logo

నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి

పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది

Published : 28 Mar 2024 05:34 IST

 స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో కనిపించని సాంకేతికత

పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి

మూసేసిన కంప్యాక్టర్‌ స్టేషన్‌

 న్యూస్‌టుడే, కరీంనగర్‌ కార్పొరేషన్‌: పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది. ప్రాజెక్టు అమలు చేయాల్సిన అధికారులు ఎవరికి వారు పట్టనట్లుగా ఉండటంతో వెచ్చించిన నిధులు నిరుపయోగంగా మారేలా కనిపిస్తోంది. కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పరిధిలో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రాధాన్యం కల్పించారు. చెత్త సేకరణ మొదలుకొని.. సేకరించిన చెత్తను తరలించడం వరకు పారిశుద్ధ్య పనులలో నూతన మార్పులు తీసుకొచ్చేలా ప్రతిపాదనలు చేసి నిధులు కేటాయించారు. దశల వారీగా టెండర్లు నిర్వహించిన స్మార్ట్‌సిటీ కన్సల్టెన్సీ, నగర పాలక అధికారులు అక్కడే ఆగిపోయారు. మరోవైపు ప్రతిరోజు టన్నుల కొద్ది వస్తున్న చెత్తను గుట్టలా పేర్చుకుంటూ వెళ్లడం తప్పా దానిని తగ్గించే ఆలోచన మాత్రం చేయడం లేదు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బయోమైనింగ్‌ రెండు అడుగులు వెనక్కి.. ఒక అడుగు ముందుకు అన్నట్లుగా మారింది.

 సమయం వృథా అని..

హౌసింగ్‌బోర్డుకాలనీలో ఉన్న రిసోర్స్‌ పార్కులో ఏర్పాటు చేసిన కంప్యాక్టర్‌ స్టేషన్‌ మూత పడింది. 12 టన్నుల సామర్థ్యంతో దీనిని నిర్మించారు. చెత్తను తగ్గించేందుకు రెండు భారీ వాహనాలు కొనుగోలు చేశారు. నగరంలోని చెత్తను తీసుకొచ్చి ఇందులో తగ్గిస్తారు. ఇందులో 180 టన్నుల చెత్తను 60 టన్నులకు తగ్గించి.. ఇక్కడి నుంచి డంపింగ్‌యార్డుకు తరలిస్తారు. నగరానికి డంపింగ్‌యార్డు దగ్గరగా ఉండటం, ఇక్కడ గంటల తరబడి వేచి ఉండటం సమయం వృథా అని నేరుగా చెత్తను యార్డుకే తరలిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసిన రెండు ట్రక్కులు మూలన పడ్డాయి. షెడ్డులోపల తాళం వేసి పెట్టగా ఒకరోజు కూడా వాటిని బయటకు తీయడం లేదు. పైగా వాటికి రిజిస్ట్రేషన్‌ కూడా కానట్లు సమాచారం.

భూగర్భంలోనే చెత్త కుండీలు

రద్దీ ప్రాంతాల్లో చెత్తా చెదారం రోడ్లపై కనిపించకుండా నగరంలోని పది చోట్ల భూగర్భ స్మార్ట్‌ బిన్స్‌ ఏర్పాటు చేశారు. పలు చోట్ల వీటిని బిగించగా మరికొన్ని ప్రాంతాల్లో ఆ పనులు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. సెన్సార్‌ విధానంలో జీపీఎస్‌ అమలు చేస్తారు. ఒక్కొక్క డబ్బాలో ఏ మేర చెత్త నిండిందనే విషయాన్ని ఎప్పటికప్పుడు శానిటేషన్‌ విభాగం అధికారికి, ఆ ప్రాంత డ్రైవర్‌కు చరవాణిలో సంక్షిప్త సమాచారం వస్తోంది.
ట్యాగులు.. జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఏవీ?
నగర పరిధిలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న 5,117 వాణిజ్య దుకాణాల నుంచి చెత్త సేకరణలో జాప్యం రాకుండా స్మార్ట్‌సిటీలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ డివైజ్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) బిగించారు. దుకాణాల ఎదుట నుంచి చెత్తను ఏ సమయంలో తీసుకెళ్తున్నారు.. ఎంత చెత్త వెళ్తుంది? చెత్త తీసుకెళ్లిన తర్వాత తెలిసేలా దీనిని కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేయనున్నారు. రీడర్స్‌ ఇవ్వకపోవడం, చెత్తను సేకరించే వాహనాల డ్రైవర్లకు స్కానింగ్‌ పరికరాల కొనుగోలులో జాప్యం చేస్తున్నారు. దాంతో ట్యాగ్స్‌ ఉన్నా వినియోగం లేకుండా పోతున్నాయి


నిధుల కేటాయింపులు ఇలా..

రూ.1.43 కోట్లతో షెడ్డుతో పాటు కంప్యాక్టర్‌ స్టేషన్‌ నిర్మాణం
రూ.1.63 కోట్లతో మాడ్రన్‌ స్మార్ట్‌బిన్స్‌ ఏర్పాటు పనులు
రూ.16.14 కోట్లతో బయోమైనింగ్‌ ద్వారా చెత్త శుద్ధీకరణ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని