logo

మహా నగరానికి జలాభిషేకం

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో మహా నగర తాగునీటి ముఖ చిత్రమే మారిపోయింది. దాదాపు రూ.18 వేల కోట్లతో ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.

Updated : 01 Jun 2023 03:46 IST

పదేళ్లలో దశదిశలా పెరిగిన నీటి సరఫరా
అవుటర్‌ రింగ్‌రోడ్డు వరకు సేవల విస్తరణ

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో మహా నగర తాగునీటి ముఖ చిత్రమే మారిపోయింది. దాదాపు రూ.18 వేల కోట్లతో ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నిత్యం 460 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని జలమండలి అందిస్తోంది. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే తాగునీటికి జనం ఇబ్బందులు పడేవారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర నీటి అవసరాలు గుర్తించిన పాలకులు శరవేగంగా ప్రణాళిక సిద్ధం చేశారు. గోదావరి ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును నగర ప్రజలకు అందించారు.

ఈనాడు, హైదరాబాద్‌

అన్ని కాలాల్లో..

నగరంలో సగానికి పైగా కృష్ణా జలాలే దాహార్తి తీరుస్తున్నాయి. మూడు దశల్లో 270 ఎంజీడీలు నిత్యం నగరానికి తరలిస్తున్నారు. వేసవిలో నాగార్జున సాగర్‌లో నీటి మట్టాలు తగ్గినప్పుడు ఆ ప్రభావం నగరంపై పడుతోంది. ఇక నుంచి ఈ సమస్య లేకుండా ప్రభుత్వం రూ.1400 కోట్లతో చేపట్టిన సుంకిశాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

100 శాతం మురుగు శుద్ధి

నగరంలో భవిష్యత్తులో మురుగు సమస్య తీవ్రమయ్యే సూచనలున్నాయి. పదేళ్ల నుంచే దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలో 100శాతం మురుగు శుద్ధి సాకారం కానుంది. గ్రేటర్‌లో 1650 మిలియన్‌ లీటర్లు నిత్యం మురుగు ఉత్పత్తి అవుతోంది. 25 మురుగు శుద్ధి కేంద్రాల ద్వారా 772 మిలియన్‌ గ్యాలన్లు శుద్ధి చేస్తున్నారు. త్వరలో మొదలయ్యే 31 కొత్త ఎస్టీపీల ద్వారా వందశాతం మురుగు శుద్ధి చేయనున్నారు.

శివార్ల కష్టాలకు చెక్‌

ప్రధాన నగరంలో కలిసినా నిత్యం నీటి కష్టాలు ఎదుర్కొన్న శివారు మున్సిపాలిటీలపై దృష్టిసారించారు. తొలుత మల్కాజిగిరి మున్సిపాలిటీలో తాగునీటి పైపులైన్లు విస్తరించారు. వేసవి వస్తే, గతంలో ఈ ప్రాంతంలో ఇళ్లు మొత్తం ఖాళీ చేసి వెళ్లేవారు. ఈ ప్రాజెక్టుతో మున్సిపాలిటీ ప్రజల కష్టాలు పూర్తిగా తీరాయి. అదే ఊపుతో రూ.1900 కోట్లతో మిగతా మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను విస్తరించారు. గతంలో 10-15 రోజులకు కూడా నీటి సరఫరా జరిగేది కాదు. ప్రస్తుతం ప్రధాన నగరంతోపాటు శివార్లకు రోజు విడిచి రోజు తాగునీటిని అందిస్తున్నారు.

అవుటర్‌ వరకు సేవలు

నగరానికి అవుటర్‌ రింగ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత చుట్టూ కొత్త అవసరాలు ఏర్పడుతున్నాయి. చుట్టూ ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో పాటు కొత్తగా నిర్మిస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీలు, ఇతర కాలనీలకు తాగునీరందించడానికి సైతం పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఫేజ్‌-1లో 190 గ్రామాల్లో 2041 కి.మీ.మేర పైపులైను అందుబాటులోకి వచ్చింది. ఫేజ్‌-2 కింద మిగతా గ్రామాలను అనుసంధానం చేస్తూ 2100 కి.మీ. మేర విస్తరిస్తున్నారు.


ఇదీ గ్రేటర్‌ లెక్క..

* మొత్తం సర్వీసు ఏరియా- 1451.91 చ.కి.మీ.

* ప్రధాన నగరం- 169.30 చ.కి.మీ.

* శివారు మున్సిపల్‌ సర్కిళ్లు- 518.90 చ.కి.మీ.

* అవుటర్‌ రింగ్‌రోడ్డు గ్రామాల పరిధి-  939.80 చ.కి.మీ.

* శుద్ధి చేసిన నీటి సరఫరా తరలించే ప్రధాన పైపులు- 1500 కి.మీ

* సరఫరా లైన్లు- 8051 కి.మీ.

* నగరానికి రోజూ నీటిని తరలించే సామర్థ్యం- 602 ఎంజీడీలు

* ప్రస్తుతం సరఫరా చేస్తున్నది- 460 ఎంజీడీలు

* నల్లా కనెక్షన్లు- 12 లక్షలు

* ప్రతి వ్యక్తికి అందిస్తున్న నీళ్లు(రోజుకు)- 150 లీటర్లు

* లబ్ధి పొందే జనాభా-  కోటిపైనే


అభివృద్ధి రహదారులు

గ్రేటర్‌లో 97 రోడ్ల విస్తరణ పూర్తి, పురోగతిలో 77

ఐఎస్‌బీ వెనుక నుంచి యూఎస్‌ కాన్సులేట్‌ వైపు నిర్మాణంలో ఉన్న రోడ్డు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం విజయవంతంగా కొనసాగుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో దాదాపు వంద రహదారులు విస్తరణకు నోచుకున్నాయి. మరిన్ని విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. అభివృద్ధికి సూచికలైన రహదారులపై రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చొరవకు ప్రగతి గణాంకాలు అద్దం పడతాయని నగర ప్రణాళిక విభాగం సంతోషం వ్యక్తం చేస్తోంది. రోడ్ల కోసం సుమారు తొమ్మిది వేల ఆస్తులను సేకరించామని, జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక భూసేకరణ విభాగాన్ని ఏర్పాటు చేయడంతో అది సాధ్యమైందని స్పష్టం చేస్తోంది.

మునుపెన్నడూ లేనట్లుగా..

జీహెచ్‌ఎంసీ ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల వంటి 35 పనులు పూర్తి చేయగా, కొన్ని వేర్వేరుదశల్లో ఉన్నాయి. దానికి ముందే హైదరాబాద్‌ మెట్రోరైలు అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎంఆర్‌) కారిడార్లలో రోడ్ల విస్తరణ మొదలైంది. చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు(సీపీపీ) కింద చుట్టూ పలు రహదారుల విస్తరణ జరిగింది. ఆయా ప్రాజెక్టుల కోసం రాష్ట్ర సర్కారు జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకంగా భూ సేకరణ విభాగాన్ని ఏర్పాటుచేసింది. జిల్లా కలెక్టర్లతో సంబంధం లేకుండా భూసేకరణ పూర్తి చేసే వెసులుబాటును జీహెచ్‌ఎంసీకి కల్పించడంతో.. సంవత్సరాలు జరగాల్సిన పని నెలల్లో పూర్తయినట్లు ప్రణాళిక విభాగం చెబుతోంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని