logo

అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

జిల్లాలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ, యువకులందరూ ఓటర్ల్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు.

Published : 28 Nov 2022 03:40 IST

ఓటరు నమోదుపై ఆరా తీస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ, యువకులందరూ ఓటర్ల్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి పేర్కొన్నారు. ఆదివారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని 8 పోలింగ్‌ బూత్‌లలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపెయిన్‌ కార్యక్రమాన్ని కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటరు నమోదుపై బూత్‌ స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26, 27 తేదీల్లో, తిరిగి డిసెంబర్‌ 3, 4 తేదీలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వారీగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించి నమోదు చేయాలన్నారు. 2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులతోపాటు దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌లను ఫారం-6 ద్వారా ఓటర్లగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లు వారి వివరాలను మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. బీఎల్‌వోలు ఇంటింటా సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు. చనిపోయిన వారి వివరాలను జాబితా నుంచి తొలగించాలన్నారు. ఫారం -7 దరఖాస్తులను పరిశీలించి సదరు ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా? లేదా? అనే అంశాలను క్షుణ్ణంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సదానందం, బూత్‌ లెవల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని