logo

కల సాకారమయ్యే వేళ

రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో 11,700 ఇళ్లను శనివారం పంపిణీ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. సగటున నియోజకవర్గానికి 500 చొప్పున లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని వివరించింది.

Updated : 01 Sep 2023 06:04 IST

రేపు తొమ్మిది ప్రాంతాల్లో 11700 పట్టాల అందజేతకు ఏర్పాట్లు
మంత్రులు, ఉపసభాపతి,మేయర్‌ ఆధ్వర్యంలో..
ఈనాడు, హైదరాబాద్‌

రెండు పడక గదుల ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో 11,700 ఇళ్లను శనివారం పంపిణీ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. సగటున నియోజకవర్గానికి 500 చొప్పున లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని వివరించింది. దశలవారీగా  లక్ష ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జీహెచ్‌ఎంసీ గృహ నిర్మాణ విభాగం స్పష్టం చేసింది.

మంత్రి మహేందర్‌రెడ్డి..

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో   ని నార్సింగిలో నిర్మించిన 196 ఇళ్లను, బైరాగిగూడలో నిర్మించిన 160 ఇళ్లను లబ్ధిదారులకు మంత్రి మహేందర్‌రెడ్డి అందజేయనున్నారు.

నల్లగండ్లలో మంత్రి తలసాని

నల్లగండ్లలో జరగనున్న పట్టాల పంపిణీలో నల్లగండ్లలో నిర్మించిన 216 ఇళ్లు, సాయినగర్‌లో నిర్మించిన 128 ఇళ్లను శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 344 మంది లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అందజేయనున్నారు.

మంఖాల్‌లో మంత్రి సబిత..

రంగారెడ్డి పరిధిలోని మంఖాల్‌లో 2230 మంది లబ్ధిదారులకు మంత్రి సబిత ఇళ్లపట్టాలను అందజేస్తారు. మంఖాల్‌-1లో  500 ఇళ్లను మహేశ్వరం నియోజకవర్గం వారికి, మంఖాల్‌-2లోని 1730ఇళ్లను మలక్‌పేట్‌, పాతబస్తీ పరిధిలోని వారికి అందిస్తారు.

మంత్రి మహమూద్‌ అలీ..

చాంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడ, ఫరూఖ్నగర్‌లలో బండ్లగూడ సర్వే నెం.82, 83/పిలో నిర్మించిన 270 ఇళ్లను చాంద్రాయణగుట్ట వారికి, ఫరూఖ్‌నగర్‌లో నిర్మించిన 500 ఇళ్లను బహదూర్‌పుర నియోజకవర్గం వారికి మంత్రి మహమూద్‌ అలీ   పంపిణీ చేస్తారు.

బహదూర్‌పల్లిలో మంత్రి కేటీఆర్‌..

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం బహదూర్‌పల్లిలో ఇళ్ల పంపిణీ జరగనుంది. గాజులరామారంలోని 144, బహదూర్‌పల్లిలోని 356, డి-పోచంపల్లిలోని 1200 ఇళ్లను కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి చెందిన 200మందికి, సనత్‌నగర్‌కు చెందిన 500మందికి, కూకట్‌పల్లికి చెందిన 500మందికి కలిపి మొత్తం 1700 మంది లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్‌ అందజేస్తారు.

మంత్రి హరీశ్‌రావు..

పటాన్‌చెరు కొల్లూరు, అమీన్‌పూర్‌ ప్రాంతాల్లో పట్టాల పంపిణీలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కొల్లూరులోని 1,500 ఇళ్లను ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన 200 మందికి, జూబ్లీహిల్స్‌కు చెందిన 500 మందికి, శేరిలింగంపల్లికి చెందిన 156, రాజేంద్రనగర్‌కు చెందిన 144, పటాన్‌చెరుకు చెందిన 500 మందికి అందజేయనున్నారు. అమీన్‌పూర్‌లో నిర్మించిన 1800 గృహాలను గోషామహల్‌, నాంపల్లి, కార్వాన్‌ ప్రాంతాల నుంచి 500 చొప్పున, ఖైరతాబాద్‌లోని 300 మందికి పట్టాలను అందించనున్నారు. 

  • మంత్రి మల్లారెడ్డి.. మేడ్చల్‌ నియోజకవర్గం అహ్మద్‌గూడలోని 1500 ఇళ్లను 500ల చొప్పున మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గం వారికి పంపిణీ చేయనున్నారు.
  • గ్రేటర్‌ మేయర్‌ విజయలక్ష్మి.. ఉప్పల్‌ శ్రీనగర్‌కాలనీలో నిర్మించిన 500 ఇళ్ల పట్టాలను అందజేస్తారు.  
  • ఉపసభాపతి పద్మారావుగౌడ్‌.. మేడ్చల్‌ నియోజకవర్గం ప్రతాప్‌ సింగారంలో నిర్మించిన 1000 ఇళ్లను   లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని