logo

వారి చికిత్సతో అవయవాలు పాడయ్యాయి

తన ఆరోగ్యం క్షీణించి, అవయవాలు పాడయ్యేందుకు కారణమైన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 31 Mar 2023 02:44 IST

ఆసుపత్రిపై చర్యలకు మహిళ ఫిర్యాదు

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: తన ఆరోగ్యం క్షీణించి, అవయవాలు పాడయ్యేందుకు కారణమైన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ కథనం ప్రకారం.. ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన విశ్రాంత ఎస్సై లక్ష్మయ్య భార్య కావలి వాణిశ్రీ(57)కి తలనొప్పిగా ఉండడంతో గత నెల 16న స్థానిక శ్రీనివాస్‌ మెటర్నిటీ నర్సింగ్‌ హోంకు వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్‌ శేఖర్‌ రక్తం తక్కువగా ఉందని, ఇందుకు రూ.7 వేలు ఖరీదు చేసే ఇంజెక్షన్‌, మరికొన్ని మందులు ఇవ్వాల్సి ఉంటుందని సూచించాడు. బాధితురాలు సొమ్ము చెల్లించగా.. ఆసుపత్రి ఉద్యోగి శ్రీనివాస్‌ 10 నిమిషాల్లో ఇంజెక్షన్‌ చేశాడు. అయితే ఆ ఇంజెక్షన్‌ చేయడానికి గంటన్నర పడుతుందని ఇతర వైద్యుల ద్వారా బాధితురాలి భర్త తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలు వాంతులు, గుండెనొప్పితో బాధపడుతుండగా ఆమె కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్ల ఆమె కాలేయం పూర్తిగా దెబ్బతినడంతోపాటు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని అక్కడి వైద్యులు చెప్పారు. అక్కడ చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడినా కాలేయం దెబ్బతిందని చెప్పి డిశ్ఛార్జి చేశారు. దాంతో డాక్టర్‌ శేఖర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని