logo

ఎన్నికల భేరి.. ప్రచార వే‘ఢీ’

రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి రాజకీయం మరింత వే‘ఢీ’రాజుకోనుంది.. ఈ నెల 18  నుంచి ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు.

Updated : 18 Apr 2024 05:13 IST

నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఈనాడు, నంద్యాల : రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి రాజకీయం మరింత వే‘ఢీ’రాజుకోనుంది.. ఈ నెల 18  నుంచి ఈనెల 25 వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా రిటర్నింగ్‌ అధికారులు ప్రకటన విడుదల చేసిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు వరకు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ, మే 13న పోలింగ్‌ జరగనుంది. 24 రోజుల పాటు ప్రచారం హోరెత్తనుంది. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థులు ఇప్పటికే పల్లెబాట పట్టారు. నామపత్రాల దాఖలు రోజున పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకొన్నారు. కొందరు అభ్యర్థులు మొదటి సెట్‌ నామపత్రాలను లాంఛనంగా సమర్పించి... రెండో సెట్‌ పత్రాలను భారీ ర్యాలీతో వెళ్లి దాఖలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకొంటున్నారు.

  • నంద్యాల పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు జిల్లా కేంద్రంలో నామపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. డోన్‌, ఆళ్లగడ్డ, బనగానపల్లి, నందికొట్కూరు పట్టణాల్లోని రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు తమ నామపత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీశైలం నియోజకవర్గ రిటర్నింగ్‌ కార్యాలయాన్ని ఆత్మకూరులో ఏర్పాటుచేశారు.
  • కర్నూలు ఎంపీ అభ్యర్థులు తమ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి అయిన కలెక్టర్‌కు అందించాలి. కర్నూలు, కోడుమూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కర్నూలులోని రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లోనూ, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరులో ఏర్పాటుచేసిన ఆర్వో కార్యాలయాల్లోని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు నామపత్రాలు అందించాల్సి ఉంటుంది.


రాశి కలవాలి.. విజయం చేకూరాలి

మహానంది, న్యూస్‌టుడే: అభ్యర్థులు తమ జన్మ, నామ నక్షత్రాలు, రాశి, వాసి చూసుకొని నామపత్రాల దాఖలుకు ముహూర్తం చూసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే పురోహితులు, పండితులు, ఆస్ట్రాలజీ, జ్యోతిష్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ఏ రోజైనప్పటికీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు ‘అభిజిత్‌ లగ్నం’ అందరికీ మేలు, విజయం చేకూర్చుతుందని పండితులు చెబుతున్నారు.

  • ఈనెల 18న దశమి తిథి, మఖ నక్షత్రం కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 19న ఏకాదశి తిథి, మకా నక్షతం కొందరికి సెంటిమెంట్‌గా కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. 25న విదియ, విశాఖ నక్షత్రం అనుకూలం. ఈ నక్షత్రంతో కూడిన పేర్లు ఉన్న అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి వీలుంది.
  • ఈనెల 22న చతుర్దశి. తిథి బాగా లేకపోయినప్పటికీ రోజు మంచిది కావడంతో ఈరోజు చాలామంది నామినేషన్లు వేసేందుకు సుముఖత చూపొచ్చు. ఈనెల 23న మంగళవారం, పౌర్ణమి, 24న పాడ్యమి.. కొందరు సెంటిమెంట్‌ను పాటిస్తారు. ఈరోజుల్లో నామినేషన్లు వేయడం సాధ్యమైనంత వరకు ఉండదు. పాడ్యమి కంటే విదియ, తదియ తిథులు మరింత విజయాలకు అనువుగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

నేర చరిత్ర చెప్పాల్సిందే

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తమ నేరచరిత్ర, కేసుల వివరాలు వెల్లడించే సమయం ఆసన్నమైంది. ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థి బి.ఫామ్‌ అందించకపోతే స్వతంత్రులుగా గుర్తింపు పొందుతారు. నామపత్రాలు దాఖలు చేసే అభ్యర్థులు అఫిడవిట్‌కు సంబంధించి ఫామ్‌-26 విద్యార్హతలు, నిర్వర్తించే బాధ్యతలు, ఆస్తుల వివరాలతోపాటు క్రిమినల్‌ కేసుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు సదరు వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. తప్పుడు వివరాలు ఇచ్చినా.. సరైనవి నమోదు చేయకపోయినా ఎవరైనా కోర్టులో సవాలు చేయొచ్చు. ఫారంలోని ప్రతి గడియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సంబంధం లేని విషయమైతే నాట్‌ అప్లికేబుల్‌ అని రాయాలి. లేకుంటే నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుంది. అభ్యర్థి ఏదో ఒక నియోజకవర్గానికి చెందినవారై ఉంటే సరిపోతుంది. ఆయన్ని బలపరిచే అభ్యర్థి మాత్రం స్థానిక ఓటరై ఉండాలి. గుర్తింపు పొందిన పార్టీ నుంచి అయితే ఒక ఓటరు బలపరిస్తే సరిపోతుంది. స్వతంత్ర అభ్యర్థులైతే పది మంది బలపరచాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని