logo

కస్టమర్‌ కేరా.. నకిలీలతో వేస్తారు టోకరా!

కొత్తగా కొన్న వాషింగ్‌ మెషీన్‌ పనిచేయడం లేదని గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం వెతుకుతున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త..! మీరు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉంది! కొన్ని నెలలుగా ఈ తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి.

Published : 20 Mar 2023 02:28 IST

రెండు నెలల్లోనే  200 కేసులు
సైబర్‌ మోసాల్లో ఇదో కొత్త శైలి
ఈనాడు- హైదరాబాద్‌

కొత్తగా కొన్న వాషింగ్‌ మెషీన్‌ పనిచేయడం లేదని గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం వెతుకుతున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త..! మీరు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉంది! కొన్ని నెలలుగా ఈ తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో నగరంలో దాదాపు 200దాకా ఈ కేసులు నమోదయ్యాయి. నకిలీ కస్టమర్‌ కేర్‌ మోసాలకు ప్రధాన కారణం నకిలీ వెబ్‌సైట్లు. బ్రాండెడ్‌ సంస్థలను పోలిన నకిలీ వెబ్‌సైట్లు రూపొందించి.. ఫోన్‌ నంబర్లు అందులో ఉంచుతున్నారు. హరియాణ, జార్ఖండ్‌ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేలిస్తే అసలైన వెబ్‌సైట్‌ తరహాలో కొత్తవి తయారుచేస్తున్నారు.  గూగుల్‌లో నకిలీ వెబ్‌సైట్‌ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందర్ని నియమించి వేల సంఖ్యలో క్లిక్కులు, రేటింగ్‌లు ఇస్తారు. దీంతో ముందు నకిలీదే కనిపిస్తుంది. వీటిని నమ్మి మోసపోతున్నారు.

రూ.8 కోట్లు హాంఫట్‌

నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఇలాంటి మోసాలు దాదాపు 200 వరకూ నమోదయ్యాయి. బాధితులు రూ.8 కోట్ల వరకు పోగొట్టుకున్నారు. మున్ముందు ఇలాంటివి పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

గుర్తుపట్టడం ఎలా?

* ఏదైనా సంస్థ కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం వెతికినప్పుడు పైభాగంలో వచ్చిన వాటినే నమ్మకూడదు. అసలైనవేనా అని సరిచూసుకోవాలి.
* అన్ని సంస్థలు తమ ఉత్పత్తులపై యూజర్‌ గైడ్‌, బుకింగ్‌, కొనుగోలు సందర్భంగా ఇచ్చే రసీదులు, ఇతర పత్రాల్లో కస్టమర్‌ కేర్‌ నంబర్లు ఉంచుతాయి. వాటినే సంప్రదించాలి.
* బ్యాంకులన్నీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై ఈ ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుతాయి.
* అధికారిక వెబ్‌సైట్లు హెచ్‌టీటీపీ, ప్యాడ్‌లాక్‌(తాళం గుర్తు)తో మొదలవుతాయి.

ఇలా మోసపోయారు..

* శంకర్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి బస్సు టికెట్‌ రిజర్వేషన్‌ చేయించుకున్నాడు. ఇతర పనులతో రిజర్వేషన్‌ రద్దుకని ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ఏజెన్సీ కస్టమర్‌ కేర్‌ కోసం వెతికాడు. ఒక నంబరు కనిపించగా ఫోన్‌ చేయగా.. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అవతలి వ్యక్తి సూచించాడు. చెల్లింపు ప్రక్రియ పరిశీలించాలంటూ బ్యాంకు ఖాతా, పాస్‌వర్డ్‌ తెలుసుకుని రూ.1.89 లక్షలు కాజేశారు.
* మణికొండకు చెందిన వైద్యుడు ఆన్‌లైన్‌లో వస్తువు ఆర్డర్‌ చేయగా.. అది రాకపోవడంతో సంస్థ కస్టమర్‌ కేర్‌ నంబరు కోసం వెతికాడు. కనిపించిన నంబరుకు ఫోన్‌ చేయగా.. అవతలి వ్యక్తి ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాడు. బ్యాంకు ఖాతా నుంచి రూ.99 వేలు కొట్టేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని