logo

జగన్‌ మామయ్య దీవెనా.. అంతా మాయ

విద్యార్థులకు ఆర్థిక సాయం, చదువుకు తోడ్పాడు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఖాళీ చేతులే చూపుతోంది. విద్యాభ్యాసానికి ఆటంకంగా మారింది. జగన్‌ చెప్పిన మాటలు నమ్మి ఉన్నత చదువులు చదువుదామని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది.

Published : 18 Apr 2024 03:00 IST

సాయం అందక అయోమయం
విద్యార్థులకు రిక్తహస్తం

విద్యార్థులకు ఆర్థిక సాయం, చదువుకు తోడ్పాడు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ఖాళీ చేతులే చూపుతోంది. విద్యాభ్యాసానికి ఆటంకంగా మారింది. జగన్‌ చెప్పిన మాటలు నమ్మి ఉన్నత చదువులు చదువుదామని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. చదువు మధ్యలో మానేయలేక.. చదివేందుకు ఆర్థిక భారం మోయలేక.. ఇబ్బందులు పడుతున్నారు. విద్యా దీవెన అందక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వారి ఆవేదన ఇది.

సొంతంగా ఫీజు చెల్లిస్తున్నాం

- వివేకానంద, ఎమ్‌ఎల్‌టీ విద్యార్థి, వెల్దుర్తి

వెల్దుర్తి, న్యూస్‌టుడే: కర్నూలులోని ప్రైవేటు కళాశాలలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌ కోర్సు చేస్తున్నా. ఇందుకోసం ఏడాది రూ.25వేల మేర ఫీజులు చెల్లిస్తున్నాం. విద్యాదీవెన వస్తుందని ఎంతో నమ్మకం ఉండేది. కానీ అందలేదు. దీంతో నాతో పాటు, నా సోదరి కళాశాల ఫీజు సైతం సొంతంగా చెల్లిస్తున్నాం. విద్యాదీవెన రాకపోవడంతో ఏటా ఇద్దరం రూ.50వేల మేర ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో చదువుకోవడం ఆర్థిక భారం అవుతోంది.


మూడేళ్లకు రూ.10 వేలే

- మనోహర్‌, ఆలూరు

ఆలూరు, న్యూస్‌టుడే: మాది దేవనకొండ మండలం భైరవ కుంట. ఆలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తిచేశా. కళాశాలలో చదివే విద్యార్థులకు వైకాపా ప్రభుత్వం విద్యా దీవెన కింద ఏటా రూ.20 వేలు అందిస్తామని చెప్పింది. ఈ మూడేళ్లలో కేవలం రూ.10 వేలే అందింది. ఈ ఏడాది ఒక్క రూపాయి అందలేదు. దీంతో తల్లిదండ్రులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఆలూరులోనే ఉంటూ ఖాళీ సమయంలో పని చేసుకుంటూ చదువుకోవాల్సి వచ్చింది.


మీట నొక్కినా..

- మక్తూంబాషా, డిగ్రీ విద్యార్థి, పత్తికొండ

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తవుతున్నా.. విద్యా దీవెన డబ్బులు ఇంత వరకు ఖాతాలో జమ కాలేదు. ప్రస్తుతం మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించాలని కళాశాల అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. డబ్బులేమో రాలేదు. మొదటి సంవత్సరం కళాశాల, పరీక్ష ఫీజులు మొత్తం కలిపి రూ.8వేలకు పైగా చెల్లించాలని చెబుతున్నారు. లేదంటే పరీక్షలు రాసేందుకు అనుమతించమని కళాశాల అధ్యాపకులు, సిబ్బంది చెబుతున్నారు.


కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది

- బి.రుద్రప్ప, చిరుద్యోగి, ఆదోని పట్టణం

నా కుమారుడు వినయ్‌కుమార్‌ బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. విద్యాదీవెన గత ఏడాదిగా మా ఖాతాలో జమ కాలేదు. మరోవైపు కళాశాల నిర్వాహకులు మాత్రం కళాశాల ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. కళాశాలకు రూ.36,500 ఫీజు చెల్లించాల్సి ఉంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం మాది. కళాశాలకు ఫీజులు చెల్లిస్తేనే నా కుమారుడి సర్టిపికెట్లు మొత్తం అందుతాయి. ప్రభుత్వం బకాయి ఉన్న విద్యాదీవెన ఖాతాలో జమ చేస్తే మేలు.


ఇంత వరకు అందలేదు..

- గాదిలింగ, హొళగుంద

హొళగుంద, న్యూస్‌టుడే: వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. మా నాన్న గారి పేరు మీద 1.50 ఎకరా స్థలం ఉంది. మధ్యతరగతి కుటుంబం. నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు బీరప్పను సత్యసాయి జిల్లాలో పాలిటెక్నిక్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరం ఫీˆజు రూ.35వేలు చెల్లించా. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమకాలేదు. సచివాలయంలో విచారణ చేయగా.. వస్తుందని చెబుతున్నారు. ప్రతి నెలా మెస్‌ ఫీజు రూ.4వేలు అదనపు భారంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని