ప్రమాదం

ఎవరూ వెళ్లకుండా అడ్డుగా వేసిన ముళ్ల కంచె

న్యూస్‌టుడే, పాత తాండూరు: తాండూరు కాగ్నానది చెక్‌డ్యాంకు గుర్తుతెలియని వ్యక్తులు గండి కొట్టారు. వింగ్‌ వాల్‌ పక్క నుంచి ఉద్దేశపూర్వకంగా కాల్వ తీయడంతో నీరు లీకేజీ అవుతోంది. ఎగువ భాగంలోని నీటి ప్రవాహ ఒత్తిడి పెరిగితే కాలువ పెద్దదై చెక్‌డ్యాంకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సమీప పొలాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సాగునీటి శాఖ అధికారులు ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.

ఇసుక మాఫియా పనేనా..

ఈ కాలువ తీయడం ఇసుక మాఫియా పనే అని రైతులు ఆరోపిస్తున్నారు. తద్వారా ఎగువ నీరు త్వరగా వెళ్లిపోతుందని.. ఇసుకు పేరుకుంటుందని భావించి ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉంటారన్నారు.  కాలువ తీసిన తరువాత అటుగా ఎవరూ వెళ్లకుండా చుట్టూ పెద్ద ఎత్తున కంచె వేశారు.

వింగ్‌ వాల్‌ పక్కనుంచి తీసిన కాలువ

పరిధి కాదంటూ పోలీసుల దాటవేత 

గండిని సాగునీటి శాఖ అధికారులు శనివారం సాయంత్రం పరిశీలించారు. వెంటనే 100కు డయల్‌ చేశారు. తాండూరు పోలీసులు చెక్‌డ్యాం వద్దకు వచ్చి చూసి ఇది తమ పరిధి కాదంటూ వెళ్లిపోయారు. యాలాల, తాండూరు పట్టణ, తాండూరు గ్రామీణం పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. చివరకు సాగునీటి శాఖ ఏఈ సాయినాథ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రావణ్‌ తాండూరు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి డీఎస్పీ శేఖర్‌గౌడ్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.  

అధికారులు స్పందిస్తే మేలు

చెక్‌డ్యాంకు పక్కనుంచి చేసిన కాలువ పెద్దగా మారక ముందే సాగునీటి శాఖ అధికారులు అప్రమత్తం కావాల్సి ఉంది. దిగువ భాగానికి భారీగా నీరు ప్రవహిస్తే తాండూరు మండలం నారాయణపూర్‌, ఎల్మకన్నె, చిట్టిఘనాపూర్‌, బషీరాబాద్‌ మండలం జీవన్గీ, క్వాద్గిరా వద్ద ఉన్న చెక్‌డ్యాంలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది.

* ప్రతి ఏడాది వర్షాలు కురిసినప్పుడు ఒకటి నుంచి రెండు టీఎంసీల నీరు తాండూరు కాగ్నానదిలోని మీదుగా కర్ణాటకకు వృథాగా పారేది. తాండూరు ప్రజా ప్రతినిధులు, రైతుల విన్నపం మేరకు 2015లో రూ.8.52 కోట్లు మంజూరు కాగా చెక్‌డ్యాం నిర్మాణం చేశారు. ఎగువ భాగంలో ప్రస్తుతం భారీగా నీటి నిల్వ ఉంది. ప్రమాదం పెరిగి భారీ గండి పడితే ఆరు చెక్‌డ్యాంలు ధ్వంసమై సుమారు రూ.50 కోట్ల వరకు నష్టం కలిగే అవకాశం ఉందని సాగునీటి శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు.

కేసు నమోదు

తాండూరు, న్యూస్‌టుడే: తాండూరులో కాగ్నానది చెక్‌డ్యాంకు గండి కొట్టిన ఘటనలో కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి శనివారం తెలిపారు. జరిగిన ఘటనకు కారకులు ఎవరనే విషయంలో దర్యాప్తును ప్రారంభించినట్లు చెప్పారు. నిందితులను గుర్తిస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు