logo

వానొచ్చేలోపు విత్తనమేద్దాం !

ఎండలు అధికంగానే ఉన్నా.. కొన్ని చోట్ల వర్షాలు పడుతుండటంతో రైతులు భూములను సిద్ధం చేయకుండానే పత్తి విత్తనాలు విత్తుతున్నారు.

Published : 09 Jun 2023 03:53 IST

కూలీల కొరత అధిగమించేందుకు రైతన్న తొందరపాటు

తెలకపల్లి : రాకొండ సమీపంలో వట్టి భూములలో పత్తి విత్తనాలు నాటుతున్న దృశ్యం

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : ఎండలు అధికంగానే ఉన్నా.. కొన్ని చోట్ల వర్షాలు పడుతుండటంతో రైతులు భూములను సిద్ధం చేయకుండానే పత్తి విత్తనాలు విత్తుతున్నారు. వర్షాలు ప్రారంభమైతే కూలీల కొరత, ఎద్దులు అందుబాటులోకి రాక ఇబ్బందులు కలుగుతాయని తొందర పడుతున్నారు. గతేడాది నష్టం వచ్చినా.. ఈ సారి కూడా ఎక్కువగా పత్తి, మొక్కజొన్న పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి, తెలకపల్లి, తాడూరు, అచ్చంపేట, అమ్రాబాద్‌, పదర మండలాల్లో భూములను సిద్ధం చేయకుండానే రైతులు పత్తి విత్తనాలు నాటుతున్నారు. వర్షాలు సక్రమంగా పడకపోతే సరిగ్గా మొలకెత్తవు. రెండేళ్లుగా ఇలాగే విత్తుకుంటే సకాలంలో మొలకెత్తక రైతులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. కేవలం నీటి వసతి ఉంటేనే వట్టి భూముల్లో పత్తి విత్తనాలు నాటుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

చిరుధాన్యాలపై కనిపించని ఆసక్తి..

ప్రభుత్వం ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. చిరుధాన్యాల సాగును పెంచాలని, వాటిని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిరు ధాన్యాల సాగు ఏటా జిల్లాలో వందల ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోంది. ఆముదం పూర్తిగా కనుమరుగైంది. దానిని పెంచేలా వ్యవసాయ శాఖ ఏ మాత్రం కసరత్తు చేయటం లేదు. రైతులకు అవగాహన కల్పించడం లేదు. జిల్లాలో 141 రైతు వేదికలు నిర్మించారు. ప్రతి చోట ఏఈవోను ఏర్పాటు చేశారు. మట్టి నమూనాల సేకరణ సైతం కనిపించలేదు. అవగాహన సదస్సులు నిర్వహిస్తేనే ప్రయోజనం ఉండనుంది.

అవగాహన కల్పిస్తాం..

రైతు వేదికల్లో రైతులకు తరచుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. నీటి వసతి ఉంటే తప్పా వట్టి భూముల్లో పత్తి విత్తనాలను వేసుకోవద్దు. దీనిపై గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం. మంచి వర్షాలు పడిన తర్వాతనే విత్తనాలు నాటుకుంటే మంచిది. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు విస్తృతంగా విజిలెన్స్‌ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్‌కర్నూల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని