logo

ఇరుకు గదుల్లో వార్డు ఆఫీసులా?

రాజధానిలో పాలన, పౌర సేవల వికేంద్రీకరణే లక్ష్యంతో వార్డు కార్యాలయాలకు సర్కారు శ్రీకారం చుట్టింది. అయితే కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వీడట్లేదు.

Published : 30 May 2023 02:12 IST

ప్రభుత్వం కన్నెర్ర.. కమిషనర్‌కు తాఖీదు
ఈనాడు, హైదరాబాద్‌

పాటిగడ్డ మోడల్‌ మార్కెట్‌లో సిద్ధమవుతున్న కార్యాలయం

రాజధానిలో పాలన, పౌర సేవల వికేంద్రీకరణే లక్ష్యంతో వార్డు కార్యాలయాలకు సర్కారు శ్రీకారం చుట్టింది. అయితే కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యం వీడట్లేదు. ఆయా డివిజన్లలో వార్డు కార్యాలయాలను మొక్కుబడిగా సిద్ధం చేస్తున్నారు. సరైన విస్తీర్ణం, గాలి, వెలుతురు, ఇతర వసతులు లేని ఇరుకు భవనాలను ఎంపిక చేశారు. విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ బల్దియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌కుమార్‌కు మెమో జారీ చేశారు.

హడావుడి చేయడంతో..

స్థానిక సమస్యలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వార్డు ఆఫీసుల ద్వారా సత్వరమే పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ మే నెలాఖరుకు కార్యాలయాలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. దీంతో సర్కిళ్ల వారీగా కార్యనిర్వాహక ఇంజినీర్లు ఆఫీసులను సిద్ధం చేసే పనులు చేపట్టారు. అయితే ఇరుకు గదులు.. కనీస వసతులు లేని భవనాల్లో నామమాత్రంగా ఏర్పాటు చేస్తున్నారని కొందరు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దానిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ స్పందించి.. కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌కు మెమో ఇచ్చారు. వార్డు ఆఫీసుల పూర్తి సమాచారం అందజేయాలని ఆదేశించారు.

మోడల్‌ మార్కెట్లపై దృష్టి..

నగరవ్యాప్తంగా నిర్మించిన 34 మోడల్‌ మార్కెట్లలో ఏ ఒక్కటీ వినియోగంలో లేదు. వీటిని ఉపయోగించుకోవాలని గతంలో జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. దీంతో ఇటీవల చందానగర్‌ మోడల్‌ మార్కెట్‌ను ఓ ఎన్జీవోకు ఇచ్చారు. పేద యువతకు ఆంగ్లంలో ప్రావీణ్యం కల్పించి, ఉపాధి చూపే సంస్థకు ఇచ్చారు. అది మినహా మిగిలిన 33 మార్కెట్‌ భవనాలను వార్డు ఆఫీసుల కోసం సిద్ధం చేయాలని తాజాగా జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. విస్తీర్ణం తక్కువ ఉన్న భవనాల్లో ఏర్పాటు చేస్తే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించడంతో, సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్‌ జోన్ల అధికారులు మోడల్‌ మార్కెట్లలో సౌకర్యాల కల్పనపై దృష్టిపెట్టారు. సికింద్రాబాద్‌ జోన్‌, బేగంపేట డివిజన్‌ వార్డు ఆఫీసును పాటిగడ్డ మోడల్‌ మార్కెట్‌లో ఏర్పాటు చేసేందుకు అధికారులు పనులు ప్రారంభించారు.

వెయ్యి చ.అ. విస్తీర్ణానికి మించి ఉండాలి..

వార్డు కార్యాలయం కనీసం 1,000 చదరపు అడుగులు ఉండాలి.. కార్పొరేట్‌ ఆఫీసులా కనిపించాలి.. కార్యాలయానికి దారి చూపే సూచిక బోర్డులను,  సిబ్బందికి టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేయాలని అర్వింద్‌ కుమార్‌ తాజాగా జీహెచ్‌ఎంసీకి సూచించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఎంపిక చేసిన అన్ని వార్డు కార్యాలయాలు, వాటి విస్తీర్ణం, లోపల ఏర్పాటు చేసిన గృహోపకరణాల వీడియోలు, ఫొటోలు పంపాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని