logo

రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి

సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి జి. కిషన్‌రెడ్డి అన్నారు.

Published : 19 Apr 2024 03:18 IST

ఐదేళ్ల ప్రగతిని ప్రజలకు నివేదించిన కిషన్‌రెడ్డి

నివేదికను విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పాశం యాదగిరి, జయప్రకాష్‌ నారాయణ, నరసింహారెడ్డి, హనుమంతరావు

ఈనాడు - హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థి జి. కిషన్‌రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంతో పాటు నగరం, రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి కృషి చేశానన్నారు. మరోసారి ఓటేసి ఆదరించాలని కిషన్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.48,726 కోట్లు ఖర్చు చేశామన్నారు. వీటికి అదనంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, ముద్ర యోజన, సీఎం స్వనిధి, స్టాండప్‌ ఇండియా వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన దాదాపు 26 లక్షల మందికి లబ్ధిదారులకు అందించిన రుణాల విలువ రూ.38,013 కోట్లున్నాయన్నారు. గత ఐదేళ్లలో ఎంపీగా, కేంద్రమంత్రిగా తన నియోజకవర్గంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గురువారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని పింగలి వెంకట్‌ రామరెడ్డి కన్వెన్షన్‌లో ‘ప్రజలకు నివేదన’ పేరుతో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకరం అందకపోయినా.. ప్రధాని మోదీ, స్థానిక భాజపా నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు.

  • వైద్యం, ఆరోగ్య సంరక్షణకు రూ.3,876 కోట్లు, రహదారులు, రైల్వేలు, పౌరవిమానయాన రంగంలో మౌలిక సదుపాయాలకు రూ.42,833 కోట్లు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రూ. 40 కోట్లు, విద్య, నైపుణ్య శిక్షణకు రూ.1,268 కోట్లు, కాలనీలు, బస్తీల్లో క్రీడలు, ఫిట్‌నెస్‌ సెంటర్లకు రూ. 18 కోట్లు, సాంస్కృతికం, పర్యాటకానికి రూ.563 కోట్లు అందించామన్నారు. 
  • హైదరాబాద్‌కే తలమానికంగా మారనున్న రీజనల్‌ రింగు రోడ్డు నిర్మాణానికి కేంద్రం రూ.26 వేల కోట్లు కేటయించింది. ఉప్పల్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.627 కోట్లు, రూ.266 కోట్లతో అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఆరాంఘర్‌ చౌరస్తా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకూ 6 వరుసల రహదారి నిర్మాణం రూ.283 కోట్లతో చేపట్టామన్నారు. 
  • ఈఎస్‌ఐసీ మెడికల్‌ కళాశాల, ఆసుపత్రి నిర్మాణానికి రూ.1438 కోట్లు, ఈఎస్‌ఐసీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.663 కోట్లు, బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1366 కోట్లు, నగరంలోని 236 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు రూ.73 కోట్లు, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని హెల్దీ బేబీ షోతో పాటు 7వేల పోషణ కిట్స్‌ పంపిణీకి రూ.2.5 కోట్లు, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ)కి రూ.30 కోట్లు అందించామని వివరించారు.
  • ఐఐటీ హైదరాబాద్‌కు రూ.1089 కోట్లు, 3 కేంద్ర విశ్వవిద్యాలయాలకు రూ.105 కోట్లు, సీఎస్‌ఐఆర్‌ - ఐఐసీటీలో సెంటర్‌ ఫర్‌ ఎక్సెలెన్స్‌ కేంద్రం ఏర్పాటుకు రూ.10 కోట్లు, ఎన్‌ఐఈఎల్‌ఐటీ ఏర్పాటుకు రూ.5 కోట్లు అందించామన్నారు.

రూ.719 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. చర్లపల్లి, హైదరాబాద్‌, కాచిగూడ స్టేషన్ల అభివృద్ధికి రూ.955 కోట్లు, రైల్వే మ్యూజియం ఏర్పాటుకు రూ.40 కోట్లు ఇచ్చామన్నారు. ఎంఎంటీఎస్‌ రెండోదశను యాదాద్రి వరకు పొడిగించేందుకు రూ.600ల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

హెరిటేజ్‌ సర్క్యూట్‌ టూర్‌ అభివృద్ధికి రూ.97 కోట్లు, ట్యాంక్‌బండ్‌, గోల్కొండ కోట, ఓయూలో సౌండ్‌ అండ్‌ లైట్‌ షోకు రూ.57 కోట్లు, గోల్కొండ కోట అభివృద్ధికి రూ.16 కోట్లు, రామ్‌జీ గోండ్‌ ట్రైబల్‌ మ్యూజియం ఏర్పాటుకు రూ.25 కోట్లు, చార్మినార్‌ వెలుగులకు రూ.3 కోట్లు, సైన్సు మ్యూజియం ఏర్పాటుకు రూ. 233 కోట్లు కేటాయించామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని