logo

అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!

 ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు.

Published : 29 Mar 2024 05:20 IST

కాజీపేట-బల్లార్షా సెక్షన్‌ ప్రాధాన్యం పెంచితేనే మేలు
స్టేషన్లలో వసతులు, హాల్టింగులపై ద.మ.రై. నిర్లక్ష్యం
న్యూస్‌టుడే, పెద్దపల్లి

  • వైజాగ్‌ నుంచి కరీంనగర్‌కు కనెక్టివిటీ కోసం విశాఖ నుంచి శిరిడీ వెళ్లే సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట, కరీంనగర్‌ మీదుగా నడిపించాలని విశాఖ ఎంపీ ఒకరు గతంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులకు విన్నవించారు.
  • కేరళ ఎక్స్‌ప్రెస్‌కు ఆ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను ఇక్కడి అన్ని ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్‌ ఇవ్వాలని చాలా ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు.

 ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. స్టేషన్‌లో వసతులు, రైళ్ల హాల్టింగులకు అక్కడి ఆదాయం, ప్రయాణికుల సంఖ్య ప్రామాణికంగా తీసుకోవాలి. కాగా ఇవేవీ రైల్వే అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడూ గుడ్డి పోకడతోనే రైల్వే వ్యవస్థను నియంత్రిస్తున్నారు.

సాధారణ రోజుల్లోనూ అలా నడిపిస్తే..

ద.మ.రై. హోలీ ప్రత్యేక రైళ్లను కొన్నింటిని కాజీపేట, బల్లార్షా మీదుగా కోల్‌కతాకు నడిపిస్తుంది. సికింద్రాబాద్‌ నుంచి కోల్‌కతాకు పదికి పైగా రైళ్లున్నాయి. వీటిలో ఒక్కటి మాత్రం నడికుడి మార్గంలో విజయవాడ మీదుగా వెళ్తుండగా మిగిలిన రైళ్లన్నీ కాజీపేట, విజయవాడ మీదుగానే కోల్‌కతాకు నడిపిస్తున్నారు. తాజాగా హోలీ ప్రత్యేక రైళ్లను కాజీపేట, బల్లార్షా మీదుగా నడిపిస్తుండటంతో రెగ్యులర్‌ రైళ్లలోనూ కొన్నింటిని ఈ మార్గంలో నడిపించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లావాసులు ఒడిశాతో పాటు తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు చేరుకోవాలంటే కాజీపేటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కాజీపేట-బల్లార్ష్షా సెక్షన్‌లో ఒకటి రెండు రైళ్లను నడిపితే కోల్‌కతాకు కేవలం 40 కిలోమీటర్ల దూరం పెరిగినా పారిశ్రామిక ప్రాంతాలైన బల్లార్షా, గోండియా, దుర్గ్‌, రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌, ఝాన్సీగూడ, రూర్కెలా, టాటానగర్‌, ఖరగ్‌పూర్‌లకు ఉమ్మడి జిల్లా నుంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది.

కేరళను చూసి నేర్చుకోవాలి

దక్షిణాదిన చిన్న రాష్ట్రమైన కేరళలో తిరువనంతపురం నుంచి దిల్లీకి వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్‌ ఆ రాష్ట్రంలోని 14 స్టేషన్లలో ఆగుతుంది. వీటిలో 5 జిల్లాకేంద్రాలుండగా మిగిలినవి చిన్న స్టేషన్లు. విశాఖపట్నం నుంచి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు సైతం ఆంధ్రప్రదేశ్‌లో 7, తెలంగాణలో 5 హాల్టింగులున్నాయి. మన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 6 హాల్టింగులున్నాయి. జిల్లాకేంద్రాలైన భువనగిరి, జనగామ, పెద్దపల్లి పట్టణాల్లో మాత్రం హాల్టింగులు ఇవ్వలేదు. కానీ రైల్వే అధికారుల లాబీయింగ్‌తో పక్కపక్కనే రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లిలకు మూడు హాల్టింగులిచ్చారు. వీటితో పాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల నుంచి దిల్లీ వైపు వెళ్లే సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు మన రాష్ట్రంలోనే హాల్టింగులు సాధించడంలో ప్రజాప్రతినిధులు తరచూ విఫలమవుతున్నారు. ఇక తమిళనాడు నుంచి వచ్చే రైళ్లకు హాల్టింగ్‌ కల్పించేందుకు కనీస చర్యలు కూడా ఉండటం లేదు. ఇటీవల దక్షిణ రైల్వే ప్రవేశపెట్టిన రామేశ్వరం, కాశీ తమిళ సంఘం ఎక్స్‌ప్రెస్‌కు వరంగల్‌, బల్లార్షా మధ్య ఒక్క హాల్టింగ్‌ కూడా సాధించలేకపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని