logo

కానరాని కామన్‌ మొబిలిటీ కార్డు

నగరంలో ప్రజారవాణా సమన్వయం లేకుండా సాగుతోంది. ఆర్టీసీ బస్సులు మెట్రో స్టేషన్ల కింద ఆగవు.. ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు అస్సలే వెళ్లవు.. దీంతో ప్రజారవాణా వినియోగం నగర ప్రయాణికులకు కష్టంగా మారుతోంది.

Published : 27 Mar 2024 08:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ప్రజారవాణా సమన్వయం లేకుండా సాగుతోంది. ఆర్టీసీ బస్సులు మెట్రో స్టేషన్ల కింద ఆగవు.. ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు అస్సలే వెళ్లవు.. దీంతో ప్రజారవాణా వినియోగం నగర ప్రయాణికులకు కష్టంగా మారుతోంది. ఇదే సమన్వయ లోపం ‘కామన్‌ మొబిలిటీ కార్డు’ను అందుబాటులోకి తీసుకురావడంలోనూ కనిపిస్తోంది. మెట్రో ప్రయాణం అందుబాటులోకి వచ్చిన ఏడాదే కామన్‌ మొబిలిటీ కార్డును ప్రయాణికులకు చేరువచేయాలని అప్పటి పాలకులు భావించారు. ఈ దిశగా టీఎస్‌ఆర్టీసీ, ద.మ. రైల్వే, మెట్రో అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇక.. బస్‌ పాస్‌, మెట్రో పాస్‌, ఎంఎంటీఎస్‌ టిక్కెట్‌ కోసం బారులు తీరాల్సిన అవసరం ఉండదన్నారు. కానీ, ఏడేళ్లయినా కార్యరూపం దాల్చలేదు.

చొరవ చూపని టీఎస్‌ఆర్టీసీ..

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు ప్రత్యేకంగా కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఇందుకు కామన్‌ మొబిలిటీ కార్డును ఉపయోగించుకుంటే సరిపోతుందని భావించింది. అప్పటివరకూ ఆధార్‌ కార్డు చూపించాలని సూచించింది. కానీ, ఆధార్‌తోనే మహాలక్ష్మి పథకం వర్తింపజేస్తోంది. ప్రత్యేక కార్డుల జోలికి పోవడంలేదు. ఈ తరుణంలో అయినా కామన్‌ మొబిలిటీ కార్డు అందుబాటులోకి వస్తే.. అన్ని కార్డులను పక్కన పడేసి.. ఒక్క కార్డుతో ఆటో, క్యాబ్‌, ఆర్టీసీ సిటీబస్సు, ఎంఎంటీఎస్‌, మెట్రోలలో ప్రయాణంతోపాటు.. బయట షాపింగ్‌కు కూడా అవకాశం ఉంటుందని ప్రయాణికులు భావించారు. ప్రజారవాణాలో అగ్రస్థానంలో ఉన్న ఆర్టీసీనే ఇందుకు చొరవ చూపుతుందనుకున్నా.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు.


ప్రజారవాణా విస్తరిస్తున్న వేళ..

ఎంఎంటీఎస్‌ రెండోదశతో నగరానికి నలువైపులా అతి తక్కువ టికెట్‌ ధరతో కాలుష్యం లేని ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 140 కిలోమీటర్ల మేర విస్తరించిన ఎంఎంటీఎస్‌ సర్వీసుల సంఖ్యను పెంచితే నగర ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ప్రస్తుతానికి సరిపడా రైళ్లు లేక శివార్లకు అడపాదడపా తిరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా తన వాటా నిధులిచ్చి.. ఎంఎంటీఎస్‌ సర్వీసులను పెంచేలా ద.మ. రైల్వేపై ఒత్తిడి తేనుంది. ఇలా పూర్తిస్థాయిలో ఎంఎంటీఎస్‌లు అందుబాటులోకి వస్తే.. ఆర్టీసీ కొత్త బస్సులన్నీ సమకూరితే.. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకూ మెట్రో సర్వీసులు పెరిగితే నగరంలో ప్రజారవాణా ఎంతో ప్రగతి సాధించినట్టవుతుంది. అన్ని ప్రజారవాణా వ్యవస్థలకు ఉపయోగపడేలా కామన్‌ మొబిలిటీ కార్డు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని