logo

ఆ విజయం వెనక..

ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించి కార్పొరేట్‌ కొలువుల్లో పనిచేస్తూ చాలామంది ఆ ఉద్యోగాల్ని వదులుకుని సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు.. కానీ ఈ యువతి చదువు విషయంలో ఆదిలోనే లక్ష్య నిర్దేశన చేసుకుంది.

Updated : 17 Apr 2024 06:11 IST

సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 938వ ర్యాంకు సాధించిన యువతి

తల్లిదండ్రులతో సాయి అలేఖ్య

మధిర పట్టణం, బోనకల్లు, న్యూస్‌టుడే: ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించి కార్పొరేట్‌ కొలువుల్లో పనిచేస్తూ చాలామంది ఆ ఉద్యోగాల్ని వదులుకుని సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు.. కానీ ఈ యువతి చదువు విషయంలో ఆదిలోనే లక్ష్య నిర్దేశన చేసుకుంది. చదివిన విద్య, సాధించే కొలువు ప్రజా జీవితాలకు మేలు చేసేలా ఉండాలన్నది తన ఉద్దేశం. ప్రజా సంబంధాలే తాను చేసే కొలువు పరమావధి కావాలన్నది ఆలోచన. స్వాతంత్య్ర సమరయోధుడైన తాతయ్యను స్ఫూర్తిగా తీసుకుని, అనుకున్నది సాధించే క్రమంలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా ఓపిగ్గా అడుగులు వేశారు. యూపీఎస్సీ మంగళవారం ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో బోనకల్లు మండలం ఎల్‌.గోవిందాపురానికి చెందిన రావూరి సాయి అలేఖ్య 938 ర్యాంకు సాధించారు.

రావూరి ప్రకాష్‌రావు, పద్మశ్రీల ఏకైక సంతానం సాయి అలేఖ్య. తండ్రి మధిర పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అలేఖ్య ఖమ్మంలోని త్రివేణి పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది. ఇంటర్‌ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో, డిగ్రీ హైదరాబాద్‌ శ్రీచైతన్య కళాశాలలో పూర్తి చేసింది. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఏ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసింది. ఇందులో బంగారు పతకం సాధించింది. అనంతరం హైదరాబాద్‌లోని సీఎస్‌బీలో ఐఏఎస్‌ కోచింగ్‌ తీసుకుని మూడుసార్లు ప్రిలిమినరీ దశలోనే విఫలమైంది. నాలుగో పర్యాయం మెయిన్స్‌లో నిరాశ ఎదురైంది. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఐదో పర్యాయం 938వ ర్యాంకు సాధించారు.

ఐఏఎస్‌ సాధనే లక్ష్యం..: అలేఖ్య

ప్రస్తుత ర్యాంకుతో ఐపీఎస్‌ వస్తుందని భావిస్తున్నా. కానీ ఐఏఎస్‌ ద్వారా ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఈ దిశగా మరోమారు ప్రయత్నిస్తా. తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం అందించారు. తాతయ్య రావూరి వెంకటరామయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. పేదల పక్షాన పనిచేసిన ఆయన పోరాట స్ఫూర్తి నన్ను చిన్నతనం నుంచి వెన్నుతట్టి ప్రోత్సహించింది. ప్రజాసేవ చేసేందుకు నన్ను ఉన్నత స్థానంలో చూడాలని తపించేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని