logo

గోదావరి పరీవాహకం.. తీర్పులో విభిన్నం

1952లో ఆవిర్భవించిన మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గంలో 12 సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగింది.

Published : 30 Oct 2023 05:21 IST

ముత్యంపేట చక్కెర కర్మాగారం

న్యూస్‌టుడే, కోరుట్ల: 1952లో ఆవిర్భవించిన మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గంలో 12 సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగింది. 2009లో మెట్‌పల్లి నియోజకవర్గం రద్దయి కోరుట్ల నియోజకవర్గంగా ఆవిర్భవించింది. 2009 నుంచి 2018 వరకు కోరుట్ల శాసనసభకు 3 పర్యాయాలు సాధారణ ఎన్నికలు, ఒక ఉప ఎన్నిక జరిగింది. నియోజకవర్గం భౌగోళికపరంగా గోదావరి పరివాహక ప్రాంతం. ఎస్సారెస్పీ ప్రాజెక్టు ప్రధాన కాలువ నియోజకవర్గంలోని నాలుగు మండలాల మీదుగా వెళ్తోంది. కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల, మెట్‌పల్లి రెండు రెవెన్యూ డివిజన్లు, పురపాలికలు ఉన్నాయి. కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో లక్ష ఎకరాల సాగు భూమి ఉండగా, 51 వేల ఎకరాలకు ఎస్సారెస్పీ ద్వారా సాగు నీరందుతోంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండలాల శివారు నుంచి గోదావరి నది ప్రవహిస్తుంది.

  •  మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి 1967(స్వతంత్ర), 1972(కాంగ్రెస్‌) అభ్యర్థిగా చెన్నమనేని సత్యనారాయణరావు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు.
  • 1978, 1983(కాంగ్రెస్‌)లో వర్తినేని వెంకటేశ్వరరావు రెండు పర్యాయాలు గెలుపొందారు.
  • 1985, 1989, 1994(భాజపా)లో చెన్నమనేని విద్యాసాగర్‌రావు వరుసగా మూడు పర్యాయాలు గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభలో భాజపా పక్ష నేతగా వ్యవహరించారు.
  • 2009, 2010(ఉపఎన్నిక), 2014, 2018లో కోరుట్ల నియోజకవర్గం నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు(తెరాస) వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పరిశ్రమ చుట్టూ రాజకీయాలు..  

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ముత్యంపేట చక్కెర కర్మాగారం 1981-82లో నెలకొల్పారు. దశబ్దకాలం తర్వాత పరిశ్రమ సామర్థ్యాన్ని 1250 మెట్రిక్‌ టన్నుల నుంచి 2500 మెట్రిక్‌ టన్నులకు పెంచేందుకు 1992-93లో యంత్రాల మరమ్మతు పనులను బిన్ని కంపెనీకి అప్పగించింది. తర్వాత క్రషింగ్‌ సామర్థ్యం పడిపోయి నష్టాలను మూటగట్టుకుంది. పరిశ్రమ పరిధిలో మొత్తం 70 వేల హెక్టార్లలో చెరకు పంట సాగు చేస్తుండేవారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం పరిశ్రమను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. 2009లో చక్కెర కర్మాగారం మూతపడింది. లేఆఫ్‌ కారణంగా 2015 డిసెంబరు 22న పరిశ్రమను మూసివేస్తున్నటు పరిశ్రమ ముందు నోటీస్‌ బోర్డుల్లో పేర్కొనడంతో రైతులు ఉపాధి కోల్పోగా, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. 2014, 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని హామీ నెరవేరలేదు. నియోజకవర్గంలో చక్కెర పరిశ్రమ చుట్టే రాజకీయం నెలకొంది. శాసనసభ ఎన్నికల్లో చక్కెర కర్మాగారం రాజకీయంగా కీలక అంశంగా మారనుంది.

చారిత్రక కట్టడాలు.. ఆలయాలు

కోరుట్ల పట్టణంలోని పురాతన గడి బురుజు

కోరుట్ల పట్టణంలో 11వ శతాబ్దంలో కట్టిన గడి బురుజులు, పురాతన కోనేరు ఉంది. పురాతన మహాదేవస్వామి దేవాలయం, వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. 1375-1400 కాలంలో వేములవాడ దేవాలయం నిర్మించిన చాళుక్య వంశస్తులు కోరుట్ల మండలంలోని సంగెం గ్రామంలో శ్రీసంఘమేశ్వర ఆలయాన్ని రాతితో నిర్మించారు. నాగులపేట శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు 200 మీటర్ల పొడవున అరుదైన సైఫన్‌ నిర్మించారు.

1929లో మెట్‌పల్లి పాతబస్టాండ్‌ వద్ద 14 ఎకరాల్లో గాంధీ ప్రధాన శిష్యుడు అన్నసాహేబ్‌ సహస్రబుద్దే ఖాదీని నిర్మించారు. 1934 వరకు మహారాష్ట్ర బ్రాంచి కింద 1951లో స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో కొనసాగింది. 1967లో మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్ఠాన్‌గా ఏర్పడి 1983 నుంచి ఖాదీ బోర్డు ఆధీనంలో పనిచేస్తుంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, స్వామి రామానందతీర్థ, జువ్వాడి చొక్కారావు, హన్మంత్‌రావు, కల్వకుంట్ల వెంకటరాజేశ్వర్‌రావు ఖాదీబోర్డ్‌ ఛైర్మన్లుగా పని చేశారు. ప్రస్తుతం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఖాదీ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఖాదీలో 600 మంది కార్మికులు, 50 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులను కరీంనగర్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, సిరిసిల్ల, హైదరాబాద్‌, బోధన్‌, కామారెడ్డిలోని ఖాదీ విక్రయ కేంద్రాలకు సరఫరా చేస్తారు. ఏడాదికి రూ.3 కోట్ల టర్నోవర్‌తో కొనసాగుతుంది.

  •  మెట్‌పల్లిలో 2వేల సంవత్సరాల కిందట నిర్మించిన చెన్నకేశ్వరస్వామి దేవాలయం, పురాతన కోనేరు ఉంది.
  • మల్లాపూర్‌ మండల కేంద్రంలోని శ్రీకనకసోమేశ్వర దేవాలయం సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తులో ఉంది. వాల్గొండ వద్ద పురాతన చరిత్ర త్రికూట ఆలయం రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది.  
  • ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామశివారులో మిషన్‌ భగీరథ వాటర్‌ గ్రీడ్‌ను 2017-18లో ఏర్పాటు చేశారు. దానిపైన 35 కి.మీ దూరంలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి డబ్బాకు ప్రత్యేక పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. పైపులైన్‌ ద్వారా వచ్చే నీటిని గ్రీడ్‌లో శుద్ధి చేసి అక్కడి నుంచి జిల్లాలోని 18 మండలాలకు, 5 పురపాలికల్లో ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. * జిల్లా సరిహద్దులోని గండిహనుమాన్‌ దేవాలయం ప్రత్యేకత చాటుకుటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని