logo

ధాన్యం బస్తాల దొంగల అరెస్టు

జల్సాలు చేస్తూ, అక్రమ సంపాదనకు అలవాటు పడి.. అత్యాశతో వరిధాన్యం బస్తాలను అపహరించి సొమ్ము చేసుకుంటున్న దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

Published : 16 Apr 2024 02:56 IST

వెల్దండ గ్రామీణం, న్యూస్‌టుడే : జల్సాలు చేస్తూ, అక్రమ సంపాదనకు అలవాటు పడి.. అత్యాశతో వరిధాన్యం బస్తాలను అపహరించి సొమ్ము చేసుకుంటున్న దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వెల్దండ పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విష్ణువర్దన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. వెల్దండ మండలం పెద్దాపూర్‌ గ్రామ సమీపంలో గల కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ గోదాంను కల్వకుర్తి పట్టణానికి చెందిన సద్గురు రాఘవేంద్ర పారా బాయిల్డ్‌ మిల్‌ యజమాని రమేశ్‌బాబు అద్దెకు తీసుకొని వరి ధాన్యం బస్తాలు నిల్వ చేసుకున్నారు. నిల్వ ఉంచిన వాటిలో నుంచి 3వేల బస్తాలు చోరీకి గురయ్యాయి. గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈనెల 3న వెల్దండ ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించగా డీసీఎం, బొలెరొ డ్రైవర్లుగా పనిచేస్తున్న పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన కేశమోని రాంబాబు, పెద్దకర్పాలకు చెందిన అభిషేక్‌రెడ్డి, గండ్రావుపల్లికి చెందిన కుందేళ్ల మల్లేశ్‌, నాగనోలుకు చెందిన గొడుగు స్వామి ముఠాగా ఏర్పడి ధాన్యం చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిఘా అంతగా లేని గోదాంలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను అపహరించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. పెద్దాపూర్‌ గోదాంలో నుంచి పలుమార్లు డీసీఎం, బొలెరొ వాహనాల్లో 2,600 ధాన్యం బస్తాలను (1,040 క్వింటాళ్లు) నెక్కొండకు చెందిన శ్రీసత్యసాయి పారా బాయిల్డ్‌ రైస్‌మిల్‌కు రూ.19.76 లక్షలకు విక్రయించారు. గతంలో చిన్నంబావి, కోడేరు మండలాల్లో ధాన్యం బస్తాలను అపహరించినట్లు అంగీకరించారు. నలుగురిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి రూ. 5 లక్షలను రికవరీ చేశామన్నారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యహరించిన ఎస్సై రవి, సిబ్బంది కిశోర్‌రెడ్డి, మురళీని సీఐ ప్రత్యేకంగా అభినంధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని