logo

అంతా సీతారామం

రెండో భద్రాదిగా పేరుగాంచిన చారకొండ మండలం శిర్సనగండ్లలోని శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం బుధవారం అశేష భక్తజనం తిలకిస్తుండగా వైభవంగా జరిగింది.

Published : 18 Apr 2024 03:59 IST

శిర్సనగండ్లలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం

కల్యాణోత్సవానికి ముస్తాబు చేసిన సీత, రామ, లక్ష్మణ విగ్రహాలు

చారకొండ (వెల్దండ గ్రామీణం), న్యూస్‌టుడే : రెండో భద్రాదిగా పేరుగాంచిన చారకొండ మండలం శిర్సనగండ్లలోని శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం బుధవారం అశేష భక్తజనం తిలకిస్తుండగా వైభవంగా జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామి వారి కల్యాణోత్సావాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. ఉదయం 10.20 గంటలకు అర్చకులు సీతారాముల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలతో కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఆలయ ఛైర్మన్‌ ఢేరం రామశర్మ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వేద పండితులు మంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలు, వేలాది భక్తుల జైశ్రీరాం నినాదాలు నడుమ జానకీరాముల మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకతో కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. జానకీరాముల కల్యాణోత్సవాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంతో పులకించి పోయారు. భక్తజనం బారులు తీరి శ్రీరాములోరిని దర్శించుకున్నారు. యెన్నం ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.  

ప్రముఖుల హాజరు.. : సీతారాముల కల్యాణం తిలకించేందుకు సీఎం సోదరుడు ఎనుముల తిర్పత్‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, గువ్వల బాలరాజు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి, భారాస, భాజపా ఎంపీ అభ్యర్థులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, భరత్‌ప్రసాద్‌ కల్యాణంలో పాల్గొని తిలకించారు.  నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘనాథ్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఛైర్మన్‌ రామశర్మ, ఈవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ ప్రమీల, మేనేజర్‌ నిరంజన్‌, జడ్పీటీసీ విజితరెడ్డి, ఎంపీపీ నిర్మల, అర్చకులు పాల్గొన్నారు.

కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని