logo

అవగాహన లేక.. అందని ఉచిత కరెంటు

దళిత, గిరిజన కుటుంబాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. వీటిలో భాగంగా తమ నివాసాల్లో వినియోగించే విద్యుత్తుపైనా రాయితీ అందిస్తోంది.

Published : 12 May 2022 01:54 IST

ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే

దళిత, గిరిజన కుటుంబాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. వీటిలో భాగంగా తమ నివాసాల్లో వినియోగించే విద్యుత్తుపైనా రాయితీ అందిస్తోంది. ఇందుకోసం అర్హులైన ప్రతి ఒక్కరూ తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని సదరు విద్యుత్తు శాఖ అధికారికి సమర్పించాల్సి ఉంది. కానీ ఏళ్లు గడుస్తున్నా నూరు శాతం వినియోగదారులు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించలేకపోయారు. అవగాహన లేక అనేక మంది అర్హులు ప్రభుత్వం అందిస్తున్న రాయితీని కోల్పోతున్నారు. అవగాహన కల్పించడంలోనూ విద్యుత్తు సిబ్బంది విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎస్సీ, ఎస్టీల గృహాలకు 101 యూనిట్ల లోపు..

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్తు సరఫరాను అందిస్తోంది. అలాగే దళిత, గిరిజన కుటుంబాల గృహాల్లో నెలకు 50 యూనిట్లలోపు వినియోగించే వారికి రాయితీని అందిస్తున్నారు. దీనిని సమీక్షించిన ప్రభుత్వం 2018 ఆగస్టు 24న 101 యూనిట్లకు ఈ ఉచిత పథకాన్ని పెంచింది. అంటే 101 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తే పూర్తిగా ఉచితం. కానీ 102 యూనిట్లు వాడుకుంటే మాత్రం పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అనేక పేద కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ధ్రువీకరణలు ఇవ్వక..

జిల్లాలో ప్రస్తుతం 62,661 మంది ఎస్సీ, 39,069మంది ఎస్టీ మొత్తంగా 1,01,730 గృహ విద్యుత్తు వినియోగదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 42,550 మంది ఎస్సీలు, 25,058 మంది ఎస్టీలు మొత్తంగా 67,608(66.45%) మంది తమ ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. పథకం ప్రారంభమై నాలుగేళ్లు పూర్తవుతున్నా ఇంకా 20,111 మంది ఎస్సీలు, 14,011 మంది ఎస్టీలు మొత్తంగా 34,122(33.54%) మంది తమ ధ్రువీకరణ పత్రాలు నేటికీ అధికారులకు సమర్పించలేదు.

ప్రచార లోపం

సాధారణంగా పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. విద్యుత్తు రాయితీలపై ప్రజలకు సరైన అవగాహన కార్యక్రమాలు జరగడంలేదని తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌ కార్యాలయాల్లో, అధికారిక సభల్లో రాయితీపై విద్యుత్తు అధికారులు ప్రచారం చేస్తే ప్రజలకు అవగాహన కలుగుతుంది. ధ్రువీకరణ పత్రాల ఆలస్యంపై సంస్థ సీఎండీ సైతం జిల్లా కలెక్టర్లకు ఇటీవలే సహకరించాలంటూ ఉత్తరాలు రాశారు. జిల్లా అధికారులు ఏ స్థాయిలో స్పందిస్తారో వేచి చూడాలి.

* ఈ పథకం వర్తించాలంటే గృహ వినియోగదారులు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని సర్వీసుకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. తమ ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక ఏఈలకు అందించి ఈ ఉచితాన్ని పొందవచ్ఛు ఉద్యోగులు, రూ.కోట్ల ఆదాయం ఉన్నా అర్హులే.

ధ్రువీకరణ ఇవ్వాల్సినవారు

* సత్తుపల్లి డివిజను: 13,582(48.92%)

* ఖమ్మం టౌన్‌: 9,820(33.45%)

* ఖమ్మంగ్రామీణం: 6,162(24.63%)

* వైరా డివిజను: 4,558 (23.24%)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని