logo

భావోద్వేగాలతోనే బలవన్మరణం

వసతి గృహంలో ఉండటం ఇష్టం లేదంటూ ఇటీవల అర్ధరాత్రి సమయంలో పాల్వంచ పట్టణంలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థిని చెప్పాపెట్టకుండా సికింద్రాబాద్‌ వెళ్లిపోయింది.

Published : 13 Mar 2023 02:05 IST

తల్లిదండ్రులూ.. విద్యార్థుల ఆసక్తి గుర్తించడం మేలు
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే

వసతి గృహంలో ఉండటం ఇష్టం లేదంటూ ఇటీవల అర్ధరాత్రి సమయంలో పాల్వంచ పట్టణంలోని ఓ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థిని చెప్పాపెట్టకుండా సికింద్రాబాద్‌ వెళ్లిపోయింది. ‘నేను హాస్టల్‌లో ఉండేందుకు కారణమైన మా అమ్మంటే ఇష్టం లేదని’ లేఖలో పేర్కొనడం గమనార్హం.

చదువంటే ఎప్పుడూ భయపడే ములకలపల్లి మండలానికి చెందిన గిరిజన ఆశ్రమ పాఠశాల పదోతరగతి విద్యార్థిని.. సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆందోళన చెందేది. తిరిగి వెళ్లేందుకు ఏదో కారణం చెబుతుండేది. చివరకు ఓ రోజు ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందుతాగి బలవన్మరణానికి పాల్పడింది.

చదువుపై ఏకాగ్రత చూపాలని తల్లిదండ్రులు మందలించడంతో కారేపల్లి మండలానికి చెందిన ఓ ఇంటర్మీడియట్‌ విద్యార్థిని  ఇటీవల ఉరేసుకుంది.  

నేటితరం విద్యార్థులు కొందరు చదువును ఇష్టంగా కాకుండా కష్టంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. మరికొందరు కన్నవాళ్లకు దూరంగా హాస్టళ్లలో ఉండలేక మనస్తాపం చెందుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో వారిలోని భయాలు, ఆందోళనలు పారదోలడం ముఖ్యం. ఒత్తిడితో కాకుండా, సానుకూల ధోరణిలో విద్యనభ్యసించేలా అవగాహన కల్పించడం కీలకం. పిల్లల భావోద్వేగాలను గుర్తించి, తదనుగుణంగా మసలుకోవడం మేలన్నది నిపుణుల సూచన. లేదంటే వారు మానసిక కుంగుబాటుకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. ఇదే కారణంతో ఇటీవల ఉభయ జిల్లాల్లో ముగ్గురు విద్యార్థులు వరుసగా బలవన్మరణాలకు పాల్పడటాన్ని గుర్తుచేస్తున్నారు. ఇలాంటి సంఘటనలకు దారితీసే కారణాలపై తల్లిదండ్రులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు లోతుగా విశ్లేషించుకోవాల్సిన సందర్భమిది. ప్రస్తుత వార్షిక పరీక్షలు, ఆ తర్వాత ప్రవేశాల హడావుడి నేపథ్యంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. విద్యార్థులు భావోద్వేగాలను స్వీయ నియంత్రణ చేసుకోగలిగేలా దిశానిర్దేశం చేయడం తల్లిదండ్రుల బాధ్యతగా మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం, చెడు స్నేహాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తపడాలని పేర్కొంటున్నారు.


సమయం కేటాయిస్తే సమస్యలు తీరతాయ్‌

తల్లిదండ్రులు పిల్లలతో అనునయంగా మాట్లాడాలి. వారు చెప్పేదంతా ఓపికతో వినాలి. సమస్యలుంటే పరిష్కరిస్తామని, మేమున్నామనే ధైర్యం కలిగించాలి. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు కాకుండా ఇది తరచూ జరగాలి. చదువులకు తోడు బయటి స్నేహాలతో వారు ఒత్తిడికి గురవడం సహజం. అందుకే బాల్యాన్ని ‘ఒత్తిడి వయసు’గా నిపుణులు సూచిస్తారు. తరగతులకు వెళ్లకపోవడం, పాఠాలు అర్థం కాకపోవడం వంటి కారణాలతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారు తమ లోపాల్ని అధిగమించే క్రమంలో ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌, కన్నవాళ్ల సహకారం చాలా అవసరం. ఈ పరిస్థితుల్లో తలెత్తే లోపాలే పిల్లలు అఘాయిత్యాలకు పాల్పడేందుకు కారణమవుతున్నాయి. విద్యార్థులు సమస్యల్ని సవాల్‌గా తీసుకున్నప్పుడే విజయం వరిస్తుంది. చదువు, పరీక్షలు, విద్యాలయాల్లో పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూసేలా ప్రోత్సహించాలి. తల్లిదండ్రులే మంచి సలహాదారుగా, మార్గదర్శిగా, స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సున్నిత విమర్శకులుగా, వినోద-విజ్ఞాన వారధులుగా, సేవకుల్లా మెలగాలి.

డా. జి. వీరభద్రం, సైకాలజిస్టు


బాధలు పంచుకుని.. భరోసా కల్పించాలి
- సులోచనారాణి, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో నేటితరం గత కుటుంబ వ్యవస్థలు, ఆచార వ్యవహారాలకు భిన్నమైన ధోరణుల్లో ముందుకు సాగుతోంది. బంధాలు, బంధుత్వాలతో కూడిన విలువలకు ఒక్కో అడుగూ దూరమవుతోంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులే వారిని అర్థం చేసుకోవాలి. నిరంతరం ప్రవర్తనల్లో మార్పు గమనించాలి. చదువు, అలవాట్లలో ఇతరులతో పోల్చవద్దు. బాధ్యతలను నిరంతరం తెలియజెప్పాలి. క్రమశిక్షణ నేర్పించాలి. వారి ఆలోచనలకు తగ్గట్టు  మెలగాలి. అర్థంలేని లక్ష్యాలు బాల్యంపై రుద్దవద్దు. ఇంట్లో సానుకూల వాతావరణం కల్పించాలి. ఏది తప్పు? ఏది ఒప్పో గ్రహించగలిగేలా తెలియజెప్పాలి. చదువుకునే వయసులో అధిక సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. వారి నడవడిక తీర్చిదిద్దాల్సింది కన్నవాళ్లే. ఓ ప్రణాళిక ప్రకారం తమ పని తాము చేసుకొని పోయే అలవాట్లు పెంపొందించాలి. కోపం, అసూయ తదితర భావోద్వేగాల పర్యవసనాలు, వాటి నియంత్రణతో కలిగే లాభాలను సవివరంగా తెలపాలి. స్మార్ట్‌ఫోన్‌ వలలో చిక్కకుండా జాగ్రత్తపడాలి. విద్యాలయాల్లో ఎదురయ్యే సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. మేమున్నామనే భరోసా కల్పించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని