logo

హెచ్‌ఎండీఏలో కదులుతున్న టీడీఆర్‌ డొంక

హెచ్‌ఎండీఏలో ట్రాన్స్‌ఫర్‌బుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌(టీడీఆర్‌) వ్యవహారం డొంక కదులుతోంది. 

Published : 30 Mar 2024 02:41 IST

ఇద్దరు అధికారుల నుంచి వివరణ కోరిన కమిషనర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏలో ట్రాన్స్‌ఫర్‌బుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌(టీడీఆర్‌) వ్యవహారం డొంక కదులుతోంది.  ఇద్దరు అధికారుల తీరుపై హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దానకిశోర్‌ తలంటినట్లు సమాచారం. వీరిలో ఒకరు కీలక బాధ్యతలు నిర్వహిస్తుండగా...మరొకరు జోన్‌స్థాయిలో ముఖ్య బాధ్యతలు చేపడుతున్నారు. టీడీఆర్‌ విషయంలో ఇద్దరు అధికారులకు తాజాగా మెమో జారీ చేసి వివరణ కోరినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఏపీవో కృష్ణకుమార్‌ను కమిషనర్‌ దానకిశోర్‌ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. పుప్పాలగూడలోని దాదాపు 30 వేల చదరపు గజాల భూమికి సంబంధించి అడ్డగోలుగా టీడీఆర్‌కు ఏపీవో కృష్ణకుమార్‌ సిఫార్సు చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. పీవో, డైరెక్టర్‌ స్థాయిలో దీనిపై వివరణ కోరే అవకాశం ఉన్నప్పటికీ వారు కూడా పరిశీలన చేయలేదని తెలుస్తోంది. దీంతో నేరుగా దస్త్రం కమిషనర్‌ దానకిశోర్‌ దృష్టికి వెళ్లడంతో అక్కడ ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది. విలువైన భూమికి టీడీఆర్‌ ఇచ్చే ముందు క్షేత్రస్థాయి పరిశీలనతోపాటు ఆయా సర్వే నంబర్లలో దరఖాస్తుదారులు పేర్కొన్నట్లు అంత భూమిని రహదారి నిర్మాణానికి ప్రభుత్వానికి దాఖలు చేశారా?..లేదా గిఫ్ట్‌డీడ్‌లో ఉన్న అంశాలు వాస్తవమేనా?..పూర్తిస్థాయిలో పరిశీలించాలి.  కానీ ఈ భూమి విషయంలో కృష్ణకుమార్‌ కనీస పరిశీలన లేకుండా దస్త్రాలను ఉన్నతాధికారులకు పంపినట్లు స్పష్టమైంది. పైస్థాయిలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంది.  ఇంత కీలకమైన వ్యవహారంలో క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ముందుకు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. మిగతా జోన్లలో ఇలాంటి వ్యవహారాలపై  ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని