logo

హత్య చేసి... పెట్రోల్‌ పోసి తగులబెట్టి...

అదే చోటు... రెండో హత్య. ఆపై ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిందితులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు మండలంలోని అటవీ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఊహించని సంఘటనలతో స్థానికులు తల్లడిల్లుతున్నారు.

Published : 07 Jul 2022 03:03 IST

పెద్దమ్మ అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం లభ్యం

గంభీరావుపేట, న్యూస్‌టుడే: అదే చోటు... రెండో హత్య. ఆపై ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిందితులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు మండలంలోని అటవీ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఊహించని సంఘటనలతో స్థానికులు తల్లడిల్లుతున్నారు. మరోవైపు ఈ కేసులను ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. పోలీసుల కథనం ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారులోని పెద్దమ్మ అటవీ ప్రాంతంలో సగం కాలిన మహిళ మృతదేహం బుధవారం లభ్యమైంది. గోరంట్యాలకు వెళ్లే రహదారి పక్కన చెట్లలో సగం కాలిన మహిళ మృతదేహాన్ని ప్రయాణికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎల్లారెడ్డిపేట సీఐ మొగిలి, గంభీరావుపేట ఎస్సై మహేష్‌లు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మంగళవారం రాత్రి మహిళను చంపి గోనె సంచిలో కుక్కి అటవీ ప్రాంతానికి తీసుకువచ్చి పెట్రోల్‌ పోసి దహనం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆమె వయస్సు దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌లను రంగంలోకి దింపి ఆధారాలను సేకరించారు. పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించారు. వాట్సప్‌, టిట్టర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టులు పెట్టారు. డీఎన్‌ఏ పరీక్షలకు పంపించామని ఎస్సై మహేష్‌ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని రెండు రోజుల పాటు మార్చురీలో ఉంచుతామని, ఎవరైన గుర్తించినా, అనుమానం వచ్చినా గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ చెప్పారు. కాగా ఇదే ప్రాంతంలో దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి మొండెం తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లారు. సుమారు ఆరు నెలలు పాటు శోధించిన పోలీసులు చివరకు ఈ మృతదేహం కామారెడ్డికి చెందిన వ్యక్తిదిగా గుర్తించి హంతకులను పట్టుకున్నారు. ప్రస్తుతం మహిళ మృతదేహాన్ని అదే ప్రాంతంలో పడేసి తగులబెట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరోమారు ఈ కేసు పోలీసులకు సవాల్‌గా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని