logo

చిరిగినా పట్టించుకోరు..కొత్తవి సమకూర్చరు

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం సరఫరా చిరిగిన గోనె సంచుల్లోనే సాగుతోంది. ఈ పరిణామంతో ఇటు డీలర్లు అటు లబ్ధిదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. హైదరాబాద్‌, సనత్‌నగర్‌లోని పెద్ద గోదాముల నుంచి జిల్లాలోని డీలర్లకు నిర్ణీత కోటా ప్రకారం బియ్యాన్ని లారీల్లో పంపిస్తున్నారు.

Updated : 22 Mar 2023 05:23 IST

అధ్వాన గోనె సంచులతో బియ్యం నేలపాలు
న్యూస్‌టుడే, తాండూరు

సంచుల్లోంచి బయటకు వచ్చిన ధాన్యం

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం సరఫరా చిరిగిన గోనె సంచుల్లోనే సాగుతోంది. ఈ పరిణామంతో ఇటు డీలర్లు అటు లబ్ధిదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. హైదరాబాద్‌, సనత్‌నగర్‌లోని పెద్ద గోదాముల నుంచి జిల్లాలోని డీలర్లకు నిర్ణీత కోటా ప్రకారం బియ్యాన్ని లారీల్లో పంపిస్తున్నారు. వీటిని ముందుగా గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి బియ్యం బస్తాలను ట్రాక్టర్లు, చిన్న లారీల్లో లోడ్‌ చేస్తున్నారు. ఈ రెండు ప్రక్రియల సమయంలో చిరిగిన సంచుల్లోంచి బియ్యం కిందకు జారి నేలపై పడి పోతున్నాయి. గోదాముల్లో అయితే కార్మికులు ఒక దగ్గరకు చేర్చి కుట్లు వేసిన బస్తాల్లో నింపి డీలర్లకు అప్ప జెబుతున్నారు. ఇతరచోట్ల ఆ విధంగా కుదరడంలేదు.

ఇదీ జిల్లా కోటా...

* తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌లోని నాలుగు గోదాములకు ప్రతి నెల 50 కిలోల బరువుతో ఉన్న బియ్యం 8,640.28 మెట్రిక్‌ టన్నుల్లో వస్తున్నాయి. * 588 మంది డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. * 2,08,181 ఆహార భద్రత, 39 అన్నపూర్ణ, 26,728 అంత్యోదయ కార్డు దారులున్నారు. వీరికి కాకుండా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఇక్కడి నుంచే బియ్యం పంపిణీ జరుగుతుంది.

ప్రతి నెలా వాగ్వాదాలే..

చిరిగిన గోనె సంచుల్లో వస్తున్న బియ్యాన్ని డీలర్ల వద్ద లారీలు, ట్రాక్టర్ల నుంచి దించే సమయంలో నేలపై పడుతున్నాయి. వీటిని చీపుర్లతో ఊడ్చి ఒక దగ్గరకు చేర్చుతున్నారు. ఇలాంటి సమయంలో మట్టితో కలిసి  సహజ రంగును కోల్పోతున్నాయి. లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో రంగు మారిన బియ్యాన్ని చూసి వాదనలు ఏర్పడుతున్నాయి. దీంతో డీలర్లు వాటిని పక్కకు బెట్టి వేరొక బస్తాలోని తీసి అందిస్తున్నారు.

విక్రయ డబ్బులు ఇంకా రాలేదు

డీలర్లు బియ్యంను పంపిణీ చేయగా మిగిలిన ఖాళీ సంచులను అధికారుల ఆదేశాలతో గోదాములకే అప్పగిస్తున్నారు. ఒక్కో సంచికి రూ.21చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. డిసెంబరు నుంచి ఇప్పటి వరకు డీలర్లు వేల కొద్ది బస్తాలను విక్రయించారు. డబ్బులు మాత్రం రాలేదు.

ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది

చిరిగిన గోనె సంచుల స్థానంలో కొత్త సంచుల్లో బియ్యం పంపిణీ చేయాలనేది ఉన్నత స్థాయికి సంబంధించిన విషయం. తాము ఇప్పటికే అధికారులకు సమస్య గురించి వివరించాం. స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. 

- రవి, పౌర సరఫరాల శాఖ గోదాం ఇన్‌ఛార్జి, తాండూరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని