logo

YS Jagan: జనాలకు జగన్‌ ఏప్రిల్‌ ఫూల్‌

‘‘జగన్‌ ఏలుబడిలో ఏప్రిల్‌ ఫస్టు ఒక్కటే కాదు.. ‘ఆల్‌ ఫూల్స్‌ డే’.. వైకాపా జమానాలో ‘అక్షరాలా’ అనునిత్యం అమలవుతోంది. ఏప్రిల్‌ మొదటి తారీఖున నమ్మిన నలుగురిని ఫూల్‌ చేసి గొప్పగా ఫీలవుతారు పిల్లలు.. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ ఐదేళ్ల పాటు నిత్యం ప్రజలను పిచ్చోళ్లను చేస్తూనే ఉన్నారు.

Updated : 01 Apr 2024 08:13 IST

మాటలతో ముగిసిన మూడు రోజుల పర్యటన
పెండింగ్‌ ప్రాజెక్టులపై నోరెత్తని ముఖ్యమంత్రి
న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

‘‘జగన్‌ ఏలుబడిలో ఏప్రిల్‌ ఫస్టు ఒక్కటే కాదు.. ‘ఆల్‌ ఫూల్స్‌ డే’.. వైకాపా జమానాలో ‘అక్షరాలా’ అనునిత్యం అమలవుతోంది. ఏప్రిల్‌ మొదటి తారీఖున నమ్మిన నలుగురిని ఫూల్‌ చేసి గొప్పగా ఫీలవుతారు పిల్లలు.. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ ఐదేళ్ల పాటు నిత్యం ప్రజలను పిచ్చోళ్లను చేస్తూనే ఉన్నారు. రాజకీయమంటే ‘పిల్లలాట’ అని అర్థం చేసుకున్నట్లున్నారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము చేసిన హామీల్లో 99 శాతం నెరవేర్చేశామని చెప్పుకొచ్చారు. తొంభై తొమ్మిది శాతమంటే ఎంతో ఆయనకు ఏ ‘ఇస్కూల్లో’ నేర్పించారో మనకు తెలియదుగానీ.. చేసింది చూస్తే మాత్రం ఆయన మాటలు కోటలు దాటుతున్నాయని అర్థమవుతోంది. జనానికి ఆయన చేసిన ‘సాయం తక్కువ.. మాయ ఎక్కువ’ అన్నది సారాంశం. ఘోరమేమిటంటే ప్రజా సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి.. నవరత్నాల ముసుగు వేసి బటన్‌ నొక్కి బాదేశారు. ఐదేళ్లుగా అన్నివర్గాలను ఇబ్బంది పెడుతూ.. ఎన్నికల ముందు మూడు రోజులు ప్రచార యాత్రలో తిరిగి జగన్‌ ఏ‘మార్చి’ వెళ్లారు..  జనాలను ఏప్రిల్‌ ఫూల్‌ చేశారు!

ధనవంతుడి నోట పేద పలుకులు

తాను ఎన్ని అబద్ధాలు చెప్పినా జనం నమ్మేస్తారన్న భ్రమలో ఉన్న జగన్‌... పశ్చిమాన పచ్చి అబద్ధాలు ఆడారు.. తమ పార్టీ అభ్యర్థులు పేదలంటూ ప్రచార సభలో పేర్కొనడంతో జనం ముక్కున వేలేసుకున్నారు. వారంతా రూ.కోట్ల ధనికులు.. తమకు అడ్డొచ్చే వారిని భయభ్రాంతులకు గురిచేస్తారు.. అలాంటివారు పేదవారట.. పైగా మంచివాళ్లు, సౌమ్యులూనట. అందరి చెవిలో జగన్‌ పువ్వులు పెడుతున్నారంటూ జనాలు వ్యాఖ్యానించడం గమనార్హం. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ పదేపదే చెప్పుకొంటూ వారిని నిండా ముంచారు. ‘గాలి’ బలహీనంగా ఉందంటూ బీసీలైన ఓ మంత్రి, ఓ ఎంపీకి టికెట్‌ ఇవ్వలేదు. ఇద్దరు ఎస్సీలు, ఓ మైనార్టీ ఎమ్మెల్యేలను పక్కనపెట్టారు.. తన సామాజిక వర్గానికి చెందిన ఒక్కరినీ మార్చలేదు.. ఇదేనా సామాజిక న్యాయమంటూ ప్రశ్నిస్తున్నారు.

కాలు కదపలేదు.. హామీ ఇవ్వలేదు

‘మేమంతా సిద్ధం’ పేరిట జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత మూడు రోజులుగా 14 పల్లెల మీదుగా 46 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించారు. నంద్యాల, ఎమ్మిగనూరులో బహిరంగ సభ పెట్టారు. బస్సులు మళ్లించారు.. బీరు సీసాలిచ్చారు.. బిర్యానీ తినిపించారు.. డబ్బులు పంచారు.. దండిగా జనాలంటూ ‘గ్రాఫిక్స్‌’ చేశారు. ప్రచార సభలో జగన్‌ పాత కథ వినలేక జనం మధ్యలోనే వెళ్లిపోయారు. 2019 ఎన్నికల ముందు ఉమ్మడి జిల్లాలో 18 రోజులపాటు 260 కి.మీ. పాదయాత్ర చేశారు. ఇప్పుడేమో కాలు కదపకుండా.. ఏసీ బస్సులో కూర్చొని పల్లెల మీదుగా బస్సు యాత్ర కొనసాగించారు. బస్సుపై నుంచే చేతులు ఊపుతూ ముందుకెళ్లారు. బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్రగా మారింది. ఎక్కడా ఒక్క హామీ ఇవ్వలేదని, గెలిస్తే ఏం చేస్తామో జగన్‌రెడ్డి చెప్పడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

పరదాల మధ్య భజన

జగన్‌ బస్సు యాత్ర చేపడుతున్నారు. ప్రముఖులతో ముఖాముఖి ఉంటుంది. ‘సలహా’లు స్వీకరిస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టారు. ఏసీ బస్సులో వచ్చారు.. ఐప్యాక్‌, వైకాపా నేతలు ముందస్తుగా సిద్ధం చేసిన భ‘జన’ పరులను కూర్చోబెట్టారు. శిరివెళ్ల, తుగ్గలిలో భజన బృందంతో జగన్నాటకాన్ని రక్తికట్టించారు. తుగ్గలిలో కొందరు స్థానికులు సంధించిన ప్రశ్నలతో జగన్‌కు దిమ్మతిరిగింది. ప్రజలతో ముఖాముఖి అని చెప్పి చుట్టూ పరదాలతోనే కార్యక్రమాన్ని నిర్వహించారు. టోకెన్‌ ఉంటే తప్ప అనుమతి ఇవ్వలేదు.

ఏకరవు పెట్టినా వినిపించుకోలే

ముఖ్యమంత్రి హోదాలో బందో‘మస్తు’ నడుమ వచ్చారు.. పరదాల్లో వెళ్లి తనదైన శైలిలో చేతులూపి పథకాల బాకా ఊది వెళ్లిపోయేవారు. ‘రాజు’గారు వస్తున్నారంటే భజన యంత్రాంగం పచ్చని చెట్లపై గొడ్డలి వేటు వేసేది.. భద్రత పేరుతో ఆయా ప్రాంతాలను అష్ట దిగ్బంధనం చేసేది. జగన్‌కో దండం.. వచ్చారంటే గండం అంటూ జనం నరకం అనుభవించారు. ప్రచార యాత్రకు బస్సులో వచ్చిన ఆయనకు జనం ఏ‘కరవు’ పెట్టినా వినిపించుకోవడానికి ‘సిద్ధం’గా లేరు. జొన్నగిరి శివారులోని బీసీ కాలనీ వద్దకు సీఎం బస్సు రాగానే.. పెద్ద ఎత్తున కాలనీవాసులు అక్కడికి చేరుకున్నారు. ‘తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం... మా సమస్యను పరిష్కరించండి’, ‘జొన్నగిరి చెరువును నింపండి’ అని నినదించారు. నీటి సమస్యను ముఖ్యమంత్రికి చెప్పేందుకు కొత్తూరు గ్రామస్థులు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. రెండు చోట్లా తలూపారు తప్ప సరైన సమాధానం చెప్పలేదు.

అన్నీ అబద్ధాలే

నగర శివారు జగన్నాథగట్టుపై జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి మార్చి 14న ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. రెండు వారాల్లోనే ఆయన మాట మార్చేశారు. గత నెల 28న నంద్యాల జిల్లాలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో మాట్లాడుతూ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసినట్లు పేర్కొనడం గమనార్హం.. రైతు మొదలు, మహిళలు, యువత, ఇలా ప్రతి ఒక్కరినీ మాయమాటలతో ప్రచార సభలో హోరెత్తించారు. నవరత్నాల్లో భాగంగా ఇళ్లు కాదు.. ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తున్నామని జగన్‌ గొప్పలు చెప్పారు. ఇప్పటివరకు కేవలం 7-8 వేల ఇళ్లు నిర్మించలేదు.

ఐదేళ్లు బాదేశారు

జగన్‌ ఏలుబడిలో ఆయన అనుచరులు షడ్రసోపేతమైన ధనవిందు భోజనాలు చేసుకున్నారు. ప్రజా ఆస్తులను నంజుకుతిన్నారు. ఇది ఒక రంగంలోనే కాదు. ఏ రంగంలో పడితే ఆ రంగంలో ‘బడితె’ పట్టుకున్న వీరంగం పెరిగిపోయింది. వాళ్లు ఆస్తులు పెంచుకున్నారు.. ప్రజలపై బాదుడు విధించారు. పట్టణాల్లో ఏటా పదిశాతం ఆస్తి పన్ను పెంచారు.ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారు. భూముల విలువ పెంచుతూ రూ.150 కోట్ల భారం వేశారు.


గతేడాది సెప్టెంబరు 19న కృష్ణగిరి మండలం ఆలంకొండ పంప్‌హౌస్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి నీటి విడుదల సందర్భంగా  చెప్పిన మాటలన్నీ ‘నీటి’ మూటలయ్యాయి. ఆరు నెలల పాటు హంద్రీనీవా కాల్వలో నీటి ప్రవాహం కొనసాగింది. అయినా ఒక్క చెరువులోకీ నీరు చేరలేదు. పనులు పూర్తి చేయకుండానే ప్రచారం కోసం బటన్‌ నొక్కారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని